‘నల్లగొండ పట్టణ ప్రగతికి ద్విముఖ వ్యూహం అమలు చేస్తున్నాం. పట్టణాన్ని ఇండోర్, అవుట్ డోర్గా విభజించి.. ఇండోర్‌లో మున్సిపల్ సిబ్బందిని, అవుట్ డోర్లో అభివృద్ధి పనులు, ప్రజా సమస్యలను తీసుకుని వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ముందుకు సాగుతున్నాం. ముఖ్యమంత్రి కేసీఆర్ నల్లగొండను రాష్ట్రంలో ఆదర్శ పట్టణంగా చేయాలని సంకల్పించారు. ఆ మేరకు రోడ్ల విస్తరణ, రైతుబజార్, వైకుంఠధామం, ఐటీ హబ్, మెడికల్ కళాశాల భవనం, ఎన్జీ కళాశాల భవనం, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, పార్కులు, జంక్షన్ల ఆధునీరణ చేపడుతున్నాం. ఇవేకాకుండా సుమారు రూ.1400 కోట్లతో వివిధ రకాల అభివృద్ధి పనులు చేపడుతున్నాం.
ఈ నెలాఖరు నుంచి జూన్ చివరి నాటికి అంచెలంచెలుగా పనులు పూర్తి చేస్తాం. పట్టణ ప్రగతిలో భాగంగా ఎల్ఈడీ లైట్లు, త్రీపేజ్ విద్యుత్ లైన్లు ఏర్పాటు చేసి ప్రతినెలా రూ.17.50 లక్షల విద్యుత్ ఆదా చేస్తుండడంతో రాష్ట్ర స్థాయిలో గోల్డెన్ అవార్డు వచ్చింది’ అని నల్లగొండ మున్సిపల్ కమిషనర్ డాక్టర్ కేవీ రమణాచారి అన్నారు. సీఎం కేసీఆర్ నల్లగొండలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టి పూర్తయిన సందర్భంగా తెలంగాణతో ఇంటర్వ్యూ.
– నీలగిరి, జనవరి 5
నమస్తే తెలంగాణ : పట్టణంలో ఏం అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. అవి ఎప్పుడు పూర్తవుతాయి?
కమిషనర్ : సుమారు రూ.1400 కోట్ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. జూన్ చివరి నాటికి అన్నీ పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం. మర్రిగూడ జంక్షన్ నుంచి వివేకానంద విగ్రహం వరకు మిగిలిన విద్యుత్ స్తంభాల ఏర్పాటు పూర్తయింది. రహదారి విస్తరణ, ఫుట్‌పాత్‌లు, రోడ్డు విస్తరణలో ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నచోట ఇంటర్ లాకింగ్ టైల్స్ వేయుట, అప్రోచ్ రోడ్డు పనులు జనవరి 20లోగా.. పాతబస్తీ రోడ్డును జనవరి 15లోగా.. కేశరాజుపల్లి నుంచి కలెక్టరేట్ వరకు, కలెక్టరేట్ నుంచి డీఈఓ కార్యాలయం వరకు పనులను ఏప్రిల్‌లోగా.. రోడ్డు, పుట్‌పాత్, డివైడర్లు, డ్రైన్లు, డైట్ కళాశాల నుంచి డీఈఓ కార్యాలయం వరకు మే చివరి నాటికి పనులు పూర్తి చేసేలా ప్రణాళికలు తయారు చేశాం. మర్రిగూడ, క్లాక్‌టవర్ జంక్షన్లు ఇప్పటికే పూర్తి చేశాం.
ఎన్జీ కళాశాల, సుభాష్ విగ్రహం వద్ద పనులు జరుగుతున్నాయి. వాటిని ఫిబ్రవరిలో పూర్తి చేస్తాం. నేషనల్ హైవే అభివృద్ధి పనులు డీఈఓ కార్యాలయం నుంచి సాగర్ జంక్షన్ వరకు జనవరి చివరి నాటికి పూర్తి చేస్తాం. హెలిప్యాడ్ పనులు 80శాతం పూర్తయ్యాయి. స్టేజ్-2 కింద అటవీ శాఖ అనుమతులు రాగానే సీసీ అప్రోచ్ రోడ్డు పనులు పూర్తి చేస్తాం. పట్టణంలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులు అసంపూర్తిగా ఉండడంతో చాలా ఇబ్బందులు వస్తున్నాయని మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లగా రూ.18 కోట్లు విడుదల చేశారు. ఆ పనులు ఫిబ్రవరిలో పూర్తి చేసేలా అధికారులకు సూచించాం. సమీకృత వెజ్, నాన్ వెజ్ మార్కెట్ పనులు పూర్తి కావచ్చాయి. మిగిలిన ఎలివేషన్, వాటర్ ట్యాంక్, గోడ నిర్మాణ పనులు మార్చి చివరి నాటికి పూర్తి చేస్తాం. రైతుబజార్‌ను పది రోజుల్లో పూర్తి చేస్తాం. ఉదయసముద్రం, కళాభారతి డీపీఆర్ ప్రణాళిక ప్రకారం జనవరి చివరిలోగా పూర్తి చేయాల్సి ఉంది. అనధికారికంగా ఉన్న ఇండ్లను రెగ్యులర్ చేసి డిజిటల్ నెంబరింగ్ చేస్తున్నాం.
నమస్తే తెలంగాణ : నల్లగొండ పట్టణ ప్రగతిలో ప్రజల సహకారం ఎలా ఉంది?
