సూర్యాపేట, జనవరి 4 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి శనివారం లబ్ధిదారులకు కేటాయించారు. అందరి సమక్షంలో చిన్నారులతో లాటరీ తీయించి ఇంటి నెంబర్లు ప్రకటించారు. ఈ సందర్భంగా జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ గతేడాది ఎన్నికలకు ముందే డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు యజమానులయ్యారని, ఎన్నికల కోడ్ అడ్డు రావడం, కొన్ని పనులు పూర్తికానందున కేటాయింపు ఆలస్యమైందని తెలిపారు. ప్రస్తుతం పనులన్నీ పూర్తవడంతో లబ్ధిదారులు ఇండ్లను కేటాయించినట్లు చెప్పారు.
ఈ క్రమంలో కొద్ది మంది ఆందోళనకు గురయ్యారని, తానుండగా చిన్న అన్యాయం జరుగనివ్వనని తెలిపారు. గతంలో మాదిరిగానే అవకతవకలకు ఆస్కారం లేకుండా కేటాయింపులు జరిగాయన్నారు. సూర్యాపేటలో అరాచకాలను సాగనివ్వనని, ప్రశాంతతకు ఆటంకం కలిగిస్తే ఉపేక్షించేది లేదని జగదీశ్‌రెడ్డి స్పష్టంచేశారు. పేదల సొంతింటి కల నేరవేర్చిన ఘనత కేసీఆర్‌దేనన్నారు. వాస్తవానికి అన్నీ పూర్తయిన తరువాత లాటరీ తీసి గతంలో కేసీఆర్ ఇండ్లను ఎలా ప్రారంభించారో అలాగే ఈసారి కూడా జిల్లా మంత్రితో కలిసి ప్రారంభించుకుందాం అనుకున్నామని, ఈలోపు లబ్ధిదారులు ఆందోళన పడుతున్నారని లాటరీ తీసి ఇంటి నెంబర్లు కేటాయిస్తున్నామని తెలిపారు.
గృహ ప్రవేశాలకు సంబంధించిన తేదీని మాత్ర కలెక్టర్ నిర్ణయిస్తారని చెప్పారు. ఇండ్ల విషయంలో ఎవరికీ అనుమానం అక్కర్లేదని, ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఆర్డీఓ వేణుమాధవరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, తాసీల్దార్ శ్యాంసుందర్‌రెడ్డి, వైస్ ఛైర్మన్ పుట్ట కిశోర్, కౌన్సిలర్లు కక్కిరేణి శ్రీనివాస్, జ్యోతి కరుణాకర్, తాహేర్‌పాషా పాల్గొన్నారు.