యాదాద్రి భువనగిరి, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ) / భువనగిరికలెక్టరేట్ : బీఆర్ఎస్ పార్టీకి పూర్వవైభవం ప్రారంభమైందని, భవిష్యత్తులో సాధించబోయే అఖండ విజయాలకు యాదాద్రి భువనగిరి జిల్లా గడ్డ పునాది వేసిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పరిషత్ ఎన్నికల్లో జెడ్పీ స్థానాలను గెలుచుకొని భువనగిరి ఖిలాపై గులాబీ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. ఇటీవల గెలిచిన బీఆర్ఎస్ సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లకు గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఆత్మీయ సన్మానం జరిగింది. సన్మాన కార్యక్రమంలో కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై బీఆర్ఎస్ తరఫున గెలిచిన ప్రజా ప్రతినిధులను సన్మానించారు. పార్టీ విజయం కోసం క్షేత్ర స్థాయిలో కష్టపడి పనిచేసిన పార్టీ నాయకులు, కార్యకర్తలను ఆయన అభినందించారు. సవాళ్లు ఎదురైనప్పటికీ గ్రామస్థాయిలో బీఆర్ఎస్కు నిరంతరం మద్దతు ఇస్తున్నందుకు జిల్లా వ్యాప్తంగా ఉన్న ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు.
అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ సర్పంచ్ ఎన్నికలతో మార్పు మొదలైందని, ఇది సామాన్య గెలుపు కాదన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో కంటే సర్పంచ్ ఎన్నికల్లో గెలవడం చాలా కష్టమన్నారు. పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయంతో రాష్ట్రంలో పార్టీకి ఉత్సాహం, బలం వచ్చిందన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో రెండున్నరేండ్ల క్రితం భువనగిరి, ఆలేరుకు వచ్చినప్పుడు రెండు స్థానాలు పక్కాగా గెలుస్తామనే వాతావరణం కనిపించిందని, కానీ దురదృష్టవశాత్తు రెండూ ఓడిపోయామని, రెండేండ్లు తిరగక ముందే అదే ప్రాంతంలో గులాబీ తోట వికసించిందని అన్నారు. భువనగిరిలో 56, ఆలేరులో 74, చౌటుప్పల్‌లో 15, తుంగతుర్తిలో 9, నకిరేకల్‌లో 7 స్థానాలు గెలిచామన్నారు.
భువనగిరిలోని పార్టీ కార్యాలయంలో పండుగ వాతావరణం నెలకొందని, వచ్చే మూడేండ్లు ఇది కొనసాగాలన్నారు. పేదల ఫంక్షన్ల కోసం పార్టీ కార్యాలయం ఇవ్వాలన్నారు. పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటామని, జిల్లాకో లీగల్ సెల్ ఏర్పాటు చేస్తామన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ వికృత పోకడలు పోతున్నదని, అరాచకాలు సృష్టిస్తోందని విమర్శించారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలోఎన్నడూ అరాచకాలు, దౌర్జన్యాలు జరగలేదన్నారు. జనవరి నుంచి పార్టీ బలోపేతంపై ఫోకస్ పెడతామని, సభ్వత్వ నమోదు, శిక్షణ శిబిరాలు, కమిటీలు వేసుకొని, బీఆర్ఎస్ను బలోపేతం చేసుకుందామన్నారు.
‘’25 ఏండ్లుగా ఈ ప్రాంతంలో బీఆర్ఎస్ బలంగా ఉంది. ప్రజా సమస్యలపై గళం వినిపించాలి. మళ్లీ కేసీఆర్ సీఎం అయ్యేందుకు అంతా కంకణబద్ధులమై కొట్లాడుదాం. దారి తప్పిన వ్యవస్థను గాడిలో పెట్టడానికి కేసీఆర్‌ను గెలపించే వరకు పోరాడాలి. సర్పంచ్ల గెలుపు స్ఫూర్తిదాయకం. ఉత్సాహన్నిచ్చింది. మీరు ఎప్పుడు పిలిచినా కష్టసుఖాల్లో పాలుపంచుకుంటా. సర్పంచ్‌లు, ఎంపీటీసీలు సమన్వయంతో పనిచేయాలి. ఆలేరు, భువనగిరిలో గతంలో జరిగిన పొరపాట్లను మళ్లీ పునరావృతం కానివ్వొద్దన్నారు. ఉద్యమకారులంతా ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. పార్టీ బీఫామ్‌పై జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు తిరుగులేని విజయం అందించాలి.” అని కేటీఆర్ కోరారు.
మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వ మాజీ విప్ గొంగిడి సునీతామహేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, గాదరి కిశోర్ కుమార్, చిరుమర్తి లింగయ్య, బూడిద భిక్షమయ్య గౌడ్, బీఆర్ఎస్ నేతలు గొంగిడి మహేందర్ రెడ్డి, క్యామ మల్లేష్, చింతల వెంకటేశ్వర్ రెడ్డి, కల్లూరి రామచంద్రారెడ్డి, పల్లె రవి, తుంగబాలు, బాలరాజు యాదవ్, జడల అమరేందర్, కొలుపుల అమరేందర్, నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

భువనగిరి కలెక్టరేట్, డిసెంబర్ 18: “అధికారులు..పోలీసులు కాంగ్రెస్ తొత్తుల్లా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో పూర్తిగా అరాచక పాలన సాగుతోంది. అధికారులు, పోలీసు లు పూర్తిగా ప్రభుత్వానికి తొత్తులుగా మారి, కాంగ్రెస్ కార్యకర్తలను మరిపిస్తున్నారు. ఉద్యమ నేపథ్యం కలిగిన రాష్ట్ర ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రావడం తథ్యం.” అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికల్లో పలు గ్రామాల్లో తమ పార్టీ బలపర్చిన సర్పంచ్‌లు గెలిచినా ఓడినట్లుగా అధికారులు వ్యవహరించారని, వారిని మళ్లీ సర్పంచ్‌లుగా గెలిపించే వరకు విడిచిపెట్టేదిలేదన్నారు. కాంగ్రెస్ నేతల అరాచకాల చిట్టా ను పింక్‌బుక్‌లో నమోదు చేసుకుంటున్నామని, ఎవరినీ వదిలిపెట్టేది లేదన్నారు.

రానున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కార్యకర్తలు తమ సత్తా చాటాలని భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. పది సంవత్సరాల్లో కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రచారం చేయాలన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో మన సత్తా ఏమిటో కాంగ్రెస్‌కు చూపించామన్నారు.
గ్రామాల్లో సర్పంచులను గెలిపించుకొని ఏ విధంగా విజయం సాధించారో.. అదే స్ఫూర్తితో ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో విజయం సాధించాలని మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి అన్నారు. గత పది సంవత్సరాలుగా గ్రామాల్లో కేసీఆర్ చేసిన అభివృద్ధి కళ్లకు కనబడుతోందన్నారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అభివృద్ధి పనులను గుర్తించే ఓటర్లు పంచాయతీ ఎన్నికల్లో సర్పంచులను గెలిపించారని మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్యగౌడ్ అన్నారు. ప్రతి కార్యకర్త పట్టుదలతో రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
మాజీ సీఎం కేసీఆర్ కేటాయించిన నిధుల వల్లే గ్రామాల్లో అభివృద్ధి పనులు జరిగాయని, గ్రామాల్లో జరిగిన అభివృద్ధిని చూసే ఓటర్లు తమ గ్రామాల్లో సర్పంచులు వార్డు మెంబర్లతో సహా గెలిపించుకున్నారని తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ అన్నారు. వచ్చేది మనమేనని పేర్కొన్నారు.
అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చక ప్రజలను మోసం చేసిందని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. గ్రామీణ ప్రాంత ఓటర్లు పట్టుదలతో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించారని అన్నారు. సర్పంచులు గెలుపుతో రానున్న రోజుల్లో గులాబీ జెండా రెపరెపలాడటం ఖాయమని ఆయన అన్నారు.
తెలంగాణ అభివృద్ధి ప్రదాత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసేదాకా ఎవరూ విశ్రమించొద్దని, పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించిందని, అదే స్ఫూర్తితో రానున్న ఎన్నికల్లో ప్రతి కార్యకర్త బీఆర్ఎస్ గెలుపునకు కృషి చేయాలని మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అన్నారు.
పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం కాం గ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టు. కేసీఆర్ నాయకత్వంలో రానున్న రోజుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అన్నారు.
బీఆర్ఎస్ కార్యకర్తలపై ఈగ వాలిగానా కేటీఆర్ ఊరుకోరని, కార్యకర్తల సంక్షేమం కోసం పాటుపడతారని మాజీ రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం, నాయకులు, కార్యకర్తలు దోచుకో.. దాచుకో.. పంచుకో అనే సిద్ధాంతంతో ఉన్నారన్నారు. గ్రామ పరిపాలన కేసీఆర్‌తోనే సాధ్యమన్నారు.
బీఆర్ఎస్ పార్టీ 60లక్షల సభ్యత్వాలు కలిగిన పెద్ద పార్టీ అని, పార్టీ గుర్తులు లేకున్నా ప్రజల అశీస్సులు ఉన్నాయని నిరూపిస్తూ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గులాబీ పార్టీకి ప్రజలు పట్టం కట్టారని కాంగ్రెస్‌కు ఈ ఎన్నికల్లో ప్రజలు కర్రు కాల్చి వాతపెట్టారని బీఆర్ఎస్ పార్లమెంట్ ఇంచార్జి క్యామ మల్లేష్ అన్నారు.