యాదాద్రి భువనగిరి, మార్చి 17 (నమస్తేతెలంగాణ) : భువనగిరి పార్లమెంట్ పరిధిలో ఎన్నికలను పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహిస్తామని, ఇందుకు అన్ని పార్టీలు సహకరించాలని కలెక్టర్, రిటర్నింగ్ అధికారి హనుమంతు కె. జెండగే కోరారు. ఎలక్షన్స్ కోసం ఇబ్బందులు లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కలెక్టర్ కార్యాలయంలో ఆదివారం అడిషనల్ కలెక్టర్లు గంగాధర్, బెన్ షాలోమ్, ఆర్డీఓ అమరేందర్‌తో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు మొత్తం 18,00,398 ఓటర్లు ఉన్నారని, అందులో 8,94,789మంది పురుషులు, 9,05,531 మంది మహిళలు ఉన్నారని వివరించారు. ఇబ్రహీంపట్నలో 3,37,389 ఓటర్లు, మునుగోడులో 2,56,269, భువనగిరిలో 2,19,688, నకిరేకల్‌లో 2,52,906, తుంగతుర్తిలో 2,58,447, ఆలేరులో 2,34,262, జనగాంలో 2,41,437 మంది ఓటర్లు ఉన్నారని చెప్పారు. నామినేషన్ ముందురోజు వరకు కూడా ఓటర్లుగా నమోదు చేసుకోవచ్చని సూచించారు. ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటును వినియోగించుకోవాలని కోరారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరిగిందని, పార్లమెంట్‌లోనూ అత్యధికంగా నమోదయ్యేలా సహకరించాలన్నారు.
2,141పోలింగ్ కేంద్రాలు
పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు 2,141పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని కలెక్టర్ అన్నారు. ఓటరుకు రెండు కిలోమీటర్ల పరిధిలో పోలింగ్ కేంద్రాలు ఉండేలా చర్యలు తీసుకున్నామని, అవసరమైన మేర బ్యాలెట్, కంట్రోల్ యూనిట్లు, వీవీ ప్యాట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి పకడ్బందీగా అమలు చేస్తామన్నారు. పార్లమెంట్ పరిధిలో 23ఫ్లయింగ్ స్కాడ్లు, 23 స్టాటిస్టికల్ సర్వేయల్ టీమ్‌లు, 9 వీడియో వీవింగ్ టీమ్‌లు క్షేత్రస్థాయిలో పనిచేస్తాయని తెలిపారు. ఓటర్లకు ఏమైనా సమస్యలు ఉంటే సీ విజిల్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చని, వంద నిమిషాల్లో చర్యలు తీసుకుంటామన్నారు. అదే విధంగా 1950 నంబర్‌కు కాల్ చేయొచ్చని వివరించారు. ఎన్నికల నియమావళికి సంబంధించి ఫిర్యాదులు చేస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎన్నికల నియమావళి దృష్టిలో ఉంచుకుని జూన్ ఆరో తేదీ వరకు ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు తెలిపారు.
ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం
ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో మతం, కులం, ప్రాంతంపై విద్వేషాలు పెంచే విధంగా వ్యాఖ్యలు చేయడం నిషేధమని కలెక్టర్ అన్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడం, బెదిరింపుకులకు పాల్పడటం, తప్పుడు ప్రచారాలు చేయడంపై చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు సువిధ పోర్టల్ ద్వారా రాజకీయ పార్టీలు, అభ్యర్థులకు సమావేశాలు నిర్వహించుకునేలా అనుమతిస్తామని తెలిపారు. ఎవరు ముందు దరఖాస్తు చేసుకుంటే వారికి అనుమతి ఉంటుందన్నారు. రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు లౌడ్ స్పీకర్లు వినియోగించడానికి వీలులేదన్నారు. రాజకీయ పార్టీలకు సంబంధించి వాల్ రైటింగ్, ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు, ఫొటోలను ప్రభుత్వ కార్యాలయాల్లో 24గంటల వ్యవధిలో, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, పెట్రోల్ బంక్‌లు తదితర ప్రాంతాల్లో 48గంటల వ్యవధిలో, అనుమతి లేని ప్రైవేట్ స్థలాల్లో 72గంటల వ్యవధిలో పూర్తిస్థాయిలో తొలగిస్తామన్నారు. ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం ఉన్నందున ఎవరూ నిర్వహించరాదని స్పష్టం చేశారు. అనంతరం రాజకీయ పార్టీలతో సమావేశమయ్యారు.
రూ. 50వేలకు మించి నగదుతో ప్రయాణించొద్దు : డీసీపీ
డిప్యూటీ పోలీస్ కమిషనర్ రాజేశ్ చంద్ర మాట్లాడుతూ ఎన్నికల కోడ్ అమల్లోకి రాగానే ప్రతి ఒకరికీ నిబంధనలు వర్తిస్తాయన్నారు. ఎన్నికల ప్రక్రియకు పూర్తి బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి తొమ్మిది చెక్ పోస్టుల ద్వారా పూర్తి నిఘా ఉంటుందని వివరించారు. పార్లమెంట్ పరిధిలో 23 చెక్ పోస్టులు ఉంటాయన్నారు. బంగారం, నగదు, మద్యం అక్రమ రవాణా జరుగకుండా, అలాగే గంజాయి, మత్తు పదార్థాల రవాణా జరుగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఎన్నికల దృష్ట్యా ప్రజలు ఆధారాలు లేకుండా రూ. 50వేలకు మించి నగదుతో ప్రయాణించవద్దని, ఒక వేళ తరలిస్తే ఆధారాలను వెంటబెట్టుకోవాలని సూచించారు. ప్రతిరోజూ తనిఖీల్లో జప్తు చేసిన సొమ్మును జిల్లాలో ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ కమిటీకి అప్పగిస్తామన్నారు. ఆధారాలు సమర్పిస్తే గ్రీవెన్స్ కమిటీ నగదు విడుదల చేస్తుందని తెలిపారు. తనిఖీల నిర్వహణలో ప్రతి పనిని వీడియోగ్రఫీ చేస్తామన్నారు.