సూర్యాపేట టౌన్, ఏప్రిల్ 30 : 30 సంవత్సరాలు పోలీసు శాఖలో అదనపు ఎస్పీ జనార్దన్ రెడ్డి సేవలు అందించడం అభినందనీయమని అడ్మిన్ అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి అన్నారు. గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అదనపు ఎస్పీ ఆర్.జనార్దన్ రెడ్డి ఉద్యోగ విరమణ అభినందన సభలో పాల్గొని ఆయన మాట్లాడారు. ఉద్యోగ విధుల నిర్వహణలో జనార్దన్‌రెడ్డి బాధ్యతగా, పారదర్శకంగా ఉండేవారన్నారు. ప్రతి పోలీసు అధికారికి, పోలీసు సిబ్బందికి మెచ్చిన నచ్చిన జిల్లా అధికారి అన్నారు. క్రింది స్థాయి సిబ్బందిని ఎప్పటికప్పుడు ఉత్తేజపరుస్తూ ఒక దిక్సూచిగా పని చేశారని కొనియాడారు. ఈ సందర్భంగా ఆయనను ఘనంగా సన్మానించి సాదరంగా వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట డివిజన్ డీఎస్పీ ప్రసన్న కుమార్, ఏ ఆర్ డీ ఎస్పీ నరసింహ చారి, ఏఓ మంజు భార్గవి, సిఐ లు రాజశేఖర్, వెంకటయ్య, శివకుమార్, ఆర్ఐ ప్రవీణ్ కుమార్, పోలీసు సంక్షేమ సంఘం అధ్యక్షుడు రామచందర్ గౌడ్, ఆర్ఎస్లు సురేష్, సాయిరాం, అఖిల్ పాల్గొన్నారు.