సూర్యాపేట, మే 25 (నమస్తే తెలంగాణ) : సూర్యాపేట జిల్లాలోని ఓ ఇసుక కాంట్రాక్టర్ నుంచి కోట్లు దండుకునేందుకు భువనగిరికి చెందిన ఓ ప్రజాప్రతినిధి అధికారులతో దాడులు చేయించడం… నేరుగా ఫోన్లు చేసి బెదిరించడం… ఇసుక రవాణా చేస్తున్న లారీలు అధిక లోడ్‌తో వెళ్తున్నాయని తనిఖీలు చేయించినా దొరక్కపోవడం… అధికారులతో వత్తిడి చేయగా వారు సైతం చేతులెత్తేశారట. ఇలా రెండేండ్లుగా అనేక రకాల వత్తిడి చేసినా ఫలితం లేకపోగా… ఇటీవల రీచ్‌లకు సంబంధించి రెన్యూవల్ ఉండగా ఆ ప్రజాప్రతినిధికి సీఎంతో ఉన్న సాన్నిహిత్యంతో సీఎంవోలో ఫైల్ ఆపివేయించి చివరకు రూ.నాలుగు కోట్లతో తిరిగి కాంట్రాక్ట్ రెన్యూవల్ అయిందనే టాక్ వినిపిస్తోంది. ఈ అవినీతి బాగోతంపై అధికార పార్టీతో పాటు లారీ ట్రాన్స్పోర్ట్, కాంట్రాక్టర్లు, కూలీల వ్యాఖ్యలు రెండు జిల్లాల్లో కోడై కూస్తున్నాయి. గత పదేండ్ల బీఆర్ఎస్ హయాంలో ప్రజాప్రతినిధులు ఇసుక రవాణా చేసి రూ.కోట్లు దండుకుంటున్నారని ప్రతిపక్షంలో ఉన్న నాటి కాంగ్రెస్ నాయకులు ఆరోపణలు చేస్తూ నానా యాగీ చేశారు. దానికి బీఆర్ఎస్ వారు తాము ఎలాంటి అక్రమాలకు పాల్పడమని, ఎలాంటి ప్రమాణాలకైనా సిద్ధమని సవాల్ విసిరితే తోక ముడిచి పోయేవారు.
గత రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు లేకపోగా వచ్చిన నిధులను వచ్చినట్లే దొరికినోనికి దొరికినంత అన్నట్లు దోచుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎన్నికల ప్రచారాల్లో తాను తట్టెడు ఇసుక కూడా తరలించనివ్వబోనని ఊరూరా ప్రమాణాలు చేసిన ప్రస్తుత తుంగతుర్తి ఎమ్మెల్యే నియోజకవర్గ వ్యాప్తంగా వాగుల నుంచి రోజుకు వందలాది లారీలు, ట్రాక్టర్లలో ఇసుక తరలి వెళ్తుంటే ఏం చేస్తున్నారు? ఎలా నోరు మూసుకొని కూర్చున్నారు? కారణమేంటి? ఎన్ని డబ్బులు తీసుకొని గమ్మున ఉన్నారో అని నియోజకవర్గ ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదే తుంగతుర్తి ఇసుకపై భువనగిరికి చెందిన ఓ ప్రజాప్రతినిధి కన్ను పడిందట. నల్లగొండ, సూర్యాపేట ప్రజాప్రతినిధులకు ఇసుక రీచ్ కాంట్రాక్టర్ నుంచి దండిగా డబ్బులు వెళ్లాయని, తనకు మాత్రం ఎందుకు రావడం లేదనే ఆక్రోశంతో రెండేండ్లుగా అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తూ విఫలం అయ్యారట. మొత్తానికి కక్షకట్టి అనుకున్నదానికంటే ఎక్కువ డబ్బు ముక్కుపిండి వసూలు చేశారనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. చివరకు సీఎంవో నుంచి వత్తిడి తెచ్చి.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, సీఎంకు సన్నిహితుడైన భువనగిరి ప్రాంతానికి చెందిన ఓ నాయకుడు ప్రజాప్రతినిధిగా గెలవడం నాటి నుంచి ఎక్కడి నుంచి ఎలా డబ్బులు వస్తాయి… ఎవరిని వత్తిడి చేస్తే వస్తాయని వచ్చిన కాడికి దోచుకుంటూ సూర్యాపేట జిల్లాలోని ఇసుక రీచ్‌లపై పడ్డాడని తెలిసింది. నాటి నుంచి కాంట్రాక్టర్ల నుంచి డబ్బులు డిమాండ్ చేస్తూ తనను కాదని ఇసుక రవాణా చేయలేరంటూ బెదిరించి కోటి రూపాయలు డిమాండ్ చేసినట్లు సమాచారం.
