నల్లగొండ విద్యా విభాగం (రామగిరి), ఏప్రిల్ 14 : అణగారిన వర్గాల కోసం హక్కులు, చట్టాలను రూపొందించిన ఆత్మ బంధువు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని సోమవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని మర్రిగూడ బైపాస్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఆయన పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం డీఈఓ కార్యాలయం ఎదురుగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్సీ పాల్గొని మాట్లాడారు. నిమ్న కులంలో పుట్టి ఎన్నో అవమానాలకు గురై, చదువు నేర్చుకుని అంబేద్కర్ ప్రపంచ మేధావిగా నిలబడ్డారన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ హక్కులను రూపొందించడం కోసం ఆయన ఎంతో కృషి చేశారన్నారు. అలాంటి ప్రపంచ మేధావి మన దేశంలో పుట్టడం అందరికీ గర్వకారణమని కొనియాడారు. ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మాట్లాడుతూ.. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అన్ని వర్గాల హక్కుల కోసం పోరాడిన మహోన్నత వ్యక్తి అన్నారు. భారత రాజ్యాంగం ద్వారా అందరికీ సమాన హక్కులు కల్పించేందుకు కృషి చేశారని, ప్రపంచ మేధావులలో ఆయన ఒకరని, ఆయనను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో ముందుకు సాగాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. దేశంలో, ప్రపంచంలో ఎటువైపు చూసినా అంబేద్కర్ మార్కు కనిపిస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సైతం భూ భారతి పోర్టల్‌ను ఈరోజు నుండే అమలులోకి తీసుకురానుందని, రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు ఈ రోజే భూభారతి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారని, ఈరోజు చరిత్రలో నిలిచిపోయే రోజని ఆమె అన్నారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ.. చదువును ఆయుధంగా చేసుకుని సామాజిక మార్పు తీసుకొచ్చిన మహానుభావుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అన్నారు. మన దేశ పరిస్థితులను అధిగమించి ఎలా ముందుకు వెళ్లాలో కూడా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆనాడే రాజ్యాంగంలో పొందుపరిచారన్నారు. అనంతరం ఎమ్మెల్సీలు భారత రాజ్యాంగ పుస్తకాన్ని ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, అడిషనల్ ఎస్పీ రమేశ్, ఇన్చార్జి సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్, జడ్పీ సీఈఓ ప్రేమ్ కరణ్‌రెడ్డి, విశ్రాంత ఐఏఎస్ అధికారి చొల్లేటి ప్రభాకర్, నల్లగొండ మార్కెట్ కమిటీ చైర్మన్ రమేశ్, బీసీ సంఘం నాయకులు చక్రహరి రామరాజు, ఇతర నాయకులు పాల్గొన్నారు.
Nlg