నీలగిరి, ఏప్రిల్18 : రోజురోజుకు కొత్త కొత్త యాప్లు సృష్టించి మోసపూరిత ప్రకటనలతో అమాయకపు ప్రజలను ఆశలు చూపి అందినకాడికి దోచుకుంటున్నారు. యాప్లో పెట్టుబడి పెట్టి ఒకరిని చేర్పిస్తే కొంత నగదు వస్తుందని ముందుగా ఆశపెట్టి ఎక్కువ సంఖ్యలో సభ్యులు చేరాక బోర్డులు తిప్పేస్తున్నారు. అదే క్రమంలో నల్లగొండ జిల్లాలో వెలుగుచూసింది. మహారాష్ట్రలో పుణే వేదికగా వీఐపీ యాప్ పేరుతో కొత్తగా తీసుకొచ్చి మార్కెట్లో ఉంటున్న కొంతమందిని ఏజెంట్లుగా పెట్టుకున్నారు.
వారి నుంచి కొంత నగదును పెట్టుబడి పెట్టించి అందులో వారికి కొంత ప్రాఫిట్ వచ్చేలా చేసి నగదును వారి ఖాతాల్లో వేశారు. పెట్టిన పెట్టుబడి రెట్టింపు కావడంతో వారు తమకు పరిచయం ఉన్న వారిని అందులోకి తీసుకొచ్చి అతి తక్కువ సమయంలో డబ్బులు రెట్టింపు అంటూ ఆశలు చూపి సభ్యులుగా చేర్చుకున్నారు. ఇలా నల్లగొండ జిల్లాలో సుమారు రెండు వేలకు పైగా సభ్యులను చేర్పించి ఒక్కొక్కరి నుంచి రూ.5 లక్షల నుంచి 50 లక్షల చొప్పున సుమారు రూ.300 కోట్లను చైన్ సిస్టమ్ పద్ధతిలో పెట్టుబడి పెట్టించారు.
కొంతమంది తమ వద్ద ఉన్న డబ్బులు పెట్టగా మరికొంతమంది అప్పులు చేసి మరి అందులో సభ్యులుగా చేరారు. వారు చేరిన తరువాత ఇంకా సభ్యులు చేరుతావుంటే అధిక మొత్తంలో నగదు వస్తుందని బురిడీ కొట్టించారు. గత రెండు రోజులు క్రితం యాప్ బ్లాక్ అవ్వడంతో బాధితులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. సుమారు నాలుగు వందల మంది యాప్ బాధితులు డీఎస్పీ శివరాంరెడ్డిని ఆశ్రయించడంతో నల్లగొండ రూరల్ ఎస్ఐ సైదాబాబు నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి విచారణ చేపట్టారు.