నారు పోసిన నాటి నుంచి గింజ చేతికి వచ్చేదాకా ఎవుసమంటే అన్నదాతకు ఆందోళనే. అకాల వర్షం పడినా, చీడ పీడలు ఆశించినా నష్టం తప్పని పరిస్థితి. ఈ వానకాలం మాత్రం రైతన్న ఇంట వరి సిరులు కురిపిస్తున్నది. వర్షాలు సమయానుకూలంగా కరువడమే గాక, చీడపీడ బెడద కూడా పెద్దగా లేకపోవడంతో ధాన్యం దిగుబడి గణనీయంగా పెరిగింది. ఎకరాకు రెండు నుంచి మూడు క్వింటాళ్లు అదనంగా వచ్చినట్లు రైతాంగం చెప్తున్నది. గత వానకాలం ఎకరాకు 26 క్వింటాళ్ల ధాన్యం రాగా, ఈసారి 29 క్వింటాళ్ల వరకు వచ్చింది. ఎరువులు, పురుగు మందులు కూడా పెద్దగా వాడాల్సి రాకపోవడంతో తగ్గిన పెట్టుబడి ఖర్చు, పెరిగిన ధాన్యం దిగుబడితో కలిపి ఎకరాకు సుమారు 6 వేల రూపాయల వరకు అదనపు లాభం చేకూరినట్లయింది. సూర్యాపేట జిల్లాలో గత వానకాలం 4.60 లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా, 11.90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చింది. ఈసారి 4.71 లక్షల ఎకరాలకు గానూ 13.18 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రానున్నట్లు అధికారుల అంచనా వేస్తున్నారు.
స్వరాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సాగు బాగు పడడంతో రైతన్న పంట పండుతున్నది. వ్యవసాయానికి ఇస్తున్న ప్రోత్సాహానికి తోడు హరితహారం ద్వారా పచ్చదనం
పెంపు కోసం తీసుకుంటున్న చర్యలతో వాతావరణ సమతుల్యత ఏర్పడింది. వెరసి సకాలంలో వర్షాలు కురువడం.. అకాల వర్షాలకు ఫుల్ స్టాప్ పడడంతో ఈ సారి పంటల దిగుబడి పెరిగింది. అలాగే వరి
పంటను చీడపీడలు ఆశించకపోవడంతో మందులు కొట్టే బాధ తప్పింది. ఫలితంగా
పెట్టుబడి ఖర్చులు తగ్గాయి. గతంతో పోలిస్తే ఈ సంవత్సరం ఎకరానికి రెండు నుంచి మూడు క్వింటాళ్ల దిగుబడి పెరుగడంతో అన్నదాత మోములో సంతోషం నెలకొంది.
ఆరుగాలం కష్టించే రైతన్న ఉమ్మడి రాష్ట్రంలో తీవ్రంగా నష్టపోయాడు. తెలంగాణ ఏర్పాటు అనంతరం రైతన్న సంతోషంగా ఉండేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అహర్నిషలు పాటుపడుతున్నారు. సాగునీటిని అందించేందుకు ప్రాజెక్టుల నిర్మాణాలు చేపట్టడంతోపాటు రైతుబంధు ద్వారా పంటల పెట్టుబడి అందిస్తున్నారు. విత్తనం వేసే నాటి నుంచి పంట చేతికందే వరకు రైతులకు సూచనలు చేసేందుకు వ్యవసాయ శాఖను బలోపేతం చేస్తూ ప్రతి ఐదు వేల హెక్టార్లకో ఏఈఓను నియమించారు. ఎనిమిదేండ్ల టీఆర్ఎస్ పాలనలో ప్రభుత్వ పరంగా అన్నీ సమకూర్చారు. దాంతో రైతులు ఇంచు భూమి లేకుండా సాగు చేస్తూ పంటలు పండిస్తూ ఎంతో సంతోషంగా ఉంటున్నారు.
వరి దిగుబడి పెరిగింది వాస్తవమే
ఈ వానకాలంలో వరి ధాన్యం దిగుబడి పెరిగింది వాస్తవమే. దీనికి కారణం సకాలంలో వర్షాలు పడడం, అకాల వర్షాలు పడకపోవడంతోపాటు వాతావరణ సమతుల్యత. పంటలను చీడపీడలు ఆశించకపోవడం, తెగుళ్ల బాధ తప్పడంతో పంట పెట్టుబడి ఖర్చు తగ్గింది. దిగుబడి పెరిగింది. గతేడాది ఎకరానికి 26 క్వింటాళ్ల ధాన్యం దిగుబడి రాగా.. ఈ సారి 28క్వింటాళ్లకు పైనే వస్తుంది.
