భువనగిరి కలెక్టరేట్, నవంబర్ 13 : టీజీపీఎస్సీ గ్రూప్ -3 పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా పగడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ హనుమంతరావు అధికారులకు సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం టీజీపీఎస్సీ గ్రూప్-3 పరీక్షల నిర్వహణపై రీజినల్ కోఆర్డినేటర్స్, స్ట్రాంగ్ రూమ్, డిపార్ట్మెంట్ ఆఫీసర్ జాయింట్ కస్టోడియన్స్, పోలీస్ నోడల్ ఆఫీసర్స్, చీఫ్ సూపరింటెండెంట్స్, ఫ్లైయింగ్ స్వాడ్స్, జాయింట్ రూట్ ఆఫీసర్లతో నిర్వహించిన సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గంగాధర్‌తో కలిసి మాట్లాడారు. బయోమెట్రిక్ విధానంపై అధికారులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా శిక్షణ ఇచ్చి పలు సూచనలు చేశారు.
నూరు శాతం బయోమెట్రిక్ అటెండెన్స్‌ను తప్పనిసరిగా తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో 15 పరీక్షా కేంద్రాల్లో 6,043 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరవుతారని, ఇందులో పురుషులు 3,240 మంది, స్త్రీలు 2,803 మంది ఉన్నారన్నారు. పరీక్షల నిర్వహణకు సంబంధించి చీఫ్ సూపరిటెండెంట్స్-15, బయోమెట్రిక్ అధికారులు-46, అబ్జర్వర్లు-17, జాయింట్ రూట్ అధికారులు-3, ఫ్లైయింగ్ స్వాడ్స్-5, డిపార్ట్మెంట్ అధికారులు-15, ఐడెంటిఫికేషన్ అధికారులు-65, ఇన్విజిలేటర్స్-253 మంది అధికారులను నియమించినట్లు తెలిపారు. ఈ నెల 17న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం12-30గంటల వరకు పేపర్1(జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్) పరీక్ష, సాయంత్రం 3 నుంచి 5:30 గంటల వరకు పేపర్ -2 హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ పరీక్ష ఉంటుందని చెప్పారు. 18వ తేదీ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12-30 గంటల వరకు పేపర్-3 ఎకానమీ అండ్ డెవలప్మెంట్ పరీక్ష జరుగుతుందని తెలిపారు.
అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు ఉదయం 8:30 గంటల వరకు, సాయంత్రం జరిగే పరీక్ష కోసం 1:30 గంటలకు చేరుకోవాలన్నారు. నిర్దేశించిన సమయం తర్వాత అభ్యర్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించరని తెలిపారు. అభ్యర్థులు నలుపు, నీలం బాల్ పాయింట్ పెన్నులు, పెన్సిల్, ఎరేజర్, హాల్ టికెట్ దానిపై అతికించిన ఫొటో, ప్రభుత్వం జారీ చేసిన ఒరిజినల్ పొటో ఐడీ కార్డ్‌ను పరీక్ష హాల్లోకి తీసుకెళ్లాలన్నారు. అన్ని సమాధానాలు బాల్ పాయింట్ పెన్ (నీలం/నలుపు)తో మాత్రమే రాయాలని, సెల్‌ఫోన్, చేతి గడియారాలు, క్యాలిక్యులేటర్లతోపాటు ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించరని తెలిపారు. ట్రాఫిక్‌ను దృష్టిలో ఉంచుకొని అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి సకాలంలో చేరుకోవాలన్నారు. పరీక్ష జరిగేటప్పుడు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని, పరీక్ష ఎంట్రె న్స్ గేట్, పరీక్ష కేంద్రాల్లో టేబుల్, కుర్చీలు ఏర్పా టు చేసి, శానిటైజ్ చేపట్టాలన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద ఫస్ట్ ఎయిడ్ కిట్, అంబులెన్సు, ఏఎన్ఎం, మందులను అందుబాటులో ఉంచాలని చెప్పారు. సమావేశంలో భువనగిరి ట్రాఫిక్ ఏసీపీ ప్రభాకర్‌రెడ్డి, యాదగిరిగుట్ట ఏసీపీ సైదులు, జాయింట్ కస్టోడియన్, చీఫ్ సూపరింటెండ్లు, డిపార్ట్మెంట్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.