రాష్ట్ర ఎన్నికల అధికారితో కలెక్టర్ ఇలా త్రిపాఠి
నల్లగొండ/నీలగిరి, ఫిబ్రవరి 1 : వరంగల్-ఖమ్మం-నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డికి తెలిపారు. మూడు ఉమ్మడి జిల్లాలకు చెందిన కలెక్టర్లు, ఎస్పీలతో ఆయన శనివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల విషయమై ఇప్పటికే రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడినట్లు తెలిపారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు వివిధ నోడల్ కమిటీలు ఏర్పాటు చేయడంతోపాటు బ్యాలెట్ బాక్సులు, పీఓ, ఏపీఓ, సిబ్బంది శిక్షణ, ఓటరు జాబితా తదితర పనులు చేస్తున్నామని తెలిపారు.
రేపటి నుంచి నామినేషన్ల స్వీకరణ
ఈ నెల 3న ఉపాధ్యాయ ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేయనున్న నేపథ్యంలో నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ త్రిపాఠి అధికారులను ఆదేశించారు. ఎస్ఈసీ వీడియో కాన్ఫరెన్స్ అనంతరం ఆమె ఆయా శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. దీనికి సంబంధించి అన్ని నోడల్ బృందాలను ఏర్పాటు చేయడంతోపాటు బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల సిబ్బందికి శిక్షణ తదితర అంశాలపై పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ అమిత్ నారాయణ పలువురు అధికారులు పాల్గొన్నారు.
ఆర్జాల బావి గోదాము పరిశీలన
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో నల్లగొండలోని ఆర్జాలబావిలో ఉన్న రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదామును కలెక్టర్ ఇలా త్రిపాఠి ఎస్పీ శరత్ చంద్ర పవార్‌తో కలిసి పరిశీలించారు. గోదాముల్లో ప్రస్తుతం ఉన్న స్టాక్‌ను వేరే గోదాముల్లోకి తరలించి రెండు గోదాములు స్రాంగ్ రూములకు ఇవ్వాలని ఎస్‌డబ్ల్యూసీ యంత్రాంగాన్ని ఆదేశించారు. అనంతరం ప్రభుత్వ దవాఖాన సమావేశ మందిరంలో గ్రామ పంచాయతీ ఎన్నికల బ్యాలెట్ పేపర్లను ఆమె పరిశీలించారు.ఆమె వెంట ఆమె వెంట అదనపు కలెక్టర్ శ్రీనివాస్, సర్వేల్యాండ్ రికార్డ్సు ఏడీ శ్రీనివాస్, ఆర్డీఓ ఆశోక్‌రెడ్డి, నల్లగొండ తాసీల్దార్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.