నిడమనూరు, జులై 04 : విద్యార్థులకు వసతులు కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్ అన్నారు. శుక్రవారం నిడమనూరు మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబా పూలే, మైనారిటీ గురుకుల పాఠశాలలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలు, వసతి గృహాలను సందర్శించి విద్యార్ధులు, ఉపాధ్యాయుల హాజరు పట్టిక, సరుకుల నిల్వ రికార్డులు, తరగతి గదులను పరిశీలించారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా మరుగుదొడ్లు, పరుపుల ఏర్పాటు వంటి అంశాలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు.
వసతి గృహం వంట గది, పరిసరాల పరిశుభ్రతను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గురుకుల వసతి గృహాల్లో మౌలిక వసతుల కల్పనను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలన్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడంతో పాటు బస చేసే గదుల్లో ఫ్యాన్లు వంటి సౌకర్యాల కల్పనలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వసతుల కల్పనలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయన వెంట తాసీల్ధార్ జంగాల కృష్ణయ్య, ప్రిన్సిపాళ్లు కె.రాజశేఖర్, వెంకట్రెడ్డి, గిర్ధావర్ సందీప్ ఉన్నారు.