నాగార్జునసాగర్, జూన్ 23 : నాగార్జునసాగర్ హిల్‌కాలనీలో గల అంగన్వాడీ కేంద్ర ప్రాంగణం ఆకతాయిలకు, మందుబాబులకు అడ్డాగా మారింది. చీకటి అయిందంటే చాలు ఈ ప్రాంగణమంతా మద్యం సేవించడానికి, అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారింది. నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీలోని కెనాల్స్ రెండో వార్డులో గతంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉండేది. అది మూత పడడంతో గత కొంతకాలంగా ఐసీడీఎస్ వారు మూడో అంగన్వాడీ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. అంగన్వాడీ కేంద్రానికి తాళాలు వేసుకుని వెళ్లిపోగానే ర్రాతి అయితే చాలు ఆకతాయిలు, మందుబాబులు యదేచ్ఛగా తమ కార్యకలాపాలు మొదలు పెడుతున్నారు.
ముఖ్యంగా ఆదివారం అంగన్వాడీ కేంద్రానికి సెలవు దినం కావడంతో సోమవారం ఉదయం అంగన్వాడీకి రాగానే పగిలిన మద్యం సీసాలు, తాగి పడేసిన మద్యం సీసాలు, వాటర్ బాటిళ్లు, గ్లాస్లు దర్శనమిస్తుంటాయి. మందుబాబులు మద్యం తాగి సీసాలను పగలగొడుతుండడంతో అంగన్వాడీ కేంద్రానికి వచ్చే చిన్న పిల్లలు, గర్భిణీలు, బాలింతలు త్రీవ ఇబ్బందులకు గురవుతున్నారు.