పెన్‌పహాడ్, ఫిబ్రవరి 16 : యాప్‌తో సంబంధం లేకుండా యూరియా పంపిణీ చేయాలని రైతులు పెన్‌పహాడ్ తాసీల్దార్ లాలూ నాయక్, మండల వ్యవసాయ అధికారి అనిల్ నాయక్‌ను డిమాండ్ చేశారు. తమ వద్ద ఉన్న చిన్న ఫోన్లో యూరియా యాప్ లేదని, తమ పంటలకు అవసరమైన యూరియా బస్తాలు ఎలా పొందాలని సోమవారం మండల పరిధిలోని నారాయణగూడెం సహకార సంఘం పరిధిలోని అనంతారం సహకార సంఘం వద్దకు రైతులు పెద్ద ఎత్తున చేరుకుని అధికారులను నిలదీశారు. గోదాంకు 448 యూరియా బస్తాల లోడ్ వచ్చిందని సమాచారం తెలుసుకున్న మండల రైతులు గోదాం వద్దకు భారీగా చేరుకున్నారు. ఫర్టిలైజర్ యూరియా యాప్‌లో లింక్ ఇవ్వగానే రైతులు తమ మొబైల్ ద్వారా బుకింగ్ యాప్‌లో బుక్ చేస్తుండగా, అక్కడున్న కొంతమంది రైతులకే యూరియా బస్తాలు బుక్ అయ్యాయి. నిమిషాల వ్యవధిలోనే 448 బస్తాలు బుక్ అయ్యాయి. అక్కడున్న కొంతమంది రైతులు ఓటీపీ ఎంటర్ చేసి స్టాక్ చూసేసరికి సైట్లో బస్తాలు అయిపోయాయి.
చిన్న ఫోన్లు ఉన్న రైతులతో పాటు యూరియా బస్తాలు బుకింగ్ కాని రైతులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. రైతులు మాట్లాడుతూ తాము అందుబాటులో ఉన్నా తమ వద్ద బుకింగ్ చేసుకోవడానికి ఫోన్లు లేవని, తమకు బస్తాలు ఎవరిస్తారని మండిపడ్డారు. తమ పంట పొలాలను కాపాడుకునేది ఎలా అని ప్రశ్నించారు. చదువురాని రైతులు, స్మార్ట్ఫోన్లులేని రైతుల గోస వర్ణనాతీతంగా ఉంది. చదువురాని రైతులకు, స్మార్ట్ఫోన్లు లేని రైతులకు యూరియా దొరకడం లేదు. యాప్‌లో స్టాక్ కనిపించగానే ఇతర రైతులు వేగంగా బుక్ చేసుకోవడంతో వీళ్లకు మొండిచేయే మిగులుతుంది. ఇతరులను బతిమాలి బుక్ చేసుకునే లోపే స్టాక్ అయిపోతుంది. తర్వాత వచ్చిన రైతులు ఉత్త చేతులతో వెనుతిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందని మండిపడ్డారు.
యూరియా స్టాక్ చూపించిన క్షణాల్లోనే మాయమవుతున్నట్టు రైతులు చెబుతున్నారు. ఎన్ని వందల బస్తాలు ఉన్నప్పటికీ, కొద్దిసేపట్లోనే జీరో చూపిస్తున్నదని, ఆ కొద్ది సేపట్లోనే బస్తాలు ఏమైతున్నాయనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అధికారులు రైతుల పేరుతో యూరియా బుక్ చేస్తున్నారనే ఆరోపణలు కూడా మరోవైపు వ్యక్తమవుతున్నాయి.