గ్రామస్థాయి విధుల్లో అందరి నోళ్లల్లో నానేది.. అంగన్వాడీ టీచర్ నౌకరే. వేతనం మూరెడు. విధులు బారేడు.. అనే దైన్యస్థితి వారిది. సొంత శాఖ విధుల కంటే ఇతర శాఖల్లోని అదనపు బాధ్యతలే వీరికి అధిక భారాన్ని నెత్తిన పెడుతున్నాయి. వీధిలో, ఊరి చివరన చీమ చిటుక్కుమన్నా.. ప్రభుత్వానికి ప్రాథమిక సమాచారం అందించే బాధ్యత మీకు లేదా.. అంటూ యంత్రాంగం నుంచి చివాట్లు.. చీత్కారాలు.. వీరు స్త్రీ శిశు సంక్షేమంలో అత్యంత కీలకమైన విధుల్లో ఉండే అంగన్వాడీలు.. వైద్య ఆరోగ్య, పంచాయతీరాజ్, రెవెన్యూ, పోలీసు శాఖలు సహా ఎన్నికల సంఘం విధుల్లోనూ భాగస్వాములు అవుతున్నారు. పనిభారాలు, పడిగాపులతో సహవాసం చేసేది అంగన్వాడీలే. చివరికి సొంత శాఖల్లో ఆయాల వీధుల్లోనూ చక్కదిద్దాల్సిని దయనీయస్థితి. అంగన్వాడీలపై పనిభారాలపై ప్రత్యేక కథనం..
నార్కట్పల్లి, ఆగస్టు 11: సొంత శాఖలోనే సవాలక్ష పనులతో క్షణం తీరిక లేకుండా అంగన్వాడీ టీచర్లు విధులు నిర్వహిస్తున్నారు. వివాహితలు గర్భం దాల్చిన దగ్గర నుంచి వారి ఆరోగ్య పరిరక్షణ, కడుపులోని బిడ్డ సంపూర్ణ సంరక్షణను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉంటారు అంగన్వాడీ టీచర్లు. గర్భిణి వయస్సు, ఎత్తు, బరువు నుంచి మొదలుకొని సమస్త సమాచారాన్ని రికార్డుల్లో నమోదు చేస్తారు. యాప్లో డేటాను నిక్షిప్తం చేస్తారు. రాత్రి వేళలోనూ విధుల్లో తలమునకవుతున్నారు. గర్భిణీకి ప్రసవ సమయం దగ్గరపడినా, ప్రసవించి పండంటి బిడ్డ్దకు జన్మనిచ్చినా ఆయా వివరాలన్నీ ఎప్పటికప్పడు నమోదు చేస్తున్నారు. ఆ బిడ్డ ప్రాథమిక విద్యాభాసానికి వెళ్లే దాకా పర్యవేక్షిస్తుంటారు. ప్రీ ప్రైమరీ బాధ్యతలను వీళ్లే చూస్తున్నారు. ఈ మధ్యలో శిశువుల బరువు, ఎత్తు సహా వారి సమస్త ఆరోగ్య పర్యవేక్షణ, సమాచారాన్ని ఎప్పటికప్పుడు నమోదు చేస్తారు. తరువాత ఆన్లైన్లో నిక్షప్తం చేస్తారు. ఇవే క్షణం తీరికలేని పనులు అంటే.. వీటికి ఎన్నోరెట్లు అధికమైన అదనపు బాధ్యతలను వీరి నెత్తిన పెడుతోంది ప్రస్తుత ప్రభుత్వం. పట్టణ ప్రాంతాల్లో అత్యధిక శాతం అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు లేవు. అద్దె భవనాలల్లోనే నెట్టుకొస్తున్నారు. సొంత భవనాలకు ప్రభుత్వం నిధులు ఎప్పుడు విడుదల చేస్తుందనేది అంతుపట్టని అంశం. ఇక గ్యాస్ బిల్లులది ఇదే కథ. దీంతో వీటిని వీరు సొంతంగా భరిస్తూనే విరామం లేకండా విధులు నిర్వహిస్తుండటం గమనార్హం. అధికారుల ఆకస్మిక తనిఖీలు, విధుల్లో నిర్లక్ష్యమంటూ పెట్టే చీవాట్లు అదనం.
