యాదాద్రి భువనగిరి, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ) : మహిళా సంక్షేమానికి అండగా రాష్ట్ర సర్కారు నిలుస్తున్నది. దేశంలో ఎక్కడా లేని విధంగా పథకాలు అమలు చేస్తున్నది. కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, ఆరోగ్యలక్ష్మి, షీటీమ్స్, సఖి కేంద్రాలు తదితర ఎన్నో కార్యక్రమాలు కొనసాగిస్తున్నది. మరింత అండగా నిలిచేందుకు ఈ ఏడాది ప్రపంచ మహిళా దినోత్సవం రోజున మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రతి మంగళవారం ఆస్పత్రుల్లో మహిళలకు ప్రత్యేకంగా వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చింది. ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆ వెంటనే మందులు ఇస్తున్నారు. అవసరమైతే రిఫరల్ ఆస్పత్రులకు పంపిస్తున్నారు. ప్రస్తుతం బీబీనగర్, గుండాల పీహెచ్సీలలో క్లినిక్‌లు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాలో మరో నాలుగు మహిళా ఆరోగ్య కేంద్రాలను ప్రభుత్వం మంజూరు చేసింది. సంస్థాన్ నారాయణపూర్, యాదగిరిగిగుట్ట, వలిగొండ, కొండమడుగు పీహెచ్సీలో ఏర్పాటు చేయనున్నది. ఇప్పటికే బీబీనగర్ పీహెచ్సీలో మహిళా ఆరోగ్య కేంద్రం కొనసాగుతున్న నేపథ్యంలో కొండమడుగు బదులు పోచంపల్లిలో ఏర్పాటు చేయాలని ప్రతిపాదనను అధికారులు పంపించినట్లు తెలిసింది. త్వరలోనే దీనిపై స్పష్టత రానున్నట్లు సమాచారం. నాలుగు కేంద్రాల్లో ప్రతి మంగళవారం అతివలకు సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
సాధారణంగా మహిళలు ఎదుర్కొనే ఎనిమిది రుగ్మతలకు సంబంధించి పరీక్షలు, చికిత్సలు చేస్తున్నారు. ప్రస్తుతం కేన్సర్ నిర్ధారణ పరీక్షలతోపాటు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, బరువు పెరుగడం, తగ్గడం, రుతు స్రావ సమస్యలు, ఎనీమియా, పీసీవోడీ తదితర పరీక్షలు చేస్తున్నారు. ఇవే కాకుండా మైక్రో న్యూట్రియంట్ డెఫిషియెన్సీ, వెయిట్ మేనేజ్మెంట్, సెక్సువల్ ట్రాన్స్మిటెడ్ మేనేజ్మెంట్, ఇన్ఫెర్టిలిటీ మేనేజ్మెంట్, మెనోపాజ్ మేనేజ్మెంట్, ఐవీ, థైరాయిడ్, విటమిన్ డీ3, బీ12 తదితర వాటిని ఆస్పత్రుల్లో స్క్రీనింగ్ చేస్తున్నారు. మరోవైపు ఆరోగ్య మహిళ సేవలు అందుబాటులోకి రావడంతో మహిళలకు అన్ని విధాలుగా మేలు జరుగుతున్నది.
అతివల ఆరోగ్యమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆరోగ్య మహిళ కార్యక్రమం మెరుగైన సత్ఫలితాలను ఇస్తున్నది. ప్రతి మంగళవారం పీహెచ్‌సీలకు తరలివస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లాలోని రెండు పీహెచ్సీలలో 3,726మంది మహిళలకు సేవలు అందించారు. 2,823మందికి ఓరల్ కేన్సర్ పరీక్షలు చేయగా, ఇద్దరికి పాజిటివ్‌గా తేలింది. 2,787మందికి బ్రెస్ట్ కేన్సర్ పరీక్షలు చేయగా, ముగ్గురు వ్యాధి ఉన్నట్లు, 20మందికి సస్పెక్టెడ్గా తేల్చారు. 990మందికి సర్వికల్ కేన్సర్, 1444మందికి ఎంఎన్డీతోపాటు మరికొందరికి ఎనీమియా, మోనోపాజ్, పీకాస్ తదితర పరీక్షలు నిర్వహించారు.