కట్టంగూర్, ఫిభ్రవరి 04 : గడ్డి మందు తాగి యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన కట్టంగూర్ మండలంలోని ఇస్మాయిల్ పల్లి గ్రామంలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకొంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కొత్త నాగరాజు(29) వృత్తి రీత్యా తాపీ మేస్తి. మూడు సంత్సరాల క్రితం మండలంలోని పేరిందేవిగూడెం గ్రామానికి చెందిన బొప్పని సూరయ్య కుమార్తె రాజేశ్వరీతో వివాహం జరిగింది. గత కొంత కాలంగా నాగరాజు తాగుడుకు బానిసై పనికి వెళ్లడం మానేశాడు. కూలీ పనికి వెళ్లకపోతే ఇల్లు ఎట్లా గడుస్తుందని భార్య రాజేశ్వరీ అడిగినా నాగరాజులో మార్పురాలేదు.
రాజేశ్వరీ నాలుగు రోజుల క్రితం కుమార్తెను తీసుకుని తల్లిగారింటికి వెళ్లిపోయింది. దీంతో మనస్థాపానికి గురైన నాగరాజు గ్రామ శివారులోని అజయ్ కుమార్ రెడ్డి వ్యవసాయ పాలం వద్ద మోనోక్రోటోపాస్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి శవానికి పంచనామా చేసి పోస్టు మార్టం కోసం నకిరేకల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బుధవారం మృతుడి తండ్రి నర్సింహ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ మునుగోటి రవీందర్ తెలిపారు.