తెలంగాణ కాంగ్రెస్‌లో నల్లగొండ సీనియర్ లీడర్లదే హవా! .. ఇది ఒకప్పటి మాట. నేడు అలాంటి సీనియర్లు సొంత జిల్లా నల్లగొండలోనే డమ్మీ అయ్యారా? అంటే అవుననే సమాధానం ఆ పార్టీ శ్రేణుల నుంచే వినిపిస్తున్నది. పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్‌రెడ్డి వ్యూహాత్మకంగా సీనియర్లకు చెక్ పెడుతూ నల్లగొండ జిల్లాపై పట్టు బిగిస్తున్నారనడానికి నామినేటెడ్ పోస్టుల భర్తీనే ఉదాహరణగా చూపుతున్నారు. ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లా పరిధి నుంచి ఐదు నామినేటెడ్ పోస్టులకు ఎంపిక చేసిన వారిలో నలుగురు రేవంత్‌రెడ్డి వర్గీయులే అవడం గమనార్హం. వారంతా రేవంత్‌రెడ్డితోపాటు లేదా ఆ తర్వాత కాంగ్రెస్‌లోకి వచ్చిన వారే. దాంతో అలా వచ్చిన వారికి ఇలా పదవులు ఇచ్చుడేంది అన్న రంది అసలైన కాంగ్రెస్ నేతలు, కార్యకర్తల్లో నెలకొంది.
సోషల్ మీడియా వేదికగా పార్టీ అధిష్టానాన్ని టార్గెట్ చేస్తూ తమ ఆగ్రహాన్ని, ఆవేదనను కూడా బాహాటంగానే వెళ్లగక్కుతున్నారు. ఆది నుంచీ పార్టీ కోసం కష్టపడుతూ నామినేటెడ్ పోస్టుల రేస్‌లో ఉన్న కొందరు ముఖ్యులు జిల్లా సీనియర్ నేతలను ఇదే విషయం మీద నిలదీసినట్లు తెలిసింది. తప్పనిసరి పరిస్థితుల్లో జిల్లాకు చెందిన ఓ సీనియర్ నేత నేరుగా పార్టీ హైకమాండ్ దృష్టికి వీళ్ల అభ్యంతరాలను తీసుకెళ్లినట్లు సమాచారం. దాంతో ఇటీవల ప్రకటించిన మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, గుత్తా అమిత్‌రెడ్డి పోస్టులను తాత్కాలికంగా పెండింగ్‌లో పెట్టినట్లు ఆ పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది.
రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన తొలినాళ్లతోపాటు పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ప్రారంభ రోజుల్లోనూ నల్లగొండ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలే ఆయనకు కొరకరాని కొయ్యగా మారిన విషయం తెలిసిందే. అలాంటి సీనియర్ నేతలకు వ్యూహాత్మకంగా ఇప్పుడు రేవంత్ వరుస షాక్‌లు ఇస్తుండడం జిల్లా కాంగ్రెస్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ఎంపీ ఎన్నికల్లో నల్లగొండ, భువనగిరి ఎంపీ అభ్యర్దుల ఎంపికలోనూ రేవంత్‌రెడ్డిదే కీలక పాత్ర. ఆ తర్వాత నామినేటెడ్ పోస్టుల భర్తీలోనూ జిల్లా సీనియర్ల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోలేదన్న చర్చ జరుగుతున్నది.
ఇప్పటివరకు జిల్లాకు చెందిన ఐదుగురికి నామినేటెడ్ పోస్టులు దక్కగా అందులో నలుగురు రేవంత్‌రెడ్డికి వర్గానికి చెందినవారే అవడం గమనార్హం. రాష్ట్ర పర్యాటక అభివృద్ది సంస్థ చైర్మన్ పటేల్ రమేశ్రెడ్డితోపాటు రాష్ట్ర మహిళా సహకార అభివృద్ది సంస్థ చైర్మన్ బండ్రు శోభారాణి, తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యురాలిగా పాల్వాయి రజినికుమారి, రేవంత్‌రెడ్డితోపాటు టీడీపీలో పనిచేస్తూ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారందరికీ రేవంత్‌రెడ్డి కోటాలోనే నామినేటెడ్ పదవులు దక్కాయని ఆ పార్టీ వర్గాలే చెప్పుకున్నాయి.