కమిషనర్ : ప్రజలు సంపూర్ణ సహకారం అందిస్తున్నారు. హైదరాబాద్ రోడ్డులోని మర్రిగూడ జంక్షన్ నుంచి క్లాక్‌టవర్ వరకు, క్లాక్‌టవర్ నుంచి పెద్దబండ మీదుగా కలెక్టరేట్ వరకు.. పాతబస్తీ, దేవరకొండ రోడ్ల విస్తరణ, భాస్కర్ టాకీస్ నుంచి మిర్యాలగూడ రోడ్డు విస్తరణ చేపడుతున్నాం. వీటికి సంబంధించి 963 కట్టడాలు అడ్డు వస్తున్నాయి. వారికి నోటీసులు ఇవ్వగా.. ఒకరిద్దరు మినహా అందరూ అంగీకారం తెలిపారు. ఇప్పటికే రోడ్ల విస్తరణ పనులు జరుగుతున్నాయి. మర్రిగూడ, క్లాక్‌టవర్ జంక్షన్ల పనులు పూర్తి చేశాం.
నమస్తే : నల్లగొండ పట్టణానికి ఆదాయ మార్గాలు ఏమిటి?
కమిషనర్ : నేను ఇక్కడికి రాకముందు మున్సిపాలిటీకి ఏడాదికి 5కోట్ల నుంచి రూ.15 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చేది. రూ.8 కోట్లు ఉన్న ఆదాయాన్ని మూడు నెలల్లో రూ.13 కోట్లకు చేర్చడం జరిగింది. ప్రస్తుత అర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు రూ.22 కోట్లు వసూలయ్యాయి. మూడు నెలల్లో మరో నాలుగు కోట్లు వచ్చేలా ప్రణాళికలు తయారు చేశాం. వచ్చే సంవత్సరం మరో ఐదు కోట్ల ఆదాయం పెరిగేలా ప్రణాళికలు రూపొందిస్తున్నాం.
నమస్తే తెలంగాణ : నుడా ఏర్పాటుతో పట్టణానికి కొత్తగా
కమిషనర్ : నల్లగొండ పట్టణంతోపాటు మరికొన్ని గ్రామాలను కలిపి నీలగిరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (నుడా) ఏర్పాటు చేయడం జరిగింది. ఇందుకోసం మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేకంగా కార్యాలయాన్ని ఏర్పాటు చేసి కలెక్టర్, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో కమిటీని ఏర్పాటు చేశాం. పట్టణ అభివృద్ధికి ప్రత్యేకంగా మాస్టర్ ప్లాన్ రూపొందించి డ్రాఫ్ట్‌ను విడుదల చేశాం. నెలాఖరు వరకు ఫైనల్ చేసి అభివృద్ధి పనులు చేపడుతాం.
నమస్తే : పట్టణంలో ఇంకా చేయాల్సిన పనులు ఏమైనా ఉన్నాయా?
కమిషనర్ : రూ.133 కోట్లతో ఉదయం సముద్రం సస్పెన్షన్ బ్రిడ్జి (తీగల వంతెన), పట్టణ శివారులోని ఉదయ సముద్రం అలుగు నుంచి 350 మీటర్ల బ్రిడ్జి నిర్మాణానికి మున్సిపల్ అధికారులు ప్రణాళికలు తయారు చేశారు. ఇందులో ఐటీ టవర్ నుంచి ఉదయ సముద్రం వరకు ఏఎమ్మార్పీ కాల్వ వెంట సుమారు నాలుగు కిలోమీటర్ల రోడ్డు విస్తరణ చేయనున్నారు. ఉదయ సముద్రం కట్టను మరింత విస్తరించి ట్యాంక్‌బండ్‌గా అభివృద్ధి చేయనున్నాం. అక్కడ సెంట్రల్ లైటింగ్, సైకిల్ ట్రాక్, ఓపెన్ డక్ట్, పార్కులు, పట్టణ ప్రజలను ఆకట్టుకునేలా బొమ్మలతో సస్పెన్షన్ బ్రిడ్జి నిర్మాణం చేయనున్నాం. కళాభారతి డీపీఆర్‌ను నెలాఖరు నాటికి సిద్ధం చేస్తాం. సుమారు రూ.6 కోట్లతో వరద కాల్వ పనులు చేపట్టి వానకాలంలో ముంపు సమస్య లేకుండా చేస్తాం. జూన్ నాటికి పట్టణమంతా 24 గంటల పాటు తాగునీరు వచ్చేలా చర్యలు తీసుకుంటాం.
నమస్తే : మున్సిపల్ సిబ్బందిపై వస్తున్న ఆరోపణల విషయంపై..?
కమిషనర్ : మున్సిపాలిటీపై ప్రజలకు అపనమ్మకం, అభద్రతాభావం లేకుండా అన్ని చర్యలు చేపట్టాం. అవినీతికి తావు లేకుండా ప్రతిదీ ఆన్లైన్లో వచ్చేలా చర్యలు చేపట్టాం. ప్రజల సమస్యల పరిష్కారానికి టోల్‌ఫ్రీ నెంబర్ 14424ను, ప్రత్యేకంగా మున్సిపల్ యాప్‌ను ఏర్పాటు చేశాం. సిబ్బంది వసూలు చేసిన బిల్లులు పక్కదారి పట్టకుండా ఏ రోజు కలెక్షన్ ఆ రోజే బ్యాంకులో జమ చేయడం జరుగుతుంది. పేమెంట్స్ ఆన్లైన్లో చేసేలా వెసులుబాటు కల్పించాం. అధికారుల్లో జవాబుదారీతనం పెంచాం. అలసత్వం వహిస్తే వెంటనే చర్యలు తీసుకుంటున్నాం.