సూర్యాపేట టౌన్, ఆగస్టు 27 : కోదాడ సబ్ డివిజన్ పరిధిలో బావులు, చెరువులు, వాగుల వద్ద రైతులు ఏర్పాటు చేసుకున్న మోటార్లు, రాగి తీగ దొంగతనానికి పాల్పడిన నలుగురిని, వాటిని కొనుగోలు చేసిన ఒకరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ సన్‌ప్రీత్ సింగ్ తెలిపారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్టీఆర్ జిల్లా చంద్రల్లపాడు మండలం ముప్పళ్ల గ్రామానికి చెందిన ఉప్పతల వాసు (ఏ1), మఠంపల్లి మండలం రఘునాథపాలెం గ్రామానికి చెందిన వేముల కేటేశ్వర్రావు (ఏ2), గుండ్లపల్లి గ్రామానికి చెందిన ఆకారపు వెంకటి (ఏ3), సుల్తాన్పురం గ్రామానికి చెందిన అజ్మీరా మంత్రియా (ఏ4) జల్సాలకు అలవాటుపడి దొంగతనాలు చేస్తున్నారు.
హుజూర్నగర్, కోదాడ నియోజకవర్గాల పరిధిలో సంవత్సర కాలం నుంచి అనేక ప్రాంతాల్లో మోటార్లు దొంగతనాలు చేసేందుకు పగటిపూట రెక్కీ నిర్వహించి అదే రోజు రాత్రి మోటార్లు, మోటార్లలోని వైండింగ్ కాపర్ వైర్‌ను ఎత్తుకెళ్లారు. వాటిని మఠంపల్లి గ్రామానికి చెందిన పాత ఇనుప సామాను వ్యాపారి గడగంట్ల శ్రీనుకు అమ్మారు. సోమవారం గరిడేపల్లి మండలం పరెడ్డిగూడెం గ్రామ స్టేజీ వద్ద పోలీసులు వాహనాల తనిఖీ చేస్తుండగా అనుమానాస్పద స్థితిలో ఉన్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
మఠంపల్లి మండలం కాసరిగూడెం వద్ద వేర్వేరు బైకులపై వచ్చిన మరో ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారించగా.. దొంగతనాలు ఒప్పుకొన్నారు. వారితోపాటు పాత ఇనుప సామాను వ్యాపారిని అదుపులోకి తీసుకున్నారు. 31మోటార్లు, 135 మోటార్ల నుంచి దొంగిలించిన కాపర్ వైరు అమ్మగా రూ.10.01 లక్షలు వచ్చినట్లు చెప్పారు. ఆ నగదుతోపాటు మోటార్లు, ఒక ఆటో, 3 బైక్‌లు, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు.
గతంలో వీరిపై అనేక కేసులు ఉన్నాయన్నారు. వాసుపై తెలంగాణ నుంచి మద్యం తరలించే కేసు, కోటేశ్వర్రావు, వెంకటిపై హత్య కేసు, మంత్రియాపై పీడీఎస్ రైస్ తరలింపులో రెండు కేసులు ఉన్నట్లు తెలిపారు. కేసులను చేధించిన సీఐ చరమందరాజు, ఎస్ఐలు సైదులు, సీహెచ్ నరేశ్, ఐడీ సిబ్బంది, కానిస్టేబుళ్లను ఎస్పీ అభినందించారు. విలేకరుల సమావేశంలో ఏఎస్పీ నాగేశ్వర్రావు పాల్గొన్నారు.