మునుగోడు, మే 16 : తడి, పొడి చెత్త సేకరణతో తయారు చేసే వర్మి కంపోస్ట్తో గ్రామ పంచాయతీలకు అదనపు ఆదాయంతో పాటు ఉపయోగాలు ఉంటాయని జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య, దేవరకొండ డివిజినల్ పంచాయతీ అధికారి శంకర్ నాయక్ తెలిపారు. శుక్రవారం నల్లగొండ జిల్లా మునుగోడు మండలం పరిధిలోని కచలాపురం గ్రామంలోని సెగ్రిగేషన్ షెడ్లో వర్మి కంపోస్ట్ తయారిపై మునుగోడు, చండూరు, గట్టుప్పల్ మండలాల అధికారులు, సిబ్బందికి ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీపీఓ వెంకయ్య, దేవరకొండ డీఎల్పీఓ శంకర్ నాయక్ మాట్లాడుతూ.. చెత్త నుంచి వర్మి కంపోస్ట్ ఎరువు తయారీపై పంచాయతీ కార్యదర్శులు దృష్టి సారించాలని సూచించారు.
గ్రామాన్ని జోన్లుగా విభజించుకోవాలని, ప్రతి జోన్కు 100 ఇండ్లు ఉండే విధంగా చూసుకోవాలన్నారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించాలని వాటితో వర్మి కంపోస్ట్ తయారు చేసి ఎగుమతి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ విషయంలో కార్యదర్శులు అలసత్వం వహించొద్దన్నారు. ఈ కార్యక్రమంలో మునుగోడు, చండూర్, గట్టుప్పల్ ఎంపీడీఓలు విజయభాస్కర్, యాదగిరి, మాధవరెడ్డి, ఎస్బిఎం కో ఆర్డినేటర్ మొయిన్ద్దీన్, ఎంపీఓలు, పంచాయతీ కార్యదర్శులు, గ్రామ పంచాయతీలకు సంబంధించిన మల్టీపర్పస్ వర్కర్లు పాల్గొన్నారు.
Munugode : వర్మి కంపోస్ట్తో గ్రామ పంచాయతీలకు అదనపు ఆదాయం : డీపీఓ వెంకయ్య