సూర్యాపేట, మే 9 (నమస్తే తెలంగాణ) : అనేక అవినీతి ఆరోపణలకు నిలయంగా మారిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ చివరకు కొవిడ్ సమయంలో వచ్చిన నిధులను కూడా వదల లేదని తెలిసింది. కొద్ది రోజులుగా వైద్య ఆరోగ్యశాఖలో అక్రమాలపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో జరుగుతున్న ఉన్నత స్థాయి విచారణలో 2023 జూన్‌లో వచ్చిన కొవిడ్ డబ్బులను కూడా డ్రా చేసి పక్కదారి పట్టించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ నిధులు ఎటు పోయాయని ఆరా తీయగా ఓ అధికారి ఫారిన్ ట్రిప్ కోసం కింది స్థాయి అధికారులకు చెక్కులు ఇచ్చి డబ్బులు డ్రా చేశారట. అవినీతికి మారుపేరుగా మారిన సూర్యాపేట జిల్లా వైద్య ఆరోగ్యశాఖ హైదరాబాద్‌లోని ఉన్నతాధికారులకు తలనొప్పిగా మారినట్లు తెలుస్తున్నది.
జిల్లా అధికారులు అవకాశం ఉన్నంత వరకు ఎంత దొరికితే అంత జేబుల్లో వేసుకుంటున్నారని సొంత కార్యాలయంతో పాటు, ప్రైవేట్ ఆసుపత్రుల నుంచి నిరంతరాయంగా ఫిర్యాదులు వెళ్తున్నట్లు సమాచారం. ఇప్పటికే కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్‌లో పని చేసే మహిళా ఉద్యోగులు ప్రసూతి కోసం, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారు కార్యాలయానికి వెళ్లకున్నా సుమారు 25 మంది వేతనాలు కాజేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అంతే కాకుండా జిల్లా వ్యాప్తంగా నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఆసుపత్రులు, డయాగ్నస్టిక్ సెంటర్లు, స్కానింగ్ సెంటర్లకు లక్షలాది రూపాయలు తీసుకొని అనుమతులు ఇవ్వడం, రెన్యూవల్ చేయడం లాంటివి ఇటీవల బహిర్గతమైన విషయం విదితమే. ఇలా అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ శాఖ గత నెలలో ఎన్హెచ్ఎం నుంచి రూ.30,50,000, అలాగే ఫ్లెక్సీల ప్రింటింగ్ పేరిట రూ.4,71,420 కేంద్ర నిధులు రాగా మెజారిటీ స్వాహా చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
సూర్యాపేట జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయం కొవిడ్ లాంటి ఆపద సమయంలో అత్యవసర ఖర్చుల కోసం వచ్చిన నిధులను కూడా పక్కదారి పట్టించినట్లు తెలిసింది. వాస్తవానికి 2020 నుంచి రెండేండ్ల పాటు కొవిడ్ ఎఫెక్ట్ ఉండగా 2023 జూన్‌లో ఎన్హెచ్ఎం నుంచి నిధులు వచ్చాయి. ఈ నిధులు పక్కదారి పట్టినట్లు ఎవరో ఫిర్యాదు చేసింది కాదని, విపరీతంగా అవినీతి ఆరోపణలు రావడంతో ఉన్నతాధికారులు కొద్ది సంవత్సరాలుగా జరిగిన అన్ని లావాదేవీలపై విచారణ చేస్తుండగా కొవిడ్ నిధులు స్వాహా చేసినట్లు తేలిందని తెలిసింది. దాదాపు రూ.5లక్షలు రాగా దేనికి ఖర్చు చేశారో కనీసం బిల్లులు కూడా లేనట్లు గుర్తించినట్లు సమాచారం. 2023 జూన్ 15 నుంచి 22 మధ్యలో ఓ తాసీల్దారు, ఒక కుక్‌తోపాటు ముగ్గురు సొంత శాఖ ఉద్యోగుల పేరిట చెక్కులను ఇచ్చి రూ.నాలుగు లక్షలు డ్రా చేసినట్లు తెలిసింది. ఫారిన్ ట్రిప్ వెళ్తూ కింది స్థాయి అధికారులతో డ్రా చేయించి డబ్బులు తీసుకొని వెళ్లినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే విచారణలో నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ ఆసుపత్రులు, డయాగ్నస్టిక్ సెంటర్లు, స్కానింగ్ సెంటర్లు నడుస్తున్నట్లు విచారణ చేసి నిర్ధారించినా అవి యథావిధిగా నడుస్తున్నాయి. వాటికి అనుమతులు ఇచ్చిన, రెన్యూవల్ చేసిన బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల దాదాపు రూ.25 లక్షలు చేతులు మారినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారుల విచారణలో ఇంకా ఎన్ని బయటకు వస్తాయి.. బాధ్యులపై ఏమైనా చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది.