రామగిరి, జులై 03 : నల్లగొండ జిల్లా కేంద్రంలో అగ్ని ప్రమాద శాఖ అనుమతులు లేకుండా నడుస్తున్న పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టా శ్రీనివాస్ ఆధ్వర్యంలో జిల్లా విద్యా శాఖ ఏడీకి గురువారం వినతి ప్రతం అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. నల్లగొండ పట్టణంలో ప్రైవేట్ పాఠశాలలు ఫైర్ సేఫ్టీ అనుమతులు లేకుండా నడుస్తున్నా విద్యా శాఖాధికారులు పట్టించుకోకుండా విద్యార్థుల జీవితాన్ని ఫణంగా పెడుతున్నారని విమర్శించారు. కాగా కొన్ని పాఠశాలలు అనుమతులు ఒక అనుమతి మీద 4, 5 పాఠశాలలు నడిపిస్తుంటే ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన అధికారులు పట్టించుకోవట్లేదని తెలిపారు.
పట్టణంలో దాదాపు 60 శాతం పాఠశాలలు అగ్నిమాపక శాఖ అనుమతి తీసుకోలేదని, ఈ విషయం మీద ఆధారాలతో సహా పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని విమర్శించారు. వారం, పది రోజుల్లో చర్యలు తీసుకోకపోతే బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం ముందు అదేవిధంగా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన చేపట్టనున్నట్లు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ పట్టణాధ్యక్షుడు అంబటి ప్రణీత్, నకిరేకల్ నియోజకవర్గ మాజీ అధ్యక్షుడు జెట్టి శివ్రపసాద్, నాయకులు జనంపల్లి జాన్, ప్రేమ్, రమేశ్, అంగోతు బాలాజీ నాయక్, చింత మధు, భరత్ పాల్గొన్నారు.