పెద్దవూర: తెలంగాణ రాష్ట్రం నూతనంగా ఏర్పాటైన తర్వాత నూతన గ్రామ పంచాయతీల ఏర్పాటుతో చిన్న గ్రామ పంచా యతీలు ఘనణీయమైన అభివృద్ధిని సాధిస్తున్నాయి. అందులో భాగంగానే పెద్దవూర మండలంలోని బట్టుగూడెం నూతన గ్రామ పంచాయతీగా ఏర్పడింది. దానికి తోడు తెలంగాణ ప్రభుత్వం గ్రామాలు మరింత అభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో పల్లె ప్రగతి కార్యక్రమం చేపట్టి గ్రామాలకి ప్రత్యేక నిధులు కేటాయించడంతో బట్టుగూడెం అన్ని వసతులతో అభివృద్ధిలో దూసుకెళ్తున్నది.
గ్రామంలో పల్లె ప్రగతి , హరితహారం కార్యక్రమంలో భాగంగా బట్టుగూడెం నుంచి వెల్మగూడెం, బట్టుగూడెం నుండి ముసలమ్మ చెట్టు , ముసలమ్మ చెట్టు నుంచి పెద్దవూర , ముసలమ్మ చెట్టు నుంచి తెప్పలమడుగు వరకు గ్రామ పంచాయతీల పరిధిలో 8కిలోమీటర్ల మేర లింకు రోడ్ల వెంబడి సూమరు 35 వేల మొక్కలు నాటి వాటిని నిరంతరం సంరక్షిస్తున్నారు.
గ్రామంలో అన్ని వీధుల్లో మురుగు కాలువలు నిర్మించారు, ఇంకుడు గుంతల నిర్మాణం వంద శాతం పూర్తి చేశారు. డంపింగ్ యార్డు, వైకుంఠధామాలను అందుబాటులోకి తీసుకువచ్చారు. అదేవిధంగా గ్రామంలో పడావు బడి ఉన్న 8పాత బావులను పూడ్చి వేశారు. ప్రభుత్వ సహకారంతో గ్రామం అన్నివిధాలా అభివృద్ధి చెందుతున్నదని సర్పంచ్ చామకురి చిన్నలింగారెడ్డి, గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.