Tomato Farmers | నల్లగొండ సిటీ, మార్చి 29 : పంట ఏదైనా అష్టకష్టాలు పడి దిగుబడి తీసుకుని రైతులు తీరా మార్కెటింగ్‌కు వచ్చే సరికి డీలా పడుతున్నారు. వేసవి, నీటి ఎద్దడి నేపథ్యంలో వరికి బదులు కూరగాయల సాగు వైపు మొగ్గు చూపిన రైతులు ఇప్పుడు సరైన ధర లేక కుదేలవుతున్నారు. మార్కెట్లో ధర అమాంతం పడిపోవడంతో దళారులు కిలో మూడు రూపాయలకు మించి ఇవ్వడం లేదని రైతులు వాపోతున్నారు. దాంతో పెట్టుబడులు వెళ్లడం అటుంచి.. పంట కోస్తే కూలీల ఖర్చులు కూడా వెళ్లని పొలంలోనే వదిలేస్తున్నట్లు చెప్తున్నారు.
గతంలో కేజీ రూ.100 వరకు కూడా టమాట అమ్మిన రోజులు లేకపోలేదు. కానీ అదే టమాట ధర అమాంతం పడిపోవడంతో రైతులు అప్పుల పాలవుతున్నారు. నెల రోజుల క్రితం వరకు బహిరంగ మార్కెట్లో కిలో టమాట ధర 20 నుంచి 30 రూపాయల వరకు పలికింది. ఇప్పుడు కిలో రూ.10 నుంచి 20 రూపాయలకు అమ్ముతున్నారు.
కానీ అదే దళారులు రైతులకు మాత్రం కిలో 3 రూపాయలకు మించి ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలో పంట కోసి, మార్కెట్‌కు తరలించాలంటే కూళ్లు, రవాణా ఖర్చులకు సరిపోవని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనగల్ మండలం చిన్నమాదారం గ్రామపంచాయతీ పరిధిలోని ఎర్రగూడేనికి చెందిన రైతు ఈద గోవింద్ తనకున్న ఎకరంన్నరతోపాటు మరో రెండెకరాలు కౌలుకు తీసుకుని నర్సరీ నుంచి టమాట నారు తెచ్చి పోశాడు.
కౌలుకు రూ.40 వేలు, దున్నకం, నారు, నాటుకూళ్లు, మందులకు కలిపి మరో రూ.2 లక్షల వరకు ఖర్చు చేశాడు. తీరా పంట చేతికి వచ్చే సరికి టమాట ధర అమాంతం పడిపోవడంతో పెట్టుబడి కూడా వెళ్లని పరిస్థితి నెలకొంది. కూలీలను పెట్టి టమాటలు కోసి 100 బాక్సులను ఆటోలో మార్కెట్‌కు తరలిస్తే రూ.4వేలు మాత్రమే వచ్చాయి. దాంతో అదనంగా చేతి నుంచి ఖర్చులు మీద పడ్డాయి. ఇలాంటి పరిస్థితుల్లో చేసిదిలేక పంట కోయకుండానే తోటను అలాగే వదిలేయడంతో స్థానికులు గొర్రెలు, పశువులను
మేపుకొంటున్నారు.
కూళ్లు, ఆటో ఖర్చులకు చాలవు
నానా అవస్థలు పడి టమాట సాగు చేసి పంట తీసినం. పెట్టుబడికి రెండున్నర లక్షలు ఖర్చు అయింది. తీరా పంట చేతికి వచ్చేసరికి ధర లేకుండా పోయింది. కిలో మూడు రూపాయల లెక్కన అడుగుతున్నరు. ఆ రేటుకు అమ్మితే కూళ్లు, ఆటో ఖర్చులకు కూడా చాలవు. దాంతో గొర్ల మేతకు పెట్టినం. అప్పు తెచ్చి పెట్టుబడి పెట్టినం. ప్రభుత్వమే ఆదుకోవాలి.
-ఈద సుగుణమ్మ, మహిళా రైతు, చిన్నమాదారం