సూర్యాపేట, ఆగస్టు 26 : నాగారం మండలం పసునూరు గ్రామానికి చెందిన మందడి వెంకటేశ్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుండి డాక్టరేట్ పొందారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశోధన ఉమ్మడి ప్రవేశ పరీక్ష 2021లో వెంకటేశ్రెడ్డి అర్థశాస్త్రంలో రాష్ట్రస్థాయి 7వ ర్యాంక్ సాధించాడు. స్థానికేతరుల కోటా (ఓపెన్ మెరిట్) లో ప్రవేశం పొందాడు. ఆచార్య మధుబాబు పర్యవేక్షణలో గుంటూరు జిల్లాలోని చిన్న, సన్నకారు రైతులపై ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం ప్రభావం అనే అంశంపై పీహెచ్డీ థీసిస్ సమర్పించి వైవా పూర్తి చేశాడు. ఉప కులపతి ఆచార్య కంచర్ల గంగాధర్ రావు ఆదేశాల మేరకు వెంకటేశ్రెడ్డికి సోమవారం డాక్టరేట్ ప్రదానం చేసినట్లు పరిశోధన విభాగం సమన్వయకర్త డాక్టర్ పి.సుధాకర్ వెల్లడించారు. ఈ సందర్భంగా వెంకటేశ్రెడ్డికి ఆచార్య కడిమి మధుబాబు అభినందనలు తెలిపారు.