కోదాడ, జులై 09 : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక వ్యతిరేక చట్టాలను తక్షణమే రద్దు చేయాలని కార్మిక సంఘాల నేతలు అన్నారు. కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం కోదాడలో ఏఐటీయూసీ, సీఐటీయూ, ఐఎఫ్టీయూ, ఐఎన్టీయూ, సీబీఆర్ఎస్కేవీ ఆధ్వర్యంలో కోదాడ ప్రధాన రహదారిపై భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. రంగా థియేటర్ చౌరస్తా వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకులు, నేతలు మేకల శ్రీనివాసరావు, ములకలపల్లి రాములు, వక్కవంతుల కోటేశ్వరరావు, ఎస్కే నయీబు మట్లాడుతూ..ఎన్నో ఉద్యమాలు, పోరాటాలు చేసి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతుందని విమర్శించారు.
కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని అనేక సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. రోజుకు 8 గంటల నుండి 10 గంటల సమయాన్ని పెంచి కార్మికుల శ్రమశక్తిని పెట్టుబడిదారులకు, కార్పొరేట్లకు దారాదత్తం చేసేందుకు సమాయత్తమైందని దుయ్యబట్టారు. తక్షణమే కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయకపోతే తమ సంఘాల ఆధ్వర్యంలో సమరశీల పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఈ ధర్నాలో కార్మిక సంఘాల నాయకులు ముత్యాలు, లతీఫ్, పోతురాజు, సత్యనారాయణ జానీ, కొండలు, ఉదయగిరి, నరసింహారావు, రవి, దొడ్డ వెంకటయ్య, మేదర లలిత, చలిగంటి వెంకట్, కాసాని మల్లయ్యగౌడ్, ఇతర నాయకులు పాల్గొన్నారు.
Kodada : ‘కార్మిక వ్యతిరేక చట్టాలను తక్షణమే రద్దు చేయాలి’