– రామారావునాయక్, డీఏఓ, సూర్యాపేట
ఈ కారు సేద్యం లాభసాటిగా ఉంది
నేను 30 ఏండ్లుగా వ్యవసాయం చేస్తున్నా. గత సంవత్సరం వానకాలంలో వరి పంటకు తెగుళ్లు సోకి పెట్టుబడి ఖర్చు ఎక్కువైంది. వాతావరణ పరిస్థితుల వల్ల దిగుబడి కూడా తక్కువైంది. పండిన ధాన్యానికి ధర తక్కువ పలికి నష్టం వచ్చింది. ఈ కారు సేద్యం లాభసాటిగా ఉన్నది. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా పొలాలు మంచిగా ఉన్నాయి. తెగుళ్లు సోకలేదు. మందులు అసలే కొట్టలేదు. దాంతో పెట్టుబడి ఖర్చు తక్కువైంది. ఎకరానికి పచ్చి వడ్లు 40 బస్తాలు పండినయి. రేటు కూడా బాగా పలికింది. గత వానకాలంతో పోల్చుకుంటే ఈ సారి ఎకరానికి రూ.5వేలు ఎక్కువ లాభం వచ్చింది.
– తంగెళ్ల నాగయ్య, రైతు, మునగాల
చక్కబడుతున్న వాతావరణ సమతుల్యత
ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న కార్యక్రమాలతో అన్ని రంగాలతో పాటు వాతావరణ సమతుల్యత చక్కబడుతున్నది. ఈ వానకాలంలో అకాల వర్షాలు కురువకపోవడమే ఇందుకు నిదర్శనం. వివిధ కారణాలతో వాతావరణ సమతుల్యత దెబ్బతిని అకాల వర్షాలు పడడం, పంటలు దెబ్బతినడం చాలా ఏండ్లుగా చూస్తున్నాం. అయితే.. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తరువాత అన్ని రంగాలకు సమాన ప్రాధాన్యత ఇస్తూ సాగు, తాగునీటిని అందించడం, చెరువులను పునరుద్ధరించడంతో భూగర్భజలాలు గణనీయంగా పెరిగాయి. ఇక హరితహారంతో కోట్లాది మొక్కలు నాటగా అవి పెరిగి నేడు ఎక్కడ చూసినా అడవులను తలపించేరీతిన పచ్చదనం అలుముకుంది. దీనికితోడు ప్లాస్టిక్‌పై యుద్ధం ప్రకటించడం, డంప్ యార్డుల్లో చెత్తను రీసైక్లింగ్ చేయడం ద్వారా గ్రామాల్లో చెత్తశుద్ధి పెరిగి దోమలు, బ్యాక్టీరియా తగ్గుముఖం పట్టింది. తద్వారా వాతావరణ సమతుల్యత ఏర్పడిందని వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు. అందుకే ఈ వానకాలంలో అకాల వర్షాలు కురువలేదని చెప్తున్నారు.
తగ్గిన పెట్టుబడి ఖర్చు..
వాతావరణ సమతుల్యత చక్కబడడంతో అకాల వర్షాలు తగ్గిపోయి ఈ సీజన్లో పంటలకు చీడపీడలు, తెగుళ్లు ఆశించలేదు. సకాలంలో వర్షాలు పడడంతో యూరియా మోతాదు కూడా తగ్గింది. ఫలితంగా పెట్టుబడి ఖర్చు తగ్గింది. అలాగే పంట దిగుబడి పెరిగింది. గతేడాది వానకాలంలో ఎకరానికి 26 క్వింటాళ్ల ధాన్యం దిగుబడి రాగా, ఈ సారి 28 క్వింటాళ్లు పండింది. గతేడాది జిల్లాలో 4.60 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా, ఈ సారి 4.71 లక్షల ఎకరాల్లో సాగైంది. నాడు ఎకరానికి 28 క్వింటాళ్ల చొప్పున దాదాపు 11.90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి రాగా, నేడు 28 క్వింటాళ్ల పైనే దిగుబడి వస్తుందని.. మొత్తంగా 13.18 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉన్నదని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. చీడపీడలు ఆశించకపోవడంతో ఎకరానికి రూ.1500 వరకు రైతులకు పెట్టుబడి ఖర్చు తగ్గింది.
ఎకరానికి 6క్వింటాళ్లు ఎక్కువ పండింది
సకాలంలో వర్షాలు పడటంతోపాటు వాతావరణం అనుకూలించడంతో ఈ ఏడాది పంటలు బాగా పండాయి. ఎకరానికి ఆరు క్వింటాళ్ల వరకు ఎక్కువ దిగుబడి వచ్చింది. పోయినసారి ఐదెకరాలు వరి పంట వేశాను. ఎకరానికి రూ.30 వేల వరకు పెట్టుబడి అయితే.. 18 క్వింటాళ్ల చొప్పున దిగుబడి వచ్చింది. ఈ సంవత్సరం అంతే వేసిన. ఎకరానికి రూ.25 వేల పెట్టుబడి అయ్యింది. 24 క్వింటాళ్ల చొప్పున దిగుబడి వచ్చింది. వర్షాలు, వాతావరణం అనుకూలించడంతోపాటు కాళేశ్వరం, మూసీ జలాలు రావడంతో పంట దిగుబడి పెరిగింది.
– పుట్ట పుల్లారెడ్డి, ఇమాంపేట, సూర్యాపేట మండలం