నల్లగొండ ప్రతినిధి, నవంబర్22(నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులను ఎట్టకేలకు ఏఐసీసీ ప్రకటించింది. కాంగ్రెస్ శ్రేణులు ఊహించని విధంగా ఉమ్మడి జిల్లా పరిధిలోని అధ్యక్షులను ఖరారు చేయడం చర్చనీయాంశమైంది. ఇప్పటికే జిల్లాలో మెజార్టీ ప్రజాప్రతినిధులంతా రెడ్డి సామాజిక వర్గానికే చెందిన వారు కావడంతో డీసీసీ అధ్యక్షుల్లో వారికి స్థానం దక్కలేదు. నల్లగొండ లేదా సూర్యాపేట జిల్లాల్లో ఒక జిల్లాకు రెడ్డి వర్గానికి డీసీసీ అధ్యక్ష స్థానం దక్కుతుందని ఊహించారు. శనివారం సాయంత్రం ప్రకటించిన డీసీసీ అధ్యక్షుల జాబితాలో ఇద్దరూ బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు కాగా ఒకరు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారికి స్థానం దక్కింది.
యాదాద్రి భువనగిరి జిల్లాకు అనూహ్యంగా ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్యకు డీసీసీ అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టారు. ఇక్కడ బీసీ వర్గానికే చెందిన పోత్నక్ ప్రమోద్‌కుమార్‌కు దాదాపు ఖారారైనట్లు గతంలోనే విస్త్రత ప్రచారం జరిగింది. ఇక్కడ ఎమ్మెల్యేకే కట్టబెట్టారు. ఇప్పటికే ఎమ్మెల్యే అయిలయ్య ప్రభుత్వ విప్‌గా గానూ కొనసాగుతుండగా మరో పదవి కూడా ఆయనకే దక్కింది. మంత్రివర్గంలో యాదవ సామాజిక వర్గానికి స్థానం లేకపోవడంతో ఈ విధంగా డీసీసీ అధ్యక్షుల కోటాలో కేటాయించారని సమాచారం. సూర్యాపేట జిల్లాలో కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతికే డీసీసీ అధ్యక్ష స్థానం ఇస్తున్నట్లు చర్చ జరిగింది. ఇక్కడ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేశ్‌రెడ్డి, రాంరెడ్డి సర్వోత్తంరెడ్డి మధ్య పోటీ నెలకొనగా మధ్యేమార్గంగా పద్మావతి పేరు తెరపైకి వచ్చింది.
వీరెవరి పేర్లతో సంబంధం లేకుండా తుంగతుర్తి మండలానికి చెందిన ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన గుడిపాటి నర్సయ్యకు డీసీసీ అధ్యక్ష పదవి కేటాయించారు. మంత్రి ఉత్తమ్ సిఫార్స్‌తోనే జరిగినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నల్లగొండ విషయంలోనూ పార్టీ నేతల అంచనాలకు భిన్నంగా మునుగోడుకు చెందిన పున్న కైలాస్నేతకు డీసీసీ అధ్యక్ష పదవి దక్కింది. వాస్తవంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ముఖ్య అనుచరుడైన గుమ్ముల మోహన్‌రెడ్డికి డీసీసీ అధ్యక్ష పదవి కోసం తీవ్రంగా కసరత్తు జరిగింది. ఒకవేళ రెడ్డి సామాజిక వర్గానికి వద్దనుకుంటే నిడమనూరుకు చెందిన జానారెడ్డి అనుచరుడు కొండేటి మల్లయ్యకు డీసీసీ అధ్యక్ష పదవి వస్తుందన్న అంచనాలు ఉండే. పున్న కైలాస్నేత కూడా డీసీసీ అధ్యక్ష పదవి కోసం తీవ్రంగా ప్రయత్నం చేశారు. రాష్ట్ర వ్యాప్తం సమీకరణాల్లో భాగంగా పద్మశాలీ కులానికి ప్రాధాన్యతనిచ్చే క్రమంలో పున్న కైలాస్నేతను డీసీసీ అధ్యక్ష పదవి వరించినట్లు అంటున్నారు. నల్లగొండ నుంచి డీసీసీ అధ్యక్ష పదవిపై భారీ ఆశలు పెట్టుకున్న గుమ్ముల మోహన్‌రెడ్డి, కొండేటి మల్లయ్య తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నట్లు తెలిసింది.