నల్లగొండ ప్రతినిధి, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ): శ్రీశైలం ఎడమ గట్టు కాల్వ సొరంగ మార్గం ఇన్లెట్ వైపు తవ్వకాల పనుల్లో శనివారం ఉదయం ప్రమాదం జరిగింది. శ్రీశైలం రిజర్వాయర్‌కు ఆనుకుని నాగర్‌కర్నూల్ జిల్లా దోమలపెంట వద్ద సొరంగ మార్గం ఇన్లెట్ మొదలవుతుంది. ఇటువైపు నుంచి ఇన్నాళ్లు శ్రీశైలంలో నీటి నిల్వలు ఉండ డం వల్ల నీటి ఊటతో తవ్వకాలు నిలిచిపోయాయి. రిజర్వాయర్‌లో నీటి నిల్వలు తగ్గిపోవడం వల్ల నాలుగు రోజుల కిందట టీబీఎంతో పనులు తవ్వకాలు మొదలుపెట్టారు. శనివారం ఉదయం 8 గంటలకు టీబీఎం పనులు మొదలయ్యాయి.
సరిగ్గా 30నిమిషాల్లోనే ఒక్కసారిగా పనులు మొదలుపెట్టిన చోట నీటి ఊటతోపాటు మట్టిదిబ్బులు కూలడం మొదలైంది. 150 మీటర్ల మేర ఇలాంటి పరిస్థితి తలెత్తడంతోపాటు క్షణాల్లోనే పెద్దశబ్ధం కూడా వచ్చి నీటితో కూడిన మట్టిదిబ్బలు టీబీఎం మీద పడిపడ్డాయి. ఈ సమయంలో టన్నెల్ బోరింగ్ మిషన్(టీబీఎం) మీద ఉన్న వాళ్లతోపాటు వెనుక భాగంలో విధులు నిర్వర్తిస్తున్న వాళ్లు వెంటనే కొద్దిదూరం వెనక్కి వచ్చేశారు. దాంతో ప్రమాదం నుంచి బయటపడగలిగారు. కానీ అప్పటికే టీబీఎం ముందు భాగంలో తవ్వకం పనుల్లో నిమగ్నమైన ఎనిమిది మంది మాత్రం అందులోనే చిక్కుకుపోయారు.
ఇందులో ఒక ప్రాజెక్టు ఇంజినీర్, ఇక సైట్ ఇంజినీర్, ఇద్దరు మిషన్ ఆపరేటర్లతోపాటు మరో నలుగురు కార్మికులు ఉన్నారు. వీరిని సురక్షితంగా కాపాడేందుకు అధికారులు రెస్కూ ఆపరేషన్ మొదలుపెట్టారు. నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితోపాటు అధికారులు అక్కడే ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. రాత్రి వరకు వీరి ప్రయత్నాలు కొనసాగుతున్నా అప్పటికే కూలిన ప్రాంతంలో కరెంటు సరఫరా నిలిచిపోవడం, మట్టిదిబ్బలతో పాటు నీరు పేరుకుపోవడంతో రెస్కూ ఆపరేషన్‌కు తీవ్ర అంతరాయం కలుగుతున్నట్లు తెలిసింది.
రాత్రి వరకు ఆర్మీ రెస్కూ టీమ్ కూడా ఘటనా స్థలానికి చేరుకునేలా చర్యలు చేపట్టారు. ఇటీవల ఉత్తరాఖండ్ సొరంగంలో చిక్కుకుపోయిన సందర్భంలో రెస్కూ చేసిన ప్రత్యేక బృందాలను సైతం రప్పిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. రెస్కూ ఆపరేషన్ సక్సెస్‌పై ఆదివారం స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దోమలపెంట వద్ద ప్రమాదం జరిగిన ఇన్లెట్ స్థలాన్ని నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్ చంద్ర పవార్ శనివారం సందర్శించారు. ప్రమాదం జరిగిన తీరును, అందుకు గల కారణాలను అక్కడి ఇంజనీర్లతోపాటు ప్రమాదం నుంచి బయటపడిన సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. వారి వెంట దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డి, ఏసీపీ మౌనిక ఉన్నారు.
ఎల్ఎల్బీసీ సొరంగ మార్గం 43 కిలోమీటర్ల మేర టీబీఎం మిషన్‌తో తవ్వాల్సి ఉంది. శ్రీశైలం వైపు నుంచి(ఇన్లెట్) ఒక టీబీఎం మిషన్‌తో మన్నెవారిపల్లి(అవుట్లెట్) నుంచి మరో టీబీఎం మిషన్‌తో ఏకకాలంలో సొరంగం తవ్వకం పనులు మొదలుపెట్టారు. శ్రీశైలం నిండిన ప్రతీసారి కొన్నినెలల పాటు నీటిఊటతో తవ్వకం పనులకు ఆటంకం కలుగుతుంది. దీనివల్ల ఇప్పటివరకు అటువైపు నుంచి 13.956 కిలోమీటర్ల మేర మాత్రమే సొరంగం పూర్తయ్యింది మన్నెవారిపల్లి వైపు నుంచి సుమారు 20కిలోమీటర్ల మేర పూర్తయ్యింది.
మరో 9 కిలోమీటర్లకు కొంచెం అటూఇటుగా సొరంగం తవ్వాల్సి ఉంది. దీని కోసం ఇన్లెట్ వైపు నుంచి శ్రీశైలం నీటి ఊట తగ్గడంతో నాలుగు రోజుల కిందట పనులు మొదలుపెట్టారు. కానీ అవుట్లెట్ వైపు ఉన్న టీబీఎంలో బేరింగ్ ఫెయిల్ అవ్వడంతో కొద్ది నెలలుగా పనులు నిలిచిపోయాయి. ఈ బేరింగ్ అమెరికాలోని రాబిన్సన్ కంపెనీ నుంచి రావాల్సి ఉండగా అది చెన్నై పోర్ట్‌కు చేరుకున్నట్లు తెలిసింది. ఇది కూడా ప్రాజెక్టు స్థలానికి చేరుకుంటే అవుట్లెట్ వైపు నుంచి కూడా పనులు మొదలుకానున్నాయి. రెండు మిషన్లు నిత్యం పని చేస్తే నెలకు ఒక కిలోమీటర్ మేర సొరంగం పనులు పూర్తి చేయవచ్చని అధికారులు చెప్తున్నారు. కానీ సొరంగ మార్గం డిజైనే అత్యంత క్లిష్టమైంది అవడంతో పనుల కొనసాగింపుపై తీవ్ర ప్రభావం పడుతున్నది. దాంతో తరుచూ పనుల్లో అంతరాయాలు చోటుచేసుకుంటున్నాయి.