మిర్యాలగూడ టౌన్, మే 8: నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో అవినీతి కార్యకలాపాలు, అవకతవకలు జరుగుతున్నాయన్న విస్వనీయ సమాచారంతో నల్లగొండ రేంజ్ ఏసీబీ డీఎస్పీ జగదీశ్చంద్ర, అతడి బృందం గురువారం ఆకస్మికంగా దాడులు నిర్వహించింది. మున్సిపల్ కార్యాలయంలోని రికార్డులు, ఆర్థిక లావాదేవీలు, పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు, కార్యాలయ మొత్తం పనితీరును తనిఖీ చేయడంతో అవకతవకలు జరిగినట్లు అధికారులు నిర్ధారించారు. 2025-2026లో పన్ను మదింపు రూ.24.86 కోట్లు కాగా కేవలం రూ.9.17 కోట్లు వసూలు కాగా రూ.15.68 కోట్లు బకాయిగా మిగిలిపోయాయి. పన్నుల వసూలులో నిర్లక్ష్యం చేయడంతో ప్రభుత్వ ఆదాయానికి భారీ నష్టం కలుగుతోంది. 2025-26లో మిర్యాలగూడ మున్సిపాలిటీలో మొత్తం 1,756 దుకాణాలకు పన్ను మదింపు రూ.43.3 లక్షలు కాగా అందులో రూ.28.35 లక్షలు చెల్లించగా రూ.14.95 లక్షలు బకాయిలు చూపారు. 2026-27లో 1,783 దుకాణాలకు మదింపు రూ.36.18 లక్షలు కాగా కేవలం రూ.15.01 లక్షలు మాత్రమే చెల్లించారు.
రూ.21.17లక్షలు బకాయి ఉన్నట్లు గుర్తించారు. తనిఖీలు జరుగుతున్న సమయంలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ బోలుగురి వెంకన్న అధికారిక అనుమతి లేకుండా గైర్హాజరైనట్లు గుర్తించారు. చేయూత పెన్షన్, జనన, మరణ విభాగంలో 116 జనన దరఖాస్తులు, ఒక మరణ దరఖాస్తు 7 రోజుల ప్రొసెసింగ్ గడువు మించిపోయినట్లు గుర్తించారు. పోర్టల్ ఎంట్రీ ఆప్షన్ లేకపోవడంతో 1,820 పెన్షన్ దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. టౌన్ ఫ్లానింగ్‌లో భవన నిర్మాణ అనుమతుల ద్వారా వచ్చే రాబడి వసూళ్లు రూ.3.25 కోట్ల (2024-25) నుంచి రూ.3.05 కోట్ల (2025-26)కు పడిపోయాయి. ఇది అధికారుల పేలవమైన పనితీరును సూచిస్తోందని ఏసీబీ గుర్తించింది. 2025-26 సంవత్సరానికి మ్యుటేషన్ దరఖాస్తులు భారీగా పెండింగ్‌లో ఉన్నాయి. 86 దరఖాస్తులలో 61 పెండింగ్‌లో ఉన్నట్లు గుర్తించారు. ప్రజా అభ్యర్థనలను సరిగా పరిష్కరించడం లేదని తెలిపారు.
2026-27 సంవత్సరానికి ఆమోదాలలో వ్యత్యాసాలు ఉన్నాయని, 34 ఆమోదిందించినా కేవలం 18 మాత్రమే అందాయి. రికార్డుల నిర్వహణలో అవకతవకలకు పాల్పడ్డారని తెలిపారు. భవన అనుమతి, లే అవుట్, ఆక్రమణ మొదలైన రిజిష్టర్లను సరిగా నిర్వహించడం లేదని, మూడు రిజిష్టర్లు మాత్రమే పాక్షికంగా ఉంచారని, వాటిపై అధికారి సంతకాలు లేవని గుర్తించారు. అనేక భవన ఆనుమతి దరఖాస్తులు 21 రోజుల గడువును మించి పోయాయన్నారు. అనధికార నిర్మాణాలపై వచ్చిన 54 ఫిర్యాదులపై ఎలాంటి చర్యలు లేకుండా పెండంగ్‌లో ఉన్నాయన్నారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు భారీగా పెండింగ్‌లో ఉన్నాయన్నారు. 4,638 ప్రాసెస్ చేయలేదని, రూ.15 కోట్లు వసూలు కాలేదన్నారు.
ఇది అధికారుల లోపాన్ని ప్రతిబింబిస్తోందని తెలిపారు. కార్యాలయంలో వ్యక్తిగత నగదు రిజిష్టర్‌ను నిర్వహించపోవడంతో సిబ్బంది వద్ద నగదుకు జవాబుదారీతనాన్ని ధృవీకరించడం కష్టమైందని తెలిపారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల హాజరు రిజిష్టరు ప్రకారం 2026 మార్చిలో కొందరు కొన్ని రోజులుగా గైర్హాజరు అయ్యారని గుర్తించారు. పూర్తి నెల జీతాలు ైక్లెయిమ్ చేసినట్లు గుర్తించామని తెలిపారు. ఇందనఛార్జీలు నెలకు రూ.19.33 లక్షలు ైక్లెయిమ్ చేశారని చెప్పారు. వాటికి సరైన రికార్డులు నిర్వహించలేదని తెలిపారు. వాహనాలకు లాగ్‌బుక్ నిర్వహించడం లేదన్నారు. కేటాయించిన వాహనాలకు సరైన రికార్డులు నిర్వహించలేదన్నారు. ప్రభుత్వానికి నివేదిక సమర్పించామని ఏసీబీ అధికారులు తెలిపారు.