కోదాడ, సెప్టెంబర్ 02 : అసెంబ్లీ ఎన్నికల్లో అమలుకు సాధ్యం కాని హామీలతో ప్రజలను మోసం చేసి గెలిచిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేసేంత వరకు ఉద్యమం నిర్వహిస్తామని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై బుధవారం కోదాడ ప్రధాన రహదారిపై గాంధీ విగ్రహ ఎదుట వందలాది మంది గులాబీ శ్రేణులతో నిర్వహించిన ధర్నాను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ప్రజల సమస్యలను గాలికి వదిలేసి కాంగ్రెస్ ప్రభుత్వం తుగ్లక్ పాలన కొనసాగిస్తుందని విమర్శించారు. వెయ్యి రోజుల్లో వెయ్యి అబద్దాలు చెబుతూ ప్రజలను వంచించిన సర్వబ్రష్ట ప్రభుత్వమని మండిపడ్డారు. ఇక మంత్రులు కాంట్రాక్టులబిల్లుల చెల్లింపులో కమీషన్ను దండుకుంటూ రాష్ట్ర ఖజానాను లూటీ చేస్తున్నారన్నారు. విద్యార్థి, యువత, మహిళ, నిరుద్యోగ యువకులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు. జాబ్ క్యాలెండర్ ఉసేలేదన్నారు.
బీఆర్ఎస్ హయాంలో నిర్మాణం చేపట్టిన అభివృద్ధి పనులకు వీరు ప్రారంభోత్సవాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. హెలికాప్టర్లలో జల్సా చేస్తూ ఇప్పటివరకు ఏ ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు. రైతులకు సాగునీరు ఇవ్వలేని అచేతన ప్రభుత్వం అన్నారు. పాలన చేతగాక ప్రజలకు తామేం చేశామో చెప్పుకునే దమ్ములేక 14 సంవత్సరాలు అలుపెరగని పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించి ముఖ్యమంత్రిగా సుపరిపాలన చేసిన మహనీయుడు కేసీఆర్ పై పిచ్చి పట్టినట్లుగా ప్రేలాపన చేస్తున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆరు గ్యారంటీలు, 420 హామీలు నెరవేర్చేదాక వెంట పడుతూనే ఉంటామని ప్రజాక్షేత్రంలో ఎండగడతామన్నారు. ఈ నిరసన ధర్నాలో కార్యక్రమంలో మండల, పట్టణ బీఆర్ఎస్ నాయకులు బట్టు శివాజీ, జానకి, రామాచారి, శ్రీనివాస్, కంది బండసత్యనారాయణ, కోలా ఉపేందర్, రామయ్య, రమేష్, నర్సిరెడ్డి, ఆంజనేయులు, మహేష్ గౌడ్, భూపాల్ రెడ్డి, పొట్ట కిరణ్ కుమార్, నయీమ్, చీమ నరేష్, కుక్కడపు బాబు, తుమ్మలపల్లి, భాస్కర్, ఉపేందర్ గౌడ్, చింత కవిత, కరీముల్లా, కాసాని మల్లయ్య గౌడ్, మధుసూదన్ రెడ్డి, దేవల నాయక్ బాబు, జానీ పాషా, వెంకట్, వందలాదిమంది బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.

హామీలు అమలు చేసేంత వరకు ఉద్యమం : మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్