మాడ్గులపల్లి, జూన్ 9: మండలంలోని గండ్రవాని గూడెం ఐకేపీ కేంద్రంలో వడ్ల కొనుగోలు ప్రక్రియ నిలిపివేతను నిరసిస్తూ రైతులు రోడ్డెక్కారు. మంగళవారం మండల పరిధిలోని కుకడం వద్ద నారట్పల్లి-అద్దంకి జాతీయ రహదారిపై రైతులు రాస్తారోకో నిర్వహించారు. వేములపల్లి పీఏస్సీఎస్ ఆధ్వర్యంలో నడుస్తున్న కొనుగోలు కేంద్రం నిర్వాహకులు, అధికారుల నిర్లక్ష్యం వల్లే తాము రోడ్డుపైకి రావాల్సి వచ్చిందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ కేంద్రానికి వడ్లు తెచ్చి రోజులు గడుస్తున్నా నిర్వాహకులు కొనుగోలు చేయడం లేదని ధ్వజమెత్తారు.
ఆకాశం మబ్బుపట్టి, ఎప్పుడు వర్షం వస్తుందో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. ధాన్యం తడిసిపోతే తాము తీవ్రంగా నష్టపోతామని, రోజుల తరబడి కేంద్రాల వద్దే పడిగాపులు కాస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. రైతులు ఒకసారిగా హైవేపై బైఠాయించడంతో ఇరువైపులా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదురొన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, స్థానిక అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని రైతులతో చర్చలు జరిపారు. ఉన్నతాధికారులతో మాట్లాడి తక్షణమే ధాన్యం కొనుగోలు ప్రక్రియను ప్రారంభిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు. త్వరితగతిన కొనుగోళ్లు పూర్తి చేయకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా రైతులు హెచ్చరించారు.