బీబీనగర్, ఏప్రిల్ 28: ప్రజారోగ్యంపై అవగాహన పెంపొందించేందుకు బీబీనగర్ ఎయిమ్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 89.6 ఎఫ్ఎం కమ్యూనిటీ రేడియో స్టేషన్ ఉపయోగపడుతుందని ఎయిమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రొఫెసర్ డా.అమితా అగర్వాల్ అన్నారు. కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ సహకారంతో ఏర్పాటు చేసిన కమ్యూనిటీ రేడియో స్టేషన్‌ను ఎయిమ్స్ అధ్యక్షుడు డా. చంద్రశేఖర్ మేశ్రామ్ , మెడికల్ సూపరింటెండెంట్ ప్రొఫెసర్ డా. లకిరెడ్డి మహేశ్వర్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు ఆరోగ్య సమాచారాన్ని చేరవేయడంలో ఎఫ్ఎం రేడియో సాయపడుతుందన్నారు. ఎయిమ్స్ పరిసర ప్రాంతా ల్లో సుమారు 10 కిలోమీటర్ల పరిధిలో ప్రజారోగ్య అవగాహన కార్యక్రమాలు, ఆరోగ్య విద్య, వ్యాధుల నివారణపై సందేశాలు, సమాజానికి అవసరమైన ముఖ్యమైన సమాచారాన్ని ఈ రేడియో ద్వారా ప్రసారం చేయనున్నట్లు తెలిపారు. కమ్యూనిటీ రేడియో ఆపరేషనల్ కమిటీ చైర్ పర్సన్ డా.ఏఎస్ సుభాత్ర మాట్లాడుతూ ‘డయల్ ఏడాక్టర్’ వంటి ప్రత్యేక కార్యక్రమాలను ప్రవేశపెట్టి నేరుగా వైద్య నిపుణులతో మాట్లాడే అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు.