పెద్దఅడిశర్లపల్లి ఆగస్టు 6: ఎగువన కురిసిన వర్షాలతో నాగార్జున సాగర్‌లో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతున్నా ఏఎమ్మార్పీ మాత్రం ఎండిపోతుంది. ముందు చూపులేని అధికారులు మోటార్ల మరమ్మతు పనులు సకాలంలో పూర్తి చేయకపోవడతో ఏఎమ్మార్పీ ఎడారిగా మారిన దుస్థితి ఏర్పడింది. సాగర్ నిండా నీళ్లున్నా ఏఎమ్మార్పీ నుంచి పూర్తి స్థాయిలో నీటిని తోడుకోలేని దుస్థితి. 18 సంవత్సరాల తర్వాత జూలై మాసంలోనే సాగర్ నిండినా ఏఎమ్మార్పీ ఆయకట్టు రైతుల్లో ఏ మాత్రం ఆనంద లేకుండా పోయింది. గత నెలలోనే వానకాలం సీజన్ ప్రారంభమైనా ఏఎమ్మార్పీ ప్రాజెక్టు పరిధిలోని అన్ని డిస్ట్రిబ్యూటరీలకు పూర్తి స్థాయిలో సాగునీరు అందడం లేదు.
ఏఎమ్మార్పీ ప్రాజెక్టులో పనిచేసే నాలుగు మోటార్లలో నా లుగో యూనిట్‌కు క్యాపిటల్ ఓవర్‌హాలింగ్ పనులు రెండు నెలల క్రితం ప్రారంభించారు. ఈ పనులు జులైలోనే పూర్తి చేయాల్సి ఉండగా ఆగస్టు ప్రవేశించినా కూడా పూర్తి కాకపోవడంతో ప్రస్తుతం మూడు మోటార్లు మాత్రమే నడుస్తున్నాయి. దీంతో మూడు మోటార్ల ద్వారా 1800 క్యూసెక్కుల నీరు విడుదల కావడంతో 525 క్యూసెక్కులను జంటనగరాలకు, 90 క్యూసెక్కులను మిషన్ భగీరథకు, 1200 క్యూసెక్కులను ఉదయ సముద్రం నింపేందుకు ప్రధాన కాల్వకు నీటిని విడుదల చేశారు.
కానీ ఆయకట్టు నీటి విడుదల ప్రణాళిక ప్రకారం గత నెల 28 నుంచి అన్ని డిస్ట్రిబ్యూటరీలకు వానకాలం నీటిని విడుదల చేయాల్సి ఉంది. కానీ మూడు మోటార్ల ద్వారా ఉదయం సముద్రం నింపలేక, ఆయకట్టుకు నీటిని విడుదల చేయలేక ఇరిగేషన్ అధికారులు సతమతమవుతున్నారు. నాలుగో యూనిట్‌కు మరమ్మతు పనులు పూర్తి చేసి, రోజుకు 2400 క్యూసెక్కుల నీటిని విడుదల చేసి ఉంటే ఏఎమ్మార్పీ ఆయకట్టు నుంచి అటు సాగునీరు, తాగునీరు సులభంగా అందేది.
ప్రస్తుతం మూడు మోటార్ల ద్వారా నీటిని విడుదల చేయకపోవడంతో ఏఎమ్మార్పీకి గుండెకాయ లాంటి అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో 245 ఎఫ్ఆర్ఎల్కు గానూ 241.1ఎఫ్‌ఆర్‌ఎల్‌తో డెడ్ స్టోరేజీకి చేరింది. సాగర్ నీటి మట్టం తక్కువ ఉండటంతో జూలై 17 వరకు కేవలం ఏఎమ్మార్పీ నుంచి 1600 క్యూసెక్కుల నీటిని మాత్రమే విడుదల చేయగలిగారు. జూలై 8న ఉదయ సముద్రానికి 1000 క్యూసెక్కు నీటిని విడుదల చేయడంతో ఏకేబీఆర్ నీటి మట్టం మరింత పడిపోయింది.
దీంతో ప్రధాన కాల్వకు వెయ్యి నుంచి 1200 క్యూసెక్కులకు పెంచారు. అయితే శుక్రవారం నుంచి 1200 క్యూసెక్కుల నుంచి నుంచి 950 క్యూసెక్కులకు ప్రధాన కాల్వ నీటి విడుదలను తగ్గించారు. రైతులు జోరుగా వరినాట్లు వేస్తున్న క్రమంలో అన్ని డిస్ట్రిబ్యూటరీలకు నీరు చేరడం కష్టంగా మారుతోంది. తక్షణమే నాలుగో యూనిట్ పనులను పూర్తి చేస్తే తప్ప ఏఎమ్మార్పీకి పూర్తి స్థాయి నీటి విడుదలకు మరో మార్గం లేదు. రైతులు నీటి విడుదల కోసం ధర్నాలు కూడా చేస్తున్నారు.
ఏఎమ్మార్పీ ప్రాజెక్టు పరిధిలోని అన్ని డిస్ట్రిబ్యూటరీలకు తగిన మొత్తంలో నీరు చేరడం లేదు. ఏకేబీఆర్ రిజర్వాయర్ నుంచి 243.5 ఎఫ్ఆర్ఎల్ నుంచి నీటి తరలించేందుకు ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూటరీ 7-బీ కాల్వ ఎండి పోయింది. గుడిపల్లి, గుర్రంపోడ్ మండలాల్లో దాదాపు 5 వేల ఎకరాలకు సాగు నీరందించే ఏకేబీఆర్ కాల్వ నీటి మట్టం తగ్గడంతో నీరందడం లేదు. దీంతో గత రెండు రోజుల క్రితం దేవరకొండ ఎమ్మెల్యే బాలూనాయక్‌కు గుడిపల్లి రైతులు మొర పెట్టుకున్నారు.
అదేవిధంగా ఏకేబీఆర్ రిజర్వాయర్ నుంచి నేరుగా వ్యవసాయ మోటార్ల ద్వారా ఎగువన ఉన్న రైతులు వేల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ప్రస్తుతం జలాలు దిగువకు పడిపోవడంతో ఏకేబీఆర్ ఎగువన ఉన్న రైతులు ఆందోళనకు గురవుతున్నారు.కొన్ని డిస్ట్రిబ్యూటరీలకు నామమాత్రంగా నీటిని విడుదల చేయడంతో మైనర్లకు కూడా నీరు చేరకపోవడంతో పూర్తిస్థాయిలో ఆయకట్టు రైతులకు నీరందడంలేదు. ఏది ఏమైనా సాగర్ పూర్తిగా నిండి, లక్షల క్యూసెక్కులు సముద్రంలో కలుస్తున్నా అధికారుల అనాలోచిత నిర్ణయాలతో ఏఎమ్మార్పీ ఎండిపోయే దుస్థితి వచ్చింది.