నల్లగొండ ప్రతినిధి, జూన్ 4 (నమస్తే తెలంగాణ) : వరంగల్ – ఖమ్మం – నల్లగొండ పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. నల్లగొండ పట్టణ శివారులోని ఎ.దుప్పలపల్లి స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోదాములలో లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. బుధవారం ఉదయం 8గంటల నుంచి లెక్కంపు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఓట్ల లెక్కింపు కోసం నాలుగు కౌంటింగ్ హాళ్లను సిద్ధం చేశారు. ఒక్కో హాల్లో 24 టేబుళ్లపై లెక్కింపు కొనసాగుతుంది. ముందుగా బ్యాలెట్ పత్రాలను కట్టలుగా కట్టే కార్యక్రమాన్ని చేపడుతారు. మధ్యాహ్నం రెండు గంటల వరకు ఇదే కొనసాగవచ్చని అంచనా. అనంతరం ఓట్ల లెక్కింపు మొదలు కానుంది. ఒక్కో రౌండ్లో 96వేల ఓట్ల చొప్పున ప్రథమ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు జరుగనుంది. ఇలా మొత్తం నాలుగు రౌండ్లలో పోలైన 3,36,005 ఓట్లను లెక్కించనున్నారు. ప్రధానంగా బీఆర్ఎస్ నుంచి ఏనుగుల రాకేశ్‌రెడ్డి, కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డితోపాటు మొత్తం 52 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కాగా.. కౌంటింగ్‌కు అధికారులు పకడ్బందీగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక ఓట్ల లెక్కింపు ప్రాంతంలో 144 సెక్షన్ ఏర్పాటు చేస్తూ మూడంచెల భద్రత వ్యవస్థను ఏర్పాటు చేశారు. పూర్తిగా సీసీ టీవీల పర్యవేక్షణలో నిఘా కొనసాగనుంది. మరోవైపు నేటి కౌంటింగ్ కోసం మంగళవారం సాయంత్రం నుంచే జిల్లా కేంద్రంలో సందడి మొదలైంది. అభ్యర్థులు, వారి కౌంటింగ్ ఏజెంట్లు, వారి కార్యకర్తలు, అభిమానుల రాకతో హోటళ్లు, లాడ్జీలన్నీ కిక్కిరిసిపోయాయి.
ముందుగా బండిల్స్ ప్రక్రియ
నాలుగు కౌంటింగ్ హాళ్లలో ఒక్కో హాల్లో 24 టేబుళ్ల చొప్పున మొత్తం 96 టేబుళ్లపై లెక్కింపు ప్రక్రియ కొనసాగనుంది. వీటిపై ముందుగా బ్యాలెట్ పత్రాలను కట్టలు కట్టే కార్యక్రమం చేపడుతారు. మొత్తం 52 మంది అభ్యర్థులు బరిలో నిలువగా.. 605 పోలింగ్ కేంద్రాల నుంచి వచ్చిన బ్యాలెట్ బాక్సులను వరుస క్రమంలో టేబుల్‌కు ఒకటి ఇచ్చి ఓపెన్ చేస్తారు. బ్యాలెట్ బాక్సుల్లోని బ్యాలెట్ పేపర్లను టేబుల్‌పై కుప్పగా పోసి 25 పేపర్లను ఒక కట్టగా చేసి బండిల్స్ చేస్తారు. పోస్టల్ బ్యాలెట్లను కూడా ఇదే సమయంలో వీటితో కలిపేస్తారు. ఎప్పటికప్పుడు వీటన్నింటినీ తీసుకెళ్లి ఓ పెద్ద డ్రమ్ములో వేస్తారు. బండిల్ కార్యక్రమం పూర్తయ్యాక లెక్కింపు మొదలు కానుంది. అయితే.. బండిల్ కట్టేందుకే కనీసం ఐదు నుంచి ఆరు గంటల సమయం పట్టొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఉదయం 8నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఇది కొనసాగుతుండవచ్చని అంచనా. ఆ తర్వాతే అసలు ఓట్ల లెక్కింపు మొదలు కానుంది. తొలి ప్రాధాన్యత ఓట్లను ముందుగా లెక్కిస్తారు. లెక్కింపునకు రెండు రోజుల సమయం పట్టవచ్చని భావిస్తున్న అధికారులు షిప్టులుగా సిబ్బందిని నియామకం చేశారు. సమయంతో సంబంధం లేకుండా ఒక్కో ప్రక్రియ ముగిసే వరకు ఒక షిఫ్ట్ సిబ్బంది విధులు నిర్వర్తిస్తారని తెలిసింది. ఇక ఇదేవిధంగా కౌంటింగ్ ఏజెంట్లకు కూడా షిఫ్ట్‌ల వారీగా పాస్‌లు జారీ చేశారు.
సాయంత్రానికి తొలి ఫలితం..
