రామగిరి/ నీలగిరి/ సూర్యాపేట, మే 3 : నీట్ ప్రవేశ పరీక్షకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆదివారం జరుగనున్న పరీక్షకు నల్లగొండ జిల్లా కేంద్రంలో ఏడు, సూర్యాపేటలో నాలుగు కేంద్రాలను ఏర్పాటు చేశారు. నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలను శనివారం ఎస్పీ శరత్చంద్ర పవార్‌తో కలిసి కలెక్టర్ ఇలా త్రిపాఠి తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఏడు పరీక్ష కేంద్రాల్లో 2,087 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నట్లు తెలిపారు. పరీక్ష మధ్యాహ్నం 2నుంచి సాయంత్రం 5గంటల వరకు జరుగుతుందన్నారు. ఉదయం 11గంటల నుంచి పరీక్ష కేంద్రాలకు అనుమతి ఇవ్వడం జరుగుతుందని, మధ్యాహ్నం 1:30కు సెంటర్ ప్రధాన గేట్లు మూసివేస్తారని తెలిపారు.
అభ్యర్థులు సకాలంలో పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. పరీక్ష కేంద్రంలో తాగునీరు, విద్యుత్, ఫ్యాన్లు, మెడికల్ సౌకర్యాలన్నింటినీ పునఃపరిశీలన చేయాలని సంబంధిత అధికారులను అదేశించారు. ఆమె వెంట అదనపు కలెక్టర్ రాజ్‌కుమార్, అదనపు ఎస్పీ రమేశ్, ఆర్డీఓ యానాల అశోక్‌రెడ్డి, డీఎస్పీ శివరాంరెడ్డి, నీట్ నోడల్ ఆఫీసర్ శ్రీనివాసులు ఉన్నారు.
సూర్యాపేటలో 890 మంది విద్యార్థులు..
సూర్యాపేటలో పరీక్ష కేంద్రాలను కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ పరిశీలించారు. నాలుగు కేంద్రాల్లో నిర్వహించే పరీక్షకు 890 మంది విద్యార్థులు హాజరు కానున్నట్లు ఆయన తెలిపారు. కలెక్టర్ వెంట అదనపు ఎస్పీ నాగేశ్వర్రావు, ఆర్డీఓ వేణుమాధవరావు, తాసీల్దార్ శ్యాంసుందర్‌రెడ్డి, కృష్ణయ్య, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ జయలత, పరీక్ష కేంద్రం పర్యవేక్షకులు రమేశ్, పద్మ, వినోద, యాదయ్య ఉన్నారు.