అనేక శాఖల అదనపు బాధ్యతలు
మాతృ సంస్థ బాధ్యతలేగాక ఇతర అనేక శాఖల్లోనూ ప్రభుత్వం వీరిని భాగస్వామ్యం చేసింది. మిషన్ భగీరథ, ఓటర్ల జాబితా, జ్వరాలు, తల్లి పిల్లల సర్వేను వీరే నిర్వహిస్తున్నారు. పారిశుథ్య పనులు, అవగాహన కార్యక్రమాలు, గ్రామసభల వంటివి క్రమం తప్పకుండా ఉంటాయి. పోక్సో కేసుల నమోదు వంటి అంశాల్లో ఒక్కసారి వీరు పోలీసుస్టేషన్ల చుట్టూ తిరగాల్సి వస్తుంది. బాల్య వివాహాలు జరిగితే మొదటి సమాచారం ఇవ్వాలి. ఆ సమయంలో పోలీసు స్టేషన్లో ఫిర్యాదులు, కేసులు వంటివి ఉంటే రాత్రి వరకు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి. ఇన్ని అదనపు పనుల భారం ఉండటంతో ఒక్కసారి సొంత శాఖ విధులకు కూడా సరైన న్యాయం చేయలేకపోతున్నారు. జిల్లాలో 9 ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో 2093 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. గర్భిణులకు, చిన్నారులకు సరైన ఆహారం అందించలేక ప్రభుత్వం నిర్వహించే అనేక విధులతో టీచర్లు సతమతమవుతున్నారు.
అంగన్వాడీలపై ‘సర్’ ప్రభావం
అంగన్వాడీ టీచర్లకు సర్ విధుల బాధ్యత మరింత భారంగా మారింది. రెండు చోట్ల రండు విధులను సమాంతరంగా పూర్తిస్థాయిలో చేయడం వీలు కాకపోవడంతో ఉన్నతాధికారులతో వారు మాటలు పడాల్సి వస్తోంది. కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం.. అనే నానుడిలా అంగన్వాడీ టీచర్ల పరిస్థితి. బీఎల్వోల విధుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు ఆటపాటలు నేర్పే టీచర్లకు బీఎల్వో డ్యూటీ వేయడంతో నెల రోజల నుంచి వారు ఇంటింటి ఓటర్ సర్వేల్లో తలమునకలై ఉన్నారు. ఇదే సమయంలో మాతృశాఖలో సొంత విధులకు పూర్తిస్థాయి న్యాయం చేయలేకపోతున్నారు. దీంతో ఆ శాఖలోని సీడీపీవోలు, సూపర్వైజర్ల ఒత్తిడి ఎదుర్కోనాల్సి వస్తోంది. టీచర్లు అంగన్వాడీ కేంద్రాలకు వెళ్లకపోతే అక్కడికి పిల్లలు రావడం లేదు. గుడ్లు, పాలు ఇవ్వకపోతే తల్లులు అధికారులకు ఫిర్యాదు చేస్తారు. ఒకవేళ అంగన్వాడీ కేంద్రాన్ని మూసి బీఎల్వో విధులను వెళ్తే మరుసటి రోజు ఉన్నతాధికారులకు సవాలక్ష ఫిర్యాదులు.. ఇంతలో ఎన్నికల విభాగం అధికారులు వచ్చి సర్ ప్రక్రియ ఎందుకు ఆలస్యమవుతోందంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. దీంతో వీరికి ఏం సమాధానం చెప్పాలో దిక్కు తోచని పరిస్థితి ఏర్పడుతోంది.
రాత్రి వేళల్లో.. డేటా ఎంట్రీ
ఉదయం నుంచి సాయంత్రం వరకు సొంత శాఖ పనులను, అదనపు శాఖ విధులను చక్కదిద్దుతున్న అంగన్వాడీలకు రాత్రివేళల్లో విశ్రాంతి దొరికే అవకాశం ఉండటం లేదు. శిశువుల జననాల దగ్గర నుంచి వారికి ఫీడింగ్ దాకా అన్ని అంశాలను మొన్నటి వరకు 14 రకాల రికార్డుల్లో నమోదు చేసేవారు. ఇప్పుడు సాంకేతికతను ప్రభుత్వం చేతిలో పెట్టడంతో… ఆ విధుల్లోనూ తలమునకలు కావాల్సిన పరిస్థితి. రాత్రివేళ ఇంటికి చేరుకున్నాక సమగ్ర సమాచారాన్ని యాప్లో నమోదు చేస్తున్నారు. రాత్రి 10 నుంచి 12 గంటల వరకు డేటాను ఆన్లైన్లో నిక్షిప్తం చేశాకే నిద్రకు ఉపక్రమించాల్సిన దుస్థితి.