చందంపేట, జనవరి 19 : నల్లమల అటవీ ప్రాంతంలో అధికారులు చేపడుతున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. జంతువుల దాహార్తిని తీర్చేందుకు అటవీ ప్రాంతంలో నీటి తొట్ల ఏర్పాటుతోపాటు పలు కార్యక్రమాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ప్రాంతం నల్లమల అటవీ ప్రాంతంలో శాకాహార జంతువుల సంఖ్య పెరిగిందని డీఎఫ్ఓ సర్వేశ్వర్ శుక్రవారం తెలిపారు.
అటవీ శాఖ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు చేపట్టిన శాకాహార జంతు గణన పూర్తయిందని, ఇందులో జంతువుల సంఖ్య పెరిగినట్లు తేలిందని అన్నారు. చందంపేట మండలంలోని చిత్రియాల, పెద్దమూల, దాసర్లపల్లి, నల్లచెలమూల, బచ్చాపురం గ్రామ సరిహద్దుల్లో ఉన్న ఎర్రపేడ, పాలపేడ ప్రాంతాల్లో అటవీ జంతువుల గణన చేపట్టామన్నారు.
ఆయా ప్రాంతాల్లో గతంలో కంటే జంతువుల సంఖ్య భారీగా పెరిగినట్లు చెప్పారు. నల్లమల అటవీ ప్రాంతంలో మనుబోతులు, దుప్పి, జింకలు, అడ వి కుక్కలు, కృష్ణజింక, ముళ్ల పంది, అడవి పందు లు, ఎలుగుబంట్లు, చిరుత పులుల సంఖ్య పెరిగినట్లు తెలిపారు. చిరుత పులిని ప్లగ్ మార్క్ ద్వారా గుర్తించినట్లు చెప్పారు. చిరుత పులుల సంఖ్య గతంలో కంటే పెరిగిందని డీఎఫ్ఓ తెలిపారు.