నాడు భూమికి పచ్చని రంగేసినట్లు పొలాలు.. అంతటా జల సవ్వడులు.. నిండు కుండలా చెరువులు.. కానీ ఏడాది తిరుగకముందే సీన్ రివర్స్ అయ్యింది. బీళ్లుగా మారిన భూములు.. ఒట్టిపోయిన బావులు.. అడుగంటిన భూగర్భ జలాలు.. చుక్క నీరు లేని చెరువులు.. జిల్లాలో ఒక్కసారిగా పరిస్థితి మారింది. సాగు నీటికి, రైతన్నకు కష్టాలు మొదలయ్యాయి. కాళేశ్వరం జలాలు ఎప్పుడొస్తాయా అని ఆశగా అన్నదాతలు
వట్టిపోతున్న బోర్లు..
ఈ ఏడాది భూగర్భ జలాలు భారీగా అడుగంటాయి. గతేడాది జూలైతో పోలిస్తే ఈ ఏడాది 6.16 మీటర్ల లోతులోకి భూగర్భ జలాలు పడిపోయాయి. గతేడాది జూలైలో 4.7 మీటర్ల లోతులోనే ఉండగా, ఈ సారి ఏకంగా 10.90 మీటర్ల లోతులోకి ఇంకిపోయాయి. సంస్థాన్ నారాయణపురంలో 18.58 మీటర్లలోతులో నీళ్లు ఉన్నాయి. బొమ్మలరామారంలో 14.29, తుర్కపల్లిలో 13.08, మోత్కూరులో 12.06, భువనగిరిలో 11.28, యాదగిరిగుట్టలో 11.05, గుండాలలో 8.86 మీటర్ల కింద భూగర్భ జలాలు ఉన్నాయి. మరోవైపు గ్రౌండ్ వాటర్ లేకపోవడంతో బోర్లు, బావులు ఎండిపోతున్నాయి. చేసేదేం లేక కొంత మంది రైతులు మళ్లీ కొత్త బోర్లు వేస్తున్నారు. లక్షలు ఖర్చు పెట్టి పొలాలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు.
సాగుకు వెనుకంజ..
వానకాలం సీజన్‌కు సంబంధించి సాగు పనులు నెమ్మదిగా నడుస్తున్నాయి. వర్షాలు లేక, సాగు నీరు అందక పొలం పనులు ముందుకు సాగడంలేదు. ఈ సీజన్లో జిల్లా వ్యాప్తంగా 4,59,850 ఎకరాల్లో సాగు జరుగుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇప్పటికే అనేక చోట్ల రైతులు నారుమడులు దున్నుకొన్నారు. కానీ నీటి వనరులు లేకపోవడంతో వరి నాట్లు పెట్టేందుకు ముందుకు రావడంలేదు. కొన్ని చోట్ల వరినాట్లు పెట్టినా సరిపడా నీళ్లు లేక ఎండిపోయే దశకు చేరుకుంటున్నాయి. మోత్కూరు, గుండాల, అడ్డగూడూరు, తుర్కపల్లి మండలాల్లో సాగుకు తిప్పలు తప్పడంలేదు.
మరో రెండు వారాలు ఇదే పరిస్థితి కొనసాగితే దారుణంగా ఉంటుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక మరికొందరు భూములు సాగు చేసేందుకు వెనుకడుగు వేస్తున్నారు. ఎకరం ఉన్నోళ్లు, అర ఎకరమే సాగు చేస్తున్నారు. కాలం కలిసిరానప్పుడు పెట్టుబడి పెట్టి.. ఇబ్బందులు పడటం ఎందుకనే ధోరణిలో ఉన్నారు. ఇక పత్తి రైతులకు మాత్రం అడపదడపా కురుస్తున్న వర్షాలతో కాస్త ఉపశమనం లభిస్తున్నదని చెప్పవచ్చు.
చెరువుల్లో చుక్క నీరు లేకపాయె..
