నీలగిరి, మే19 : ఈ నెల 17న నల్లగొండ జిల్లా నకిరేకల్‌లోని వీటి కాలనీలో ఇంట్లో ఒంటరిగా ఉంటున్న వృద్దురాలిపై దాడి చేసి చోరీకి పాల్పడిన ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి మూడు తులాల బంగారు చైన్, నాలుగు రోల్డ్ గాజులు, మూడు సెల్ఫోన్లు, హోండా యాక్టీవాను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. కేసు వివరాలను నల్లగొండ డీఎస్పీ కొలను శివరాంరెడ్డి సోమవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. నకిరేకల్ పట్టణంలోని వీటీ కాలనీలో ఒంటిరిగా ఉంటున్న నాగులంచ లక్ష్మమ్మ ఇంటికి గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఇళ్లు అద్దెకు రావాలని అడిగారు. గదులు లేవని చెప్పడంతో మంచినీరు కావాలని అడిగారు. వృద్ధురాలు ఇంట్లోకి వెళ్లగా ఆమె వెంట లోపలికి చొరబడి గదిలోని దుప్పటిని చింపి దానితో ఆమె నోరు, కాళ్లు, చేతులు కట్టేసి పిడిగుద్దులు గుద్దారు. ఆమె ఒంటిపైన ఉన్న మూడు తులాల బంగారు గొలుసు, నాలుగు రోల్డ్ గాజులు తీసుకుని పరారయ్యారు.
దీనిపై పోలీసులు మూడు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఆదివారం నిందితులను పట్టుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన సత్యారం కృష్ణ, మామిడి బాలకృష్ణగా గుర్తించారు. నకిరేకల్‌కు చెందిన మల్లం నర్సింహ్మ, మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ముష్టి వెంకటేశ్వర్లు మొత్తం నలుగురు కలిసి వృద్ధురాలి ఇంట్లో దొంగతనం చేశారు. వీరిలో మల్లం నర్సింహ్మ పరారీలో ఉన్నాడు. సత్యారం కృష్ణపై 31, మామిడి బాలకృష్ణపై 13, ముష్టి వెంకటేశ్వర్లుపై ఒక దొంగతనం కేసు ఉన్నట్లు డీఎస్పీ వెల్లడించారు. ఈ సమావేశంలో నకిరేకల్ సీఐ రాజశేఖర్, ఎస్ఐలు లచ్చిరెడ్డి, శివ, డి.సైదులు. సాయి ప్రశాంత్, సిబ్బంది వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, రమేశ్, సునీల్, రవి, నర్సింహ్మ, హోంగార్డు నర్సిరెడ్డి పాల్గొన్నారు.