నకిరేకల్, మార్చి 20 : తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ విద్యారంగ అభివృద్ధికి దోహదపడేలా లేదని టీఎస్ యూటీఎఫ్ నల్లగొండ జిల్లా ఆడిట్ కమిటీ సభ్యుడు టి.నర్సింహమూర్తి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ఆయన స్పందించారు. కొఠారి కమిషన్ సిఫారసులను ప్రభుత్వం పాటించలేదన్నారు. అదేవిధంగా విద్యకు మేనిఫెస్టోలో పేర్కొన్న 15 శాతం కేటాయిస్తామన్న హామీ 3వ బడ్జెట్లో కూడా నెరవేరలేదన్నారు. దాంతోపాటు ప్రభుత్వం నియమించిన విద్యా కమిషన్ ప్రకారం విద్యారంగానికి 18 శాతం కేటాయింపులు ఉండాలన్న సిఫార్సులు కూడా పాటించలేదని తెలిపారు. విద్యా రంగానికి బడ్జెట్లో కేవలం 8.2% నిధులు మాత్రమే కేటాయింపు చేసినట్లు చెప్పారు. ఆ నిధులు సైతం ఉదయం అల్పాహారం, ఇంటర్ వరకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కే సరిపోతాయన్నారు. ప్రభుత్వం పాఠశాలల మౌలిక సదుపాయాలు మెరుగుదల, నాణ్యత ప్రమాణాల పెంపుదలకు ఈ అరకొర నిధులు సరిపోవని పేర్కొన్నారు.