సూర్యాపేట, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): సూర్యాపేట జనరల్ దవాఖానలో ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పని చేస్తున్న చిరుద్యోగులను కొంతమంది జలగల్లా పట్టి పీడిస్తున్నారు. ఏజెన్సీలు మారినందున ఉద్యోగంలో కొనసాగాలంటే లక్ష రూపాయలు ఇవ్వాల్సిందే.. లేదంటే తప్పిస్తామంటూ హెచ్చరిస్తున్నారు. రేవంత్ సర్కార్ వచ్చాక ఏజెన్సీల స్థానంలో ఏడాదిన్నరగా ఇదే తంతు కొనసాగుతోంది. కొంతమంది డబ్బులు ఇవ్వలేని వారిని తొలగించినట్లు కూడా తెలిసింది. సుమారు ఐదు నెలల క్రితం ఇలాంటి అక్రమ వసూళ్ల విషయమై నమస్తే తెలంగాణలో ‘పన్నెండు ఉద్యోగాలు.. పావు కోటి మామూళ్లు’ శీర్షికన వార్త ప్రచురితం కావడంతో.. నాడు ఓ సీనియర్ అసిస్టెంట్, ఏడీలను సస్పెండ్ చేశారు.
అయినప్పటికీ ఔట్సోర్సింగ్ ఏజెన్సీల తీరు మారలేదు. దీంతో అక్రమ వసూళ్లకు పాల్పడుతూ స్థానిక అధికారులకు కొంత పంచుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మెరుగైన వైద్య సేవలు అందించడంలో సూర్యాపేట జనరల్ దవాఖానకు పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడు గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ప్రత్యేక చొరవతో దవాఖానకు ఏది కావాలన్నా వెనువెంటనే వచ్చేది. దీంతో ఈ దవాఖాన ప్రసవాలతో పాటు పలు విభాగాల్లో రికార్డులు సొంతం చేసుకుంది.
కోవిడ్ సమయంలో సూర్యాపేటతో పాటు నల్లగొండ, జనగాం, హైదరాబాద్ వంటి ప్రాంతాలే కాకుండా ఆంధ్ర నుంచి కూడా అనేక మంది వచ్చి ఇక్కడ చికిత్స పొంది ఆరోగ్యంగా వెళ్లారు. అలాంటిది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఈ దవాఖానకు రోగం వచ్చింది. దీనికి తోడు ఎవరికి వారు ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతో అవినీతి అక్రమాలు పెచ్చరిల్లి పోతున్నాయి. డాక్టర్లు అందుబాటులో ఉండరు… మందులు ఉండవు… అంబులెన్స్‌లను మూలకు పెట్టారు… నిర్వహణ ఎంత దారుణంగా ఉందంటే గతంలో ఓ సారి దవాఖానలోకి ప్రైవేట్ వ్యక్తులు వచ్చి డాక్టర్ అవతారమెత్తినా గుర్తించకపోవడం, ఆరోగ్య శ్రీ నిధులను అసలైన వారికి కాకుండా డబ్బుకు కక్కుర్తి పడి చికిత్సతో సంబంధం లేని నకిలీలకు ఇచ్చిన ఘటనలు అనేకం. నాలుగైదు నెలల క్రితం ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల నియామకం కోసం డబ్బులు వసూలు చేసిన ఇద్దరిని సస్పెండ్ చేసిన విషయం విదితమే. ఇంత జరిగినా ఏమాత్రం తీరు మారకుండా అక్రమాలు పునరావృతం అవుతున్నాయి. తాజాగా మరోసారి ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను బెదిరింపులకు గురి చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.
30 వేల నుంచి లక్ష వరకు వసూలు
ప్రభుత్వం మారిన తరువాత ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలను మార్చేందుకు ఒక యుద్ధమే జరిగింది. అధికారులు అష్టకష్టాలు పడినా మార్చలేకపోవడంతో చివరకు కోర్టు ద్వారా ఏజెన్సీలను మార్చాల్సి వచ్చింది. దీంతో ఉద్యోగాన్ని బట్టి రూ.30వేల నుంచి లక్ష రూపాయల వరకు బలవంతంగా వసూలు చేస్తున్నట్లు పేరు చెప్పడానికి నిరాకరిస్తున్న పలువురు కంప్యూటర్ ఆపరేటర్లు, సెక్యూరిటీ, శానిటేషన్, ఎలక్ట్రీషియన్లు, ఎంఎన్‌వోలు, ధోబీ తదితర ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు నమస్తే తెలంగాణతో వాపోయారు. ముఖ్యమంత్రి ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలను తొలగించి సొసైటీలను ఏర్పాటు చేస్తానంటున్నారని, అలా చేయడం ద్వారా భవిష్యత్తులో రెగ్యులర్ అవుతారని మభ్యపెడుతున్నారట.
ఇప్పటికే కొంతమందిని బలవంతంగా తొలగించి కోదాడ, హుజూర్నగర్ ప్రాంతాలకు చెందిన వారి వద్ద రూ.50వేల వరకు తీసుకొని రిక్రూట్ చేసినట్లు తెలిసింది. అలాగే ఇప్పటికే ఉన్న వారి వద్ద రూ.30వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారట. ఈ విషయం ఇటీవల ఆనోట, ఈనోట పడి ఉన్నతాధికారులకు తెలియడంతో విచారణ చేసినట్లు సమాచారం. విచారణలో వసూళ్ల పర్వం వాస్తవమేనని తేలగా రిపోర్టు ఎక్కడ ఉందో.. దానిని ఎవరు తొక్కి పెట్టారో ఆ దేవునికే ఎరుక. సుదీర్ఘ కాలంగా పని చేస్తూ కోవిడ్ కాలంలో సేవలు అందంచిన వారు, భర్తలు చనిపోయి దుఃఖంలో ఉన్న వారిని గత పాలకులు జనరల్ దవాఖానలో ఉపాధి కల్పించగా అలాంటి వారి నుంచి ముక్కుపిండి మరీ వసూలు చేయడం ఎంత వరకు సమంజసమని పలువురు అభిప్రాయపడుతున్నారు. తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నుంచి అక్రమ వసూళ్లను అరికట్టాలని కోరుతున్నారు.