సూర్యాపేట టౌన్, ఏప్రిల్ 20 : సూర్యాపేటలో వృద్ధురాలి హత్య, చోరీ కేసులో పోలీసుల అదుపులో ఉన్న నిందితుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మిర్యాలగూడకు చెందిన సైదా చారి(48) ఏడాది కిందట కుటుంబంతో సూర్యాపేటకు వచ్చి పట్టణంలోని జె జె నగర్లో నివాసం ఉంటున్నాడు. నిత్యం మద్యం సేవించి వేధించడంతో మూడు నెలల క్రితం భార్య ఇంటి నుంచి వెళ్లిపోయింది. అదే వీధిలో ఒంటరిగా ఉన్న వృద్ధ మహిళ ఇరుగు పాపమ్మ (85) తో పరిచయం పెంచుకుని ఈ నెల 18న హత్య చేసి ఆమె వద్ద ఉన్న 3 తులాల బంగారు ఆభరణాలు దొంగలింంచాడు. దొంగలించిన బంగారు ఆభరణాలు మిర్యాలగూడలోని మణపురం గోల్డ్ లోన్ లో కుదువపెట్టి ఏలూరుకు పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడి ఆచూకి తెలుసుకున్న సూర్యాపేట టౌన్ పోలీసులు సైదాచారిని ఏలూరులో అదుపులోకి తీసుకుని ఆదివారం రాత్రి సూర్యాపేటకు తరలిస్తుండగా కోదాడ సమీపంలో అస్వస్థతకు గురయ్యాడు.
పోలీసులు వెంటనే నిందితుడిని కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం అర్ధరాత్రి మరణించినట్లు వైద్యులు నిర్ధారించినట్లు తెలిసింది. పోలీసులు మాత్రం మృతుడు సైదాచారికి బైపాస్ సర్జరీ అయినట్లు గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించినట్లు తెలుపుతున్నారు. కాగా నిందితుడు సైదాచారి మృతి పట్ల వివరాలు గోప్యంగా ఉంచడం, పోస్టు మార్టం గదిని పోలీసుల అదుపులో ఉంచి మీడియాను అనుమతించక పోవడంపై పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.