ప్రభుత్వ దవాఖానల బలోపేతానికి ప్రాధాన్యమిస్తున్న రాష్ట్ర సర్కారు కార్పొరేట్‌కు దీటుగా వసతులు కల్పిస్తున్నది. ఆధునిక పరికరాలు అందుబాటులోకి తెచ్చి ప్రజలకు నాణ్యమైన వైద్యం అందిస్తున్నది. ఫలితంగా సర్కారు దవాఖానలకు రోగుల సంఖ్య పెరుగుతున్నది. గత పాలకుల నిర్లక్ష్యంతో ప్రభుత్వ దవాఖానలు ఆదరణ కోల్పోయి సర్కారు వైద్యమంటేనే ప్రజలు భయపడే పరిస్థితి ఉండేది. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ అన్ని దవాఖానల్లో అవసరమైన వసతులు కల్పించి నాణ్యమైన వైద్యం అందిస్తుండటంతో పేదలే కాకుండా మధ్య తరగతి వారు కూడా ప్రభుత్వ దవాఖానలకు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో ప్రసవాల సంఖ్య భారీగా పెరుగుతున్నది.
కేసీఆర్ కిట్, నగదు ప్రోత్సాహం
సర్కారు దవాఖానల్లో ఆధునిక వైద్య పరికరాలతో నాణ్యమైన వైద్యం అందిస్తున్నారు. దాంతో ప్రజల్లో నమ్మకం పెరిగింది. చాలా చోట్ల ప్రసవానికి స్వచ్ఛందంగా సర్కారు దవాఖానకు వస్తున్నారు. ధనవంతులు కూడ సర్కారు దవాఖానల్లో సాధారణ ప్రసవాలు చేయించుకున్న సందర్భాలు కూడ అనేకం ఉన్నాయి. ప్రసవం తర్వాత 16 రకాల వస్తువులతో కూడిన కేసీఆర్ కిట్ అందించటం, అమ్మాయి పుడితే రూ.13 వేలు, అబ్బాయి పుడితే రూ.12 వేలను ప్రభుత్వం అందిస్తున్నది. దాంతో సర్కారు దవాఖానల్లో ప్రసవాల సంఖ్య పెరుగుతున్నది.
సూర్యాపేట జిల్లాలో ప్రసవాల సంఖ్య ఇలా..
ఏప్రిల్‌లో సాధారణ ప్రసవాలు 284, సీజేరియన్ 223, మేలో సాధారణ కాన్పులు 298, సిజేరియన్ 228, జూన్‌లో336-185, జూలైలో 383-55 ,ఆగస్టులో 308-146, సెప్టెంబర్‌లో 364-271, అక్టోబర్‌లో 367-265, నవంబర్‌లో సాధారణ కాన్పులు 299, సీజేరియన్ 283 చొప్పున జరిగాయి.
ప్రభుత్వ దవాఖానలో సాధారణ ప్రసవమైంది
నేను ప్రభుత్వ దవాఖానలోనే ప్రసవం కోసం వెళ్లాను. అన్ని వైద్యపరీక్షలు ఉచితంగా చేశారు. ఏరియా దవాఖానలో నా మొదటి కాన్పుకోసం చేరగా సాధారణ ప్రసవం జరిగింది. కేసీఆర్ కిట్‌తో పాటు పాప పుట్టడంతో రూ. 13వేలు ఇచ్చారు. ప్రభుత్వ దవాఖానల్లో నాణ్యమైన వైద్యం అందుతున్నది. వైద్యులు కూడ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.
– వాసాని శ్రుతి తిరుమలగిరి
ఆధునిక పరికరాలు అందుబాటు ఉన్నాయి
ప్రభుత్వ దవాఖానల్లో ఆధునిక పరికరాలు అందుబాటులో ఉన్నాయి. నాణ్యమైన వైద్య సేవలు అందుతున్నాయి. గర్భిణులకు ప్రతి నెలా ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నాం. సాధ్యమైనంత వరకు సాధారణ ప్రసవాలు జరిగే విధంగా వైద్యులు కృషి చేస్తున్నారు. దాంతో గర్భిణులు ప్రభుత్వ దవాఖానల్లో చేరుతున్నారు.
– డాక్టర్ కోటాచలం, జిల్లా వైద్యాధికారి, సూర్యాపేట
పెరుగుతున్న ప్రసవాలు
గతంలో మహిళలు గర్భం దాల్చిన నాటి నుంచి బిడ్డకు జన్మనిచ్చే వరకు ప్రైవేటు దవాఖనల్లో కనీసం రూ. 50 వేలు ఖర్చుచేయాల్సి వచ్చేది. నేడు తెలంగాణ ప్రభుత్వం మహిళ గర్భం దాల్చింది మొదలు ప్రసవం అయ్యే వరకు సర్కారు దవాఖానల్లో అన్ని రకాల పరీక్షలు ఉచితంగా చేస్తున్నారు. ప్రసవం కూడా ఉచితంగా చేస్తూ తల్లీబిడ్డలను క్షేమంగా ఇంటికి పంపిస్తున్నారు. దాంతో ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాల సంఖ్య భారీగా పెరిగింది.
సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఈ సంత్సరం ఏప్రిల్ నుంచి నవంబర్ నెలాఖరు వరకు మొత్తం 4,295 ప్రసవాలు జరిగాయి. ఇందులో 2,639 సాధారణ ప్రసవాలే. దీనికి ప్రధాన కారణం మహిళ గర్భం దాల్చినప్పటి నుంచి ప్రభుత్వ వైద్యశాలకు చెందిన గైనకాలజిస్టులు మహిళలకు అన్ని రకాల పరీక్షలు నిర్వహిస్తూ ఆమె ఆరోగ్యాన్ని పరిరక్షిస్తున్నారు. దాంతో పాటు అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికరమైన ఆహారం అందిస్తున్నారు. దాంతో ప్రభుత్వ దవాఖానకు వెళ్లేందుకే గర్భిణులు ఆసక్తి కనబరుస్తున్నారు.