బ్యాలెట్ పేపర్లన్నింటినీ 25 చొప్పున కట్టలు కట్టడం పూర్తి చేశాక తొలి ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తారు. ఒక్కో టేబుల్‌కు 40 కట్టల చొప్పున మొత్తం వెయ్యి ఓట్లను ఒక రౌండ్లో ఇస్తారు. ఇలా ఒకేసారి 96 టేబుళ్లపై 96వేల ఓట్ల లెక్కింపు కొనసాగనుంది. ఇలా చేపట్టే తొలి రౌండ్ ఫలితం నేటి సాయంత్రం 5గంటల వరకు వెలువడవచ్చని అంచనా. బండిల్స్ కార్యక్రమం మధ్యాహ్నం రెండు గంటలకు ముగిస్తే గంట విరామం అనంతరం మూడు గంటలకు తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు మొదలైతే గంటన్నర నుంచి రెండు గంటల్లో తొలి రౌండ్ ఫలితం వెలువడవచ్చని అంచనా. ఇలా అనుకున్నది అనుకున్నట్లు జరిగితే అర్ధరాత్రి 12గంటల వరకు తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తి కావచ్చని భావిస్తున్నారు. ఈ ఎన్నికల్లో మొత్తం 3,36,005 ఓట్లు పోలైన విషయం తెలిసిందే. తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు సమయంలోనే చెల్లని ఓట్లను వేరు చేస్తారు. ఆ తర్వాత చెల్లిన ఓట్ల నుంచే గెలుపు కోటాను నిర్ధారిస్తారు. చెల్లిన ఓట్లలో 50శాతం+1ను గెలుపు కోటా కానుంది. తొలి ప్రాధాన్యత ఓట్లలో ఏ అభ్యర్థికీ గెలుపు కోటా రాకపోతే అప్పుడు ఎలిమినేషన్ ప్రక్రియ మొదలవుతుంది. ఇదే జరిగితే తర్వాత కూడా కౌంటింగ్ కొనసాగనుంది.
ఎలిమినేషన్‌కు మరింత సమయం
తొలి ప్రాధాన్యత ఓట్లు పూర్తయ్యే సరికి అభ్యర్థుల వారీగా పోలైన ఓట్లపై, అదేవిధంగా గెలుపు కోటాపై స్పష్టత వస్తుంది. అప్పటికీ ఎవరూ గెలుపు కోటా ఓట్లు సాధించలేకపోతే ఎలిమినేషన్ ప్రక్రియను మొదలు పెడుతారు. తొలి ప్రాధాన్యత ఓట్లలో అతి తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థి నుంచి ఎలిమినేషన్ రౌండ్‌ను ప్రారంభిస్తారు. ఆయనకు బ్యాలెట్లో పడిన ద్వితీయ ప్రాధాన్యత ఓట్లను ఆయా అభ్యర్థుల వారీగా పంచుతూ వస్తారు. ఇలా ఒక్కో అభ్యర్థిని కింది నుంచి పైకి ఎలిమినేట్ చేస్తూ కౌంటింగ్ కొనసాగిస్తారు. ఈ క్రమంలో ఏ అభ్యర్థికైనా గెలుపు కోటా ఓట్లు వస్తే అక్కడితో కౌంటింగ్‌ను నిలిపివేసి విజేతను ప్రకటిస్తారు. అయితే.. మొత్తం 52 మంది అభ్యర్థులు బరిలో ఉండడంతో ఎలిమినేషన్ ప్రక్రియ సుదీర్ఘంగా కొనసాగే అవకాశం ఉంది. కిందటిసారి ఎలిమినేషన్ రౌండ్‌కే 44 గంటల సమయం పట్టింది. ద్వితీయ ప్రాధాన్యత ఓట్లలోనూ విజేత తేలకపోతే తృతీయ ప్రాధాన్యత ఓట్లను కూడా లెక్కించనున్నారు. కానీ.. ఇంతవరకు తృతీయ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు జరిగిన దాఖలాలు లేవనే చెప్పవచ్చు.
పకడ్బందీగా ఏర్పాట్లు
రెండు రోజుల పాటు జరుగనున్న పట్టభద్రుల ఓట్ల లెక్కింపునకు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ హాల్ వెలుపుల, లోపల కలిపి మూడంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. కిలోమీటర్ పరిధిలో 144సెక్షన్ విధించారు. కేశరాజుపల్లి శివారులోనే పాస్‌లు ఉంటేనే లోపలికి అనుమతించేలా చర్యలు చేపట్టారు. ఇప్పటికే కౌంటింగ్ టేబుళ్లు, వాటికి ఆనుకుని బ్యాలెట్ పత్రాలను వేసేందుకు అభ్యర్థుల వారీగా ప్రత్యేక ర్యాక్‌లు, ఈ టేబుళ్లకు ఎదురుగా ఇనుప జాలీ ఏర్పాటు చేసి మరోవైపు కౌంటింగ్ ఏజెంట్లు కూర్చునేలా కుర్చీలు వేశారు. అభ్యర్థుల వారీగా బ్యాలెట్ పేపర్లను వేసేందుకు ప్రత్యేకంగా డ్రమ్ములను ఏర్పాటు చేశారు.
కౌంటింగ్ ప్రక్రియ ఇలా..