వివిధ దేశాల అందాల తారలు యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించనున్నారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయం, ప్రముఖ పర్యాటక ప్రాంతమైన భూదాన్‌పోచంపల్లిలో సందడి చేయనున్నారు. ఈ మేరకు రెండు చోట్లా జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఏర్పాట్లను కలెక్టర్ హనుమంతరావు పర్యవేక్షించారు. మిస్ వరల్డ్ పోటీదారులు ప్రత్యేక బస్సుల్లో రానున్నారు. యాదగిరిగుట్టలో దర్శనం చేసుకోవడంతోపాటు అబ్బురపరిచే ఆలయ శిల్పకళను వీక్షించనున్నారు. పోచంపల్లిలో చేనేత ప్రాముఖ్యతను తెలిపేలా ఏర్పాట్లు చేశారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
ప్రపంచ అందాల పోటీ లు హైదరాబాద్‌లో కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా తెలంగాణ ఖ్యాతిని ప్రపంచానికి తెలియజేయడానికి ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాలను సందర్శించేందుకు ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో గురువారం జిల్లాలోని యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయం, భూదాన్ పోచంపల్లికి 35మంది వరకు అందగత్తెలు రానున్నారు.
యాదగిరిగుట్టలో కరేబియన్ దీవులకు చెందిన సుమారు 10మంది అందగత్తెలు 1.40గంటలపాటు గడపనున్నారు. సాయంత్రం 5గంటలకు గుట్టకు చేరుకుంటారు. అక్కడి నుంచి అతిథి గృహానికి వెళ్తారు. అక్కడి నుంచి కొండపై అఖండ దీపారాధన చేస్తారు. కోలాటం, భజనలు, సంప్రదాయ నృత్యాలతో వారికి ఘన స్వాగతం పలుకుతారు. అక్కడే స్వర్ణవిమాన గోపురం కనిపించేలా ఫొటోలు దిగనున్నారు. అక్కడి నుంచి తూర్పు రాజగోపురం నుంచి ప్రధానలయంలోకి వెళ్తారు.
వారికి ఆలయ అర్చకులు వేదాశీర్వచనం ఇస్తారు. అనంతరం పడమర రాజగోపురం నుంచి బయటకు వస్తారు. స్వామివారి ప్రసాదం, చిత్రపటాలను అందజేస్తారు. ఈ సందర్భంగా ఆలయ వైభవం, కట్టడాలను పరిశీలించనున్నారు. పర్యటన ముగింపుతో తిరిగి హైదరాబాద్‌కు వెళ్లిపోనున్నారు. సుందరీమణుల పర్యటన సందర్భంగా సాయంత్రం బ్రేక్ దర్శనాలతోపాటు జోడు సేవను నిలిపివేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
పోచంపల్లికి ఆఫ్రికా ఖండానికి చెందిన 25మంది తారలు విచ్చేయనున్నారు. సాయంత్రం ఆరు గంటలకు మిస్ వరల్డ్ పోటీదారులు పోచంపల్లికి చేరుకుంటారు. రెండు బ్యాచ్‌లుగా చేరుకొని వేర్వేరుగా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ముందుగా వారికి కోలాటాలతో ఘన స్వాగతం పలుకుతూ బొట్టు పెట్టి శాలువా పూలమాలలో సత్కరిస్తారు. పోచంపల్లి రూరల్ టూరిజం సెంటర్ లోపల ద్వారం వద్ద ముగ్గులతో అందంగా అలంకరించిన టెర్రకోట్ కుండలను పరిశీలిస్తారు. లోపల గచ్చు ప్రాంత ంలో మెహందీ వేయడాన్ని తిలకిస్తారు. లైవ్ మ్యూజికల్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
మ్యూజియం లోపల ఏర్పాటు చేసిన చేనేత మగ్గాలపై చేనేత వస్ర్తాల తయారీ విధానాన్ని ప్రత్యక్షంగా తిలకించి.. దారం వడకడం నుంచి వస్ర్తాల తయారీ వరకు ప్రాసెసింగ్ విధానాన్ని వివరిస్తారు. టూరిజం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎడ్ల బండిని తిలకిస్తారు. తెలంగాణ సంప్రదాయానికి ప్రతీకగా నిలిచిన బతుకమ్మను పేర్చు తూ పాటలు పాడుతారు. అక్కడి నుంచి యాంపీ థియేటర్ వద్దకు చేరుకొని వీఐపీలతోపాటు సుందరీమణులు సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షిస్తారు.
ఫ్యాషన్ డిజైనర్ స్వాతి రూపొందించిన ఇండో- వెస్ట్రన్ ఇక్కత్ వస్ర్తాలతో మోడల్స్ నిర్వహించే ర్యాంప్ వాక్‌ను చూస్తారు. పోచంపల్లి ఇక్కత్ ప్రాముఖ్యతపై ప్రదర్శనను తిలకిస్తారు. ప్రాంగంణలో గుడిసెల సెట్లో చేనేత స్టాల్‌ను ఏర్పాటు చేశారు. ఏడు పోచంపల్లి ఇక్కత్ స్టాల్స్, గద్వాల, సిద్దపేట, గొల్లభామ, నారాయణపేటకు ఒక్కో స్టాల్‌ను ఏర్పాటు చేశారు. మ్యూజియంలో లైవ్ డెమోనిస్ట్రేషన్లో మగ్గంపై వస్త్ర తయారీని పరిశీలిస్తారు.
సుందరీమణుల పర్యటన నేపథ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. టూర్ ప్రాంతాల్లో సీసీ కెమెరాలతో నిరంతరం పర్యవేక్షించనున్నారు. వీటిని స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి నేరుగా హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేశా రు. మూడంచెల భద్రతలో పర్యటన కొనసాగనుంది. అందగత్తెల వెంట మహిళా పోలీసులు ఉండనున్నారు. ఒక్కొక్కరికి ఒక్కో మహిళా పోలీసును నియమించారు. వారు వచ్చినప్పటి నుంచి పోయే వరకు వారి వెంటే ఉండనున్నారు. టూర్ నేపథ్యంలో సుమారు 500 మంది పోలీసులు విధులు నిర్వహించనున్నారు.