గుర్రంపోడ్, జూలై 15 : నల్లగొండ జిల్లాలోని అన్ని కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలు, పాఠశాలల విద్యార్థులకు అందిస్తున్న భోజనం విషయంలో సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, ఈ విషయంలో ఎవరు నిర్లక్ష్యం వహించినా కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు. మంగళవారం గుర్రంపోడ్ మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. వంట గదిని, డైనింగ్, పాఠశాల ఆవరణలో పరిశ్రుభతను పరిశీలించారు. పదో తరగతి గదిలోకి వెళ్లి గణితంపై విద్యార్థుల సామర్ధ్యాన్ని పరీక్షించారు. శ్రేడులు, భిన్నాలు తదితర గణిత అంశాలపై బోర్డుపై లెక్కలు వేసి విద్యార్థుల నుంచి సమాధానాలు రాబట్టారు.
అంతకుముందు కలెక్టర్ భవిత కేంద్రాన్ని సందర్శించి ప్రభుత్వం ఇటీవల భవిత కేంద్రాలకు పంపిణీ చేసిన ఆట వస్తువులు, ఇతర సామగ్రిని పరిశీలించారు. అనంతరం తాసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి భూ భారతిపై వచ్చిన దరఖాస్తుల వివరాలను పరిశీలించి దరఖాస్తులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. ఆయా కార్యక్రమాల్లో దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డి, జిల్లా ఉద్యాన శాఖ అధికారి అనంతరెడ్డి, డీఈఓ భిక్షపతి, తాసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ పి.మంజుల, మండల వ్యవసాయాధికారి కంచర్ల మాధవరెడ్డి, ఎంఈఓ యాదగిరి, డీఈ పరమేశ్, కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయ ప్రత్యేక విజయశ్రీ, ఏఈ రవికుమార్ పాల్గొన్నారు.