గరిడేపల్లి,ఫిబ్రవరి 21 : ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఆరోపణల నేపథ్యంలో నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి వ్యవసాయ శాఖలో ఏడీఏగా పని చేస్తున్న కిరణ్కుమార్ నివాసాల్లో ఐటీ, ఏసీబీ అధికారులు శనివారం ఏక కాలంలో మెరుపు దాడులు నిర్వహించారు. మహబూబ్నగర్ ఏసీబీ డీఎస్పీ సీహెచ్ బాలకృష్ణ నేతృత్వంలో బృందాలుగా విడిపోయి మొత్తం ఏడు చోట్ల సోదాలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. కిరణ్కుమార్ స్వగ్రామమైన పొనుగోడులో తెల్లవారుజాము నుంచే తనిఖీలు ప్రారంభమయ్యాయి.
నేరేడుచర్లతో పాటు ఆయనకు భాగస్వామ్యం ఉన్న చిల్లేపల్లి గ్రామ శివారులోని ఓ రైసు మిల్లులోనూ అధికారులు తనిఖీలు చేపట్టారు. అలాగే కల్వకుర్తిలోని కార్యాలయం, గడ్డిపల్లిలోని అత్తగారి నివాసం, అనంతగిరి మండలం అమీనాబాద్ ,సూర్యాపేట,రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలోని ఇండ్లలో సైతం సోదాలు నిర్వహించినట్లు ఏసీబీ వర్గాలు తెలిపాయి.
గతంలో ఆయన సూర్యాపేట డీఆర్డీ పీడీగా పని చేసిన కాలంలో భారీగా ఆస్తులు కూడబెట్టారనే ఫిర్యాదులు రావడంతో సుమోటోగా కేసు నమోదు చేసి ప్రాథమిక సమాచారంతో సోదాలు చేపట్టారు. పూర్తి వివరాలను తర్వాత వెల్లడిస్తామని అధికారులు తెలిపారు. తనిఖీలు జరుగుతున్న సమయంలో కిరణ్కుమార్ పొనుగోడులోనే ఉన్నారు. దర్యాప్తులో భాగంగా ఆయనను ఏసీబీ అదికారులు వెంట తీసుకెళ్లినట్లు సమాచారం. స్వాధీనం చేసుకున్న నగదు, పత్రాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.