తాజాగా ఈ నెల 20న శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి కుమారుడు గుత్తా అమిత్‌రెడ్డికి రాష్ట్ర డెయిరీ అభివృద్ధి సహకార సమాఖ్య చైర్మన్ పదవి లభించింది. అయితే శాసన మండలిలో సంఖ్యా బలం రీత్యా చైర్మన్ సుఖేందర్‌రెడ్డితో ఉన్న రాజకీయ అవసరాలతోపాటు రేవంత్‌రెడ్డికి గుత్తా ఫ్యామిలీతో ఉన్న బంధుత్వం కూడా అమిత్‌రెడ్డికి చైర్మన్ పదవి దక్కడంలో కీలక అంశాలుగా తెరపైకి వచ్చాయి.
ఇవన్నీ ఎలా ఉన్నా అమిత్‌రెడ్డికి పదవి కట్టబెట్టడం అనేది గత నామినేటెడ్ పోస్టుల మాదిరిగానే రేవంత్‌రెడ్డి స్వతహాగా తీసుకున్న నిర్ణయమన్నది ఆ పార్టీ సీనియర్ల ఆరోపణ. దాంతో ఇవన్నీ జిల్లా మంత్రులు, ఇతర సీనియర్లకు మింగుడు పడని అంశాలుగా మారాయి. ఇదే సమయంలో నామినేటెడ్ పోస్టులు ఆశిస్తున్న ఇతర ముఖ్య నేతలు తమ అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ జిల్లా మంత్రులకు మొర పెట్టుకున్నట్లు తెలిసింది. ఒకప్పుడు రాష్ట్ర కాంగ్రెస్‌కు దశ దిశలను నిర్దేశించిన జిల్లా సీనియర్లకు పోస్టుల భర్తీ వ్యవహరం అవమానంగానే మారిందన్న టాక్ ఆ పార్టీ వర్గాల్లో జోరుగా నడుస్తున్నది.
ఆశావాహుల గుస్సా…
మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీని అంటి పెట్టుకుని అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపు కోసం కష్టపడ్డ పలువురు ముఖ్య నేతలు ఎప్పటి నుంచే నామినేటెడ్ పదవుల కోసం ఎదురుచూస్తున్నారు. వారి ఎదురుచూపులకు మాత్రం ఫలించలేదు. ఎమ్మెల్యేలుగా గెలిచి మంత్రులైన కీలక నేతలు, ఎంపీలు ఇప్పుడు తమను పట్టించుకోవడం లేదని నిజమైన కాంగ్రెస్ నేతలు గుస్సా వ్యక్తం చేస్తున్నారు.
జిల్లా మంత్రులు, కీలక నేతల వద్ద ఆశావాహులైన పలువురు నేతలు తమ కష్టానికి విలువు లేదా? పార్టీని నమ్ముకుంటే ఇంతేనా? మీరు అందలం ఎక్కితే సరిపోతుందా? మా పరిస్థితి ఇంతేనా? అన్న ప్రశ్నలు సంధిస్తున్నట్లు తెలిసింది. డీసీసీ అధ్యక్షుడు శంకర్‌నాయక్, పార్టీ నేతలు అద్దంకి దయాకర్, పున్న కైలాస్ నేత, గుమ్ముల మోహన్‌రెడ్డి, ఇంకా పలువురు నేతలు రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పోస్టులను ఆశిస్తూ వస్తున్నారు.
ఇలాంటి వారంతా ప్రస్తుతం సీనియర్ల వద్ద తమ అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. దాంతో ఇటీవల జిల్లాకు చెందిన సీనియర్ నేత ఒకరు నేరుగా ఢిల్లీలో పార్టీ హైకమాండ్ వద్దే తన గళం విప్పినట్లు తెలిసింది. పార్టీ నమ్ముకున్న నేతలకు న్యాయం చేయకపోతే క్యాడర్లో విశ్వాసం కోల్పోతామని హెచ్చరించినట్లు సమాచారం. వారితోపాటు రాష్ట్రంలోని పలువురు ముఖ్యులు కూడా అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు తెలిసింది. దాంతో తాత్కాలికంగా పోచారం శ్రీనివాసరెడ్డికి క్యాబినేట్ హోదాతో ఇచ్చిన వ్యవసాయ సలహాదారు పదవిని, గుత్తా అమిత్‌రెడ్డికి ఇచ్చిన డెయిరీ సహకార సమాఖ్య చైర్మన్ పదవిని పెండింగ్‌లో పెట్టినట్లు సమాచారం.