సూర్యాపేట, జనవరి 30 (నమస్తే తెలంగాణ) : పేదల వైద్య చికిత్స కోసం ప్రభుత్వం ఇచ్చే ఆరోగ్య శ్రీ పథకాన్ని సూర్యాపేటలో అక్రమార్కులు ఆదాయ వనరుగా మార్చుకున్నారు. జిల్లా కేంద్రంలోని జనరల్ ఆసుపత్రిలో ఆపరేషన్ చేసిన డాక్టర్లు, సిబ్బందికి అందాల్సిన నగదు చికిత్సలో పాల్గొనని డాక్టర్ల అక్కౌంట్లలో డబ్బులు జమైనట్లు తెలుస్తున్నది. ఆరోగ్యశ్రీ కింద ప్రభుత్వ ఆసుపత్రుల్లో శస్త్రచికిత్సలు చేసినా సర్కారు డబ్బులు ఇస్తుంది. అందులో 40 శాతం ఆసుపత్రి అభివృద్ధికి వినియోగించాల్సి ఉండగా, మిగిలిన 60 శాతం నగదును శస్త్రచికిత్సలో పాల్గొన్న డాక్టర్లు, స్టాఫ్ నర్సులు, పారామెడికల్ సిబ్బందితోపాటు నాలుగవ తరగతి ఉద్యోగులకూ అందిస్తారు. కాగా, ఈ 60 శాతం నగదు ఆపరేషన్లతో సంబంధం లేని డీఏఓలతోపాటు బయటి వ్యక్తుల అకౌంట్లలో కూడా జమమైనట్లు ఆసుపత్రి వర్గాల ద్వారా తెలిసింది.
గత బీఆర్ఎస్ హయాంలో మెరుగైన వైద్య చికిత్స అందించడంలో సూర్యాపేట జనరల్ ఆసుపత్రి ఎంతో పేరు సంపాదించుకున్నది. మాజీ మంత్రి, స్థానిక గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ప్రత్యేక చొరవతో ఆసుపత్రికి ఏ సౌకర్యం కావాలన్నా వెంటనే వచ్చేది. దాంతో ఈ ఇక్కడ సాధారణ ప్రసవాలతోపాటు పలు విభాగాల్లో చికిత్సలు రికార్డులు సృష్టించాయి. కొవిడ్ సమయంలో జిల్లా నలుమూలల నుంచే నల్లగొండ, జనగాం, హైదరాబాద్‌తోపాటు పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా అనేక మంది వచ్చి ఇక్కడ చికిత్స పొంది ఆరోగ్యంగా ఇండ్లకు వెళ్లారు. అలాంటిది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆసుపత్రి నిర్వహణ అధ్వానంగా తయారైంది. ఎవరికి వారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండడంతో అక్రమాలు పెరిగాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. డాక్టర్లు అందుబాటులో ఉండరు. మందులు ఉండవు. అంబులెన్స్‌లు దొరుకవు. ప్రైవేట్ వ్యక్తులు వచ్చి డాక్టర్ అవతారమెత్తి ఆసత్రిలో హడావిడి చేసినా గుర్తించేవారు లేరు. డబ్బులు తీసుకుని అక్రమ సర్టిఫికెట్లు ఇచ్చేవాళ్లూ తయారయ్యారు. తాజాగా ఆరోగ్య శ్రీ నిధులనూ నకిలీలు దండుకుంటున్నారు.
సంబంధం లేని వ్యక్తులకు డబ్బులు
సూర్యాపేట జనరల్ ఆసుపత్రిలో సగటున రోజుకు పది నుంచి పదిహేను ఆపరేషన్లు జరుగుతుండగా, ఆరోగ్యశ్రీ ద్వారా శస్త్రచికిత్సలకు అందే నగదుపై అక్రమార్కులు కన్ను పడింది. అలా సంబంధం లేని వారి అకౌంట్లలోకి డబ్బు బదిలీ అవుతున్నది. ఆరోగ్యశ్రీ కింద ప్రభుత్వ దవాఖానలో శస్త్రచికిత్స చేస్తే ఆపరేషన్‌లో పాల్గొన్న డాక్టర్లకు 35శాతం, స్టాఫ్ నర్సులకు 10, పారామెడికల్ సిబ్బందికి 10శాతం, నాలుగో తరగతి ఉద్యోగులకు 5 శాతం బిల్లు చెల్లిస్తారు. ప్రతి ఆరు నెలలు లేదా ఏడాదికోసారి ఈ నిధులు వస్తాయి. సూర్యాపేట జనరల్ ఆసుపత్రిలో మాత్రం శస్త్రచికిత్సల్లో పాల్గొనని డాక్టర్లతోపాటు అసలు ఏ సంబంధమూ లేని డీఏఓల అకౌంట్లలో రూ.8వేల నుంచి 35వేల వరకు జమయ్యాయి. ఒక డీఏఓ అకౌంట్లో రూ.35వేలు పడగా, ఆయన భార్యకు, డిపార్ట్మెంట్కు సంబంధం లేని బావమరిదికి రూ.14వేల చొప్పున అందాయి. బయటి వ్యక్తుల అకౌంట్లలోనూ నిబంధనలకు విరుద్ధంగా డబ్బులు వేసినట్లు ఆసుపత్రి వర్గాల ద్వారా తెలిసింది.