కాంట్రాక్టర్ ససేమిరా అనడంతో అనేక రకాలుగా ఫిర్యాదులు చేయించడం, లారీల్లో ఇసుక రవాణా అవుతుండగా అధిక లోడ్‌తో వెళుతున్నాయని అధికారులను పురమాయించడం.. రీచ్‌ల వద్దకు ఎవరినైనా పంపించడంతో కాంట్రాక్టర్‌కు మద్దతుగా ఓ మంత్రి జోక్యం చేసుకోవడంతో ఆ ప్రజాప్రతినిధి వెనక్కు తగ్గినట్లు సమాచారం. ఇలా రెండేండ్లు గడిచిపోగా ఇటీవల ఇసుక రీచ్ గడువు ముగియడంతో రెన్యూవల్ సమయంలో దొరకబుచ్చుకున్నారట. ఈ నెల 8న రెన్యూవల్ కావాల్సి ఉండగా అంతకు మునుపే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రీచ్‌లకు రెన్యూవల్ ఫైల్స్ కదులుతున్నాయి. సూర్యాపేట జిల్లాది మాత్రం తనకు సీఎంతో ఉన్న సాన్నిహిత్యంతో సీఎంవో ద్వారా రెన్యూవల్ నిలిపివేయించడంతో దాదాపు పది రోజుల పాటు ఇసుక రవాణా నిలిచిపోయింది. ఇక లాభం లేదు… సదరు ప్రజాప్రతినిధికి ఎంతో కొంత ముట్టజెప్పాల్సిందేనని ఓ మధ్యవర్తి ద్వారా వెళ్లగా ఏకంగా రూ.ఐదు కోట్లు ఆడిగారని, దీంతో తమకు అంత లబ్ధి జరగదని కాంట్రాక్టర్ వాపోగా సీఎంవోలోనే తన ఫైల్ నిలిపివేయించాను… అది క్లియర్ అయితే మీకు అడ్డూ అదుపు ఉండకుండా చేసుకోవచ్చు… డబ్బులు ఇవ్వాల్సిందేనని గట్టిగా అనడంతో రూ.మూడున్నర కోట్లకు బేరం కుదుర్చుకొని వాటిని వెంటనే ఇవ్వడంతో రెన్యూవల్ అయిందట. విచిత్రమేంటంటే మధ్యవర్తి ఎవరో కాకుండా ప్రజాప్రతినిధి సోదరుడే కావడంతో అతను మరో రూ.యాభై లక్షలు ఇవ్వాలని బలవంతంగా వసూలు చేశారట. మధ్యలో ఇసుక రవాణా నిలిచిపోవడంతో కారణమేంటని లారీ ట్రాన్స్పోర్ట్దారులు, కూలీలు రీచ్‌ల వద్దకు వచ్చి వెళ్లే అధికారులతో ఉన్న పరిచయాల మేరకు ఆరా తీయగా మొత్తం అవినీతి తతంగం బయటకు వచ్చింది. వారి ద్వారా రెండు జిల్లాల్లో అధికార, ప్రతిపక్షాలతో పాటు సాధారణ జనానికి తెలిసి ప్రజాప్రతినిధి ఇంత దిగజారి బెదిరించి డబ్బులు వసూలు చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు.