– చండూరు మాజీ సర్పంచ్ కోడిగిరి బాబు
చండూరు, జులై 11 : చండూరు ఎస్ఐ శివకుమార్‌పై చర్యలు తీసుకోవాలని చండూరు మాజీ సర్పంచ్ కోడి గిరిబాబు డిమాండ్ చేశారు. శనివారం స్థానిక కాంగ్రెస్ నాయకులు, ప్రజా ప్రతినిధులతో కలిసి పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్ఐ గతంలో జరిగిన ఒక చిన్నపాటి గొడవను సాకుగా చూపి, ఒక వర్గానికి చెందిన సుమారు 16 మంది యువకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో విపరీతంగా కొట్టి రిమాండ్‌కు తరలించారన్నారు. అవతలి వర్గం వారు తప్పు చేసినప్పటికీ వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఎస్ఐ పక్షపాత వైఖరికి అద్దం పడుతోందని విమర్శించారు. ప్రస్తుతం మొగుదాల రవి అనే వ్యక్తి సోషల్ మీడియా (వాట్సాప్)లో వచ్చిన ఒక రాజకీయ ప్రకటనను తన స్టేటస్‌గా పెట్టుకున్నందుకు గాను, ఎస్ఐ అతనిపై గత పది రోజులుగా వేధింపులకు పాల్పడుతున్నారని తెలిపారు.
ఈ విషయమై డీఎస్పీ శివరాం రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా ఎస్ఐని మందలించినప్పటికీ ఆయన తీరు మారలేదన్నారు. ఈ రోజు ఉదయం మళ్లీ మొగుదాల రవిని స్టేషన్‌కు పిలిపించి, అతని ఫోన్ లాక్కుని బెదిరింపులకు గురిచేశారని, దీనిపై అడగడానికి వెళ్లిన తమ కార్యకర్తలను కూడా దుర్భాషలాడారన్నారు. అంతేకాకుండా ఏదైనా కేసులో తన సామాజిక వర్గం వారికే వంతపాడుతూ అవతలి వారిని వేధింపులకు గురి చేస్తున్నట్లు ఆరోపించారు. ఈ నిరసన కార్యక్రమంలో చండూరు మున్సిపల్ చైర్మన్ కోడి శ్రీనివాసులు, మాజీ కౌన్సిలర్ కోడి వెంకన్న, కౌన్సిలర్ పుష్పాక వాసు, కో ఆప్షన్ సభ్యులు ముగదాల వెంకన్న, ఖలీల్, స్థానిక కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.