సూర్యాపేట, జూన్ 20 : ప్రభుత్వం అందించే ప్రతి సంక్షేమ పథకం అర్హులందరికీ అందేలా జిల్లా అధికారులు కృషి చేయాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా స్థాయి అధికారులు, వివిధ శాఖల ఇంజినీరింగ్ అధికారులతో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ నిబంధనల మేరకు పక్కా ప్రణాళికతో పారదర్శకంగా పథకాలు అమలు చేయాలన్నారు. ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి పనులు, చేపట్టాల్సిన పనులపై ప్రజాభిప్రాయాన్ని సేకరించాలని సూచించారు. అక్కడ ఎదురయ్యే సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. అధికారులు, సిబ్బంది పనితీరును క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలని, ప్రతి పనిలో ప్రజల భాగస్వామ్యం ఉండాలని పేర్కొన్నారు. మిషన్ భగీరథ సర్వే వేగంగా చేయాలని, అన్ని కార్యాలయాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం తప్పక అమలు చేయాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు సీహెచ్ ప్రియాంక, బీఎస్ లత, జడ్పీ సీఈఓ అప్పారావు, డీఎఫ్ఓ సతీశ్‌కుమార్, డీపీఓ సురేశ్‌కుమార్, డీడబ్ల్యూఓ జ్యోతిపద్మ, సీపీఓ కిషన్, డీటీడీఓ శంకర్, జడ్పీ డిప్యూటీ సీఈఓ శిరీష పాల్గొన్నారు.