నల్లగొండ సిటీ, నవంబర్ 2 : నల్లగొండ జిల్లా కనగల్ మండలం శాబ్దులాపురం గ్రామంలో పండుగ పూట విషాదం జరిగింది. ఏఎమ్మార్పీ ప్రధాన కాల్వలో శనివారం తండ్రీ కొడుకు పడి గల్లంతయ్యారు. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం గ్రామానికి చెందిన సురవరం దామోదర్(40), అతని కుమారుడు ఫణీంద్రవర్మ అలియాస్ బిట్టు (14)స్నానం చేయడానికి గ్రామ సమీపంలో ఉన్న ఏఎమ్మార్పీ ప్రధా న కాల్వ వద్దకు వెళ్లారు.
కాల్వలో ఈత కొడుతున్న సమయంలో ఫణీంద్రవర్మ వరద తాకిడికి కొట్టుకుపోయాడు. ఇది గమనించిన తండ్రి దామోదర్ కొడుకును కాపాడే సమయంలో కాల్వలోకి దిగగా వరద తాకిడి ఎక్కువగా ఉండడంతో అత ను కూడా కొట్టుకు పోయాడు. ఇదే సమయంలో వారి బంధువులు కొందరు అక్కడే ఉన్నప్పటికీ కాల్వలో వరద అధికంగా ఉండడంతో ఏమీ చేయలేక పోయారు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి చేరుకొని గాలిస్తున్నారు.
దామోదర్ కుటుంబం గత కొంత కాలంగా నల్లగొండ మండలం బుద్దారంలో ఉంటున్నారు. దీపావళి పండుగ కావడంతో తమ సొంత ఊరికి వచ్చారు. పండుగ పూట తండ్రీ కొడుకులు గల్లంతు కావడంతో ఆ కుటుంబంలో, గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సంఘటనా స్థలానికి ఫైర్ ఇంజిన్‌తోపాటు గజ ఈతగాళ్లతో గాలిస్తున్నారు. కేసు దర్యాస్తు చేస్తున్నట్లు ఎస్ఐ విష్ణుమార్తి తెలిపారు.
బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టులో ఒకరు..
నార్కట్‌పల్లి : నార్కట్‌పల్లి మండలంలోని బ్రాహ్మణ వెల్లెంల(ఉదయ సముద్రం ప్రాజెక్టు)లో శనివారం సాయంత్రం ఈతకు వెళ్లిన వ్యక్తి గల్లంతయ్యాడు. నల్లగొండ మండలం అప్పాజిపేటకు చెందిన గుండాల శంకరయ్య(50) చిట్యాల మండలం నేరడ గ్రామంలోని తన వియ్యంకుడి ఇంటికి దీపావళి పండుగకు వచ్చాడు. ఉదయ సముద్రం ప్రాజెక్టులోకి అధికారులు ట్రయల్న్‌ల్రో భాగంగా నీటిని విడుదల చేస్తుండడంతో దానిని చూసేందుకు బ్రాహ్మణ వెల్లెంలకు వెళ్లాడు.
ప్రాజెక్టులో ఈత కొట్టేందుకు దిగాడు. నీటి ప్రవాహం అధికంగా రావడంతో కొద్దిదూరం కొట్టుకు పోయి నీటిలో మునిగి పోయాడు. స్థానికులు, బంధువులు రక్షించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. స్థానికుల సమాచారంతో నార్కట్‌పల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొన్నారు. నల్లగొండ నుంచి అగ్నిమాపక సిబ్బందిని రప్పించి గాలింపు జరుపుతున్నట్లు ఎస్ఐ క్రాంతికుమార్ తెలిపారు.