యాదాద్రి భువనగిరి, జనవరి 5 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ పార్టీ బీసీలను మొదటి నుంచి మోసం చేస్తూనే ఉందని, మరోసారి తన బుద్ధిని చూపించిందని ఆలేరు మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు బూడిద భిక్షమయ్యగౌడ్ విమర్శించారు. బీసీ కుల గణన తప్పుల కుప్పగా మారిందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో బీసీల శాతం తగ్గి ఓసీల శాతమే పెరగడమేంటని ప్రశ్నించారు. ఇక్కడే ప్రభుత్వం చిత్తుశుద్ధి అర్థమవుతున్నదన్నారు. అసెంబ్లీలో తీర్మానం ఆమోదించి కేంద్రానికి పంపించిందని, వారిపై నెపం నెట్టి బీసీలను మరోసారి దగా చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కారు కుట్రలకు తెరలేపిందని ఆరోపించారు. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు చట్టబద్ధంగా కచ్చితంగా అమలు చేయాలని, ఆ తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. బుధవారం బీసీ కుల గణనపై నమస్తే తెలంగాణ ఇంటర్వ్యూలో భిక్షమయ్యగౌడ్ పలు విషయాలను వెల్లడించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
మొదటి నుంచీ మోసమే..
‘మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేస్తూ వస్తున్నది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ కామారెడ్డి డిక్లరేషన్ చేసింది. అసెంబ్లీలో పాలితులే పాలకులు ఉండాలని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆ తర్వాత ఎన్నికలు నిర్వహించాలని అనేక విధాలుగా ప్రయత్నాలు చేశారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్, బీసీ సంఘాలు ఒక పోరాట పటిమతో 42శాతం రిజర్వేషన్లు ఇచ్చేదాకా వదిలిపెట్టేది లేదని హెచ్చరించడంతో వెనక్కి తగ్గారు. వెంటనే తూ.తూ.మంత్రంగా బీసీ కమిషన్ వేశారు. ఈ కమిషన్‌తో అయ్యేది కాదు.. పోయేది కాదని తీవ్రంగా వ్యతిరేకించాం. దాంతో మళ్లీ డెడికేషన్ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. ఈ సమయంలోనే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తుండగా.. రేవంత్ రెడ్డి కలుగజేసుకుని మాట్లాడారు. కేవలం రాహుల్ గాంధీ చెప్తున్నారనే తాము బీసీ కుల గణన చేస్తున్నామని, తమ నాయకుడి అభిప్రాయం మేరకు చేపడుతున్నామని స్వయంగా చెప్పారు. కుల గణన చేయడానికి సీఎంకు ఇష్టం లేదనడానికి ఇది నిదర్శనం. ఇవన్నీ మొదటి నుంచే అనుమానాలు ఉన్నాయి.
ఓసీలు పెరిగి.. బీసీలు తగ్గారా..?
బీసీ కుల గణన కోసం 56 ప్రశ్నలతో ప్రశావళి తయారు చేశారు. బీసీలా కాదా? రేషన్ కార్డు ఉందా, లేదా? అని అడగకుండా అనవసర ప్రశ్నలు వేసి ప్రజలను గందరగోళపరిచారు. ఆయన మొదటి నుంచే బీసీలకు వ్యతిరేకంగా ఉన్నారు. రెడ్లే సమర్థ నాయకులని స్వయంగా రేవంత్ రెడ్డి అనేక సందర్భాల్లో చెప్పారు. 2014లో కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో సమగ్ర కుటుంబ సర్వే చేస్తే బీసీలు 52 శాతం ఉందని తేలింది. కాంగ్రెస్ సర్వేలో కేవలం 46శాతం మాత్రమే వచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు. పదేండ్లలో బీసీ సంఖ్య తగ్గుతుందట! ఓసీల సంఖ్య మాత్రం పెరుగుతుందట! సీఎం దృక్పథం ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా అసెంబ్లీలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ అడిగిన ప్రశ్నలకు ఎందుకు సమాధానం ఇవ్వలేదు.
కేంద్రంపై నెట్టే ప్లాన్..
బీసీ కుల గణన తీర్మానం తూ.తూ.మంత్రంగా చేపట్టి ఢిల్లీకి పంపారు. కేంద్రానికి పంపిస్తే వాళ్లు అమలు చేయరు. అది అందరికీ తెలిసిందే. కేంద్ర సహకారం లేదని బీజేపీపై నెపం నెట్టి మళ్లీ బీసీ రిజర్వేషన్లు తప్పించుకోవాలనే కుట్ర చేస్తున్నారు. రాష్ట్రంలో మళ్లీ శాస్త్రీయంగా బీసీ కుల గణన చేయాలి. ఇప్పుడు సర్వేలో బీసీల శాతం ఎందుకు తగ్గిందో సమాధానం చెప్పాలి. దానిపై జవాబు చెప్పకుండా ఊరికే దాటవేయడం ఏంటి? బీసీలకు స్థితిగతులను రూపుమాపడానికి, అణగదొక్కడానికి రేవంత్ రెడ్డి పెద్ద కుట్రకు తెరదీశారు. బీసీలంతా ఐక్యంగా ముందుకు సాగాలి. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించి బుద్ధి చెప్పాలి.