ఈ ఏడాది వర్షాలు సైతం అంతంత మాత్రంగానే కురుస్తున్నాయి. భారీ వర్షాలు అన్న ముచ్చటే లేదు. ఓ వారం రోజులు ముసురుతో మురిపించి పోయింది. గతేడాది జూలై వరకు 68శాతం అధికంగా వర్షాలు కురిస్తే.. ఈ సారి ఏకంగా మైనస్ నాలుగు శాతం వర్షపాతం నమోదవడం గమనార్హం. ఇక మరోవైపు చెరువుల్లో చుక్క నీరూ లేదు. జిల్లాలో 803 చెరువులకుగానూ 428 చెరువుల్లో మాత్రమే 25శాతం లోపు నీళ్లు ఉన్నాయి. 205 చెరువుల్లో 25 శాతం నుంచి 50శాతం వరకు, 68చెరువుల్లో 50 నుంచి 75శాతం వరకు, 40శాతం చెరువుల్లో 100శాతం నీళ్లు ఉన్నాయి.
నాడు.. నేడు..
ఈ ఏడాది రైతులు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. పదేండ్లలో ఎన్నడూ లేని విధంగా సాగునీటి కష్టాలు మొదలయ్యాయి. గతంలో పలు మండలాల్లో కాళేశ్వరం జలాలు పరవళ్లు తొక్కాయి. ముఖ్యంగా గుండాల, అడ్డగూడూరు, మోత్కూరు, బొమ్మలరామారం, తుర్కపల్లి, యాదగిరిగుట్ట మండలాల్లో పలు గ్రామాలకు కాళేశ్వరం జలాలు అందేవి. తుర్కపల్లి మీదుగా వచ్చిన జలాలు భువనగిరి మండలంలోని చెరువుల్లోకి చేరేవి. దాంతో చెరువులు, కాల్వల్లోకి పుష్కలంగా నీరు వచ్చి చేరేది. చెక్‌డ్యామ్‌లు నిండుకుండలా దర్శనమిచ్చేవి.
ఫలితంగా భూగర్భ జలాలు కూడా భారీగా పెరిగాయి. రైతులకు సాగునీటికి కష్టాలు లేకపోవడంతో సంతోషంగా పంటలు సాగు చేసుకున్నారు. కేసీఆర్ ప్రభుత్వం రైతుబంధు అందించడంతో రంది లేకుండా ధాన్యం పండించి లాభాలు గడించారు. కానీ ఈ సారి పరిస్థితి తారుమారైంది. కాళేశ్వరం జలాలు ఇంకా జిల్లాను తాకలేదు. నీళ్లు అందించేందుకు ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవడంలేదని రైతులు వాపోతున్నారు. కాళేశ్వరం జలాలు వస్తే నీటి సమస్య తీరుతుందని చెప్తున్నారు.
చెరువులోకి నీరు వదలాలి
సంవత్సర కాలంగా వర్షాలు సరిగ్గా కురువక పోయినా నాకున్న బోరు ఆధారంగా రెండెకరాల్లో వరినాటు పెట్టాను. ఈసారైనా వర్షాలు సమృద్ధిగా కురుస్తాయనే ఆశతో పంట సాగు చేశా. మొన్నటిదాకా కొద్దో గొప్పో బోరు నుంచి నీళ్లు వచ్చేవి. ఆగస్టు నెల వచ్చిన ఇంతవరకు వర్షాలు మంచిగా కురవలేదు. చెరువులో నీళ్లు లేకపోవడంతో భూగర్భ జల మట్టం పడిపోతున్నది. బోరు నుంచి నీళ్లు రావడం తగ్గిపోయింది. వర్షాలు కురువకపోతే వారంలో నా పొలం మొత్తం ఎండిపోతుంది. ప్రభుత్వం కొండ పోచమ్మ ప్రాజెక్ట్ ద్వారా శామీర్‌పేట వాగులోకి, చెరువులోకి నీళ్లు వదిలితే భూగర్భజలాలు పెరుగుతాయి. రైతులు పంట నష్టపోకుండా ఉంటారు.
– ఎల్లబోయిన శ్రీనివాస్, రైతు, బొమ్